హాస్పిటల్ గదిలో ఆ వాతావరణం కాస్త గంభీరంగా మారింది. మహా చెప్పిన మాట విన్న విష్ణు కాస్త ఆశ్చర్యపోయాడు.
”అదేంటి మహా అలా అంటావు? వీర్ ఇదంతా ఏదో మన మీద ప్రేమతో చేస్తున్నాడని అనుకుంటున్నావా? లేదా దీని వెనుక వాడి సొంత స్వార్థం ఏదైనా ఉందా?” అడిగాడు విష్ణు సందేహంగా.
ప్రణతి కూడా జోక్యం చేసుకుంటూ, “కరెక్ట్ విష్ణు.. ఆస్తి కోసం ఎవరైనా ఇంత దూరం వస్తారా? పోనీ మనకి సాయం చేస్తున్నాడు సరే, కానీ మన ప్రమేయం లేకుండా ప్రతిదీ తానే డిసైడ్ చేయడం కొంచెం భయంగానే ఉంది” అంది.
మహా కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత దృఢమైన గొంతుతో బదులిచ్చింది.
”ప్రణతి, విష్ణు.. మీ ఇద్దరి భయం నాకు అర్థమవుతోంది. కానీ ఒక్కటి ఆలోచించండి. నాన్న ఆనంద్ ప్రతాప్ ఆస్తిని, మా కుటుంబాన్ని జత చేయాలని అనుకుంటే సరే.. కానీ అమ్మ కి అన్యాయం ఎవరు ఎలా చేసారో..వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే నాకు అవకాశం కావాలి విష్ణు .ప్రస్తుతం వీర్ ఎవరికోసం చేస్తున్నాడో నాకు తెలుసు.. నా తండ్రి రక్తానికి న్యాయం జరగాలని తను కోరుకుంటున్నాడు. అందుకే నేను దీన్ని అడ్డుకోను. కానీ, నా పరిమితులు దాటనివ్వను!” అంది మహా, కళ్లలో కసి స్పష్టంగా కనిపిస్తుండగా.
అంటే.. నీ ఉద్దేశ్యం ఏంటి మహా.. అన్నాడు విష్ణు.
గతంలో ఏం జరిగిందో చాలా ముఖ్యం విష్ణు.. నేను కామ్ గా ఉండేది అందుకే.. అమ్మ కోలుకుని తన గతం చెప్పాలి..జరిగింది తెలుసుకునే వరకు వీర్ కి మనం వ్యతిరేకం గా ఉండొద్దు.. తనని అర్థం చేసుకోవాలి.. తను మనకి శత్రువు నా లేక మిత్రుడా అని.. అంది మహాలక్ష్మి.