సుప్రజ ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆపై చిన్నపాటి తికమక అలుముకున్నాయి. సురేంద్ర మాటల్లోని వాస్తవం ఆమె ఆలోచనలను అడ్డుకుంది.
”ఏంటండి మీరు మాట్లాడేది? అంత మాట అనేశారు?” అంది సుప్రజ కొంత తడబడుతూ.
”మరి నువ్వు చేస్తున్న పనులు ఎలాంటివి సుప్రజ? అప్పట్లో ఆ పిల్లని ఇంటి నుంచి పెళ్లి పేరుతో గెంటేయాలని చూశావు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు వెయ్యి కోట్ల ఆస్తి ఉందనేసరికి అప్పటికప్పుడు మాట మార్చి కోడలు కావాలంటావు. మహా అంత తేలిగ్గా మర్చిపోతుందనుకుంటున్నావా? దాని కళ్లలో ఉన్న కన్నీరు బాధ కసి గా మారడం చూశావుగా!” అన్నాడు సురేంద్ర తీవ్రమైన గొంతుతో.
సుప్రజ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత నెమ్మదిగా అంది, “అయినా… విష్ణుకి మహా మీద ఉన్నది నిజమైన ప్రేమే కదా! ఆ ఒక్క బలమే మనల్ని ఆ వైపు నడిపిస్తుంది. మహా మనసు మార్చడం విష్ణుకి పెద్ద కష్టమేం కాదు.”
”అది నీ భ్రమ సుప్రజ. విష్ణు ప్రేమను నమ్ముకుని మనం ఆస్తి కోసం పావులు కదిపితే, ఆ వీర్ గాడు ఊరుకోడు. వాడి చూపులు, వాడు వేస్తున్న అడుగులు చూస్తుంటే… నీ ప్లాన్లన్నీ మొదటికే మోసం వచ్చేలా ఉన్నాయి. ముందు సీత కి ఏం జరిగిందో, ఆ ఆనంద్ ప్రతాప్ డెత్ వెనుక అసలు నిజాలు ఏంటో బయటికి రానీ. ఆ తర్వాతే మన అడుగులు ఉండాలి” అని తేల్చి చెప్పాడు సురేంద్ర.
మౌనంగా తలూపింది సుప్రజ.