స్వయంసిద్ధ – 1
భాగం – 1
ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నాయి! రాత్రంతా వర్షం కురిసిన ప్రభావం పరిసర ప్రాంతంలో చల్లని గాలి రూపంలో విస్తరించి ఉంది!
రాత్రి కురిసిన వానకు రోడ్ల పక్కన చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రతిబింబిస్తున్న వీధి దీపాలు, ఉదయం మొదలైన వెలుతురు పడగానే మెల్లగా కనుమరుగవుతున్నాయి.
పాల ప్యాకెట్ల కోసం బయటకు వచ్చినవాళ్లు, ఆఫీసులకు వెళ్లడానికి బస్సుల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు, వీధి చివర బండి మీద వేడి వేడి ఇడ్లీలు అమ్ముతున్న వ్యక్తి చుట్టూ చేరిన వాళ్లతో రోడ్ అంతా రద్దీగా ఉంది!
అదే రోడ్ కి ఆనుకొని ఉన్న లైన్ లోని ఒక కాలనీలో, ఒక ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది జాహ్నవి.
ఇరవై నాలుగు సంవత్సరాల ఆమె ముఖంలో అమాయకత్వం ఉన్నా, కళ్లలో మాత్రం ఏదైనా తెలుసుకోవాలి, సాధించాలి అనే పట్టుదల కనిపిస్తుంది.
ఎదురుగా ఉన్న ఇంటి గోడకు అతికించిన పాత వార్తాపత్రిక పైనే ఆమె చూపు ఆగిపోయింది!
ఆ పేపర్ లో “యువతి ఆత్మహత్య. దానికి ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం.” అంటూ ఆ వార్త కింద ఉన్న చిన్న ఫొటోలో ఒక అమ్మాయి నవ్వుతూ ఉంది!
ఆ నవ్వులో బాధ ఉందా, భయం ఉందా, లేక సాధారణమైన సంతోషమే ఉందా అని ఫొటో చూసి చెప్పడం అసాధ్యం.
కానీ ఆ వార్త రాసిన వ్యక్తి మాత్రం ఆ అమ్మాయి చనిపోవడానికి కారణాన్ని అప్పుడే నిర్ణయించేసాడు. జాహ్నవి అసహనంగా ఆ పేపర్ నుండి చూపు తిప్పుకుంది.
“జాను! కాఫీ చల్లారిపోతుంది. అక్కడే నిలబడి ఏం చూస్తున్నావమ్మా?” వంట గదిలోంచి తల్లి సుజాత పిలిచింది.
“వస్తున్నానమ్మా!” అంటూ జాహ్నవి కిటికీ మూసి హాల్ లోకి వచ్చింది. చిన్న టేబుల్ మీద రెండు స్టీల్ గ్లాసులు, ఒక ప్లేట్‌లో ఇడ్లీలు, పక్కన కొబ్బరి చట్నీ ఉన్నాయి.
తండ్రి కృష్ణ మూర్తి అప్పటికే కుర్చీలో కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నారు. ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేసే ఆయనకు జీతం పెద్దగా లేకపోయినా, ఇంట్లో ఎవరికీ ఏ లోటూ తెలియకుండా చూసుకోవాలనే తపన ఎక్కువ.
“ఏమ్మా, ఈరోజైనా ఏమైనా ఫోన్ వచ్చిందా?” అని ఆయన పేపర్ మడుస్తూ అడిగారు. ఆయన మాట వినగానే జాహ్నవి కాసేపు మౌనంగా ఉండిపోయింది.
“లేదు నాన్నా.” అంటూ నిరాశగా అన్న జాను మాటలు వినగానే ఆయన ముఖంలో నిరాశ కనిపించింది.
“పోనీలే! ఇంకో చోట ప్రయత్నించు. ఎక్కడో ఒకచోట వస్తుంది.”
“ఎన్ని చోట్ల ప్రయత్నించాలి నాన్నా? ఆరు నెలలుగా అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాను. ఒక్క ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ గా మాట్లాడినా, చివరికి ఏదో ఒక కారణం చెప్పి పంపించేస్తున్నారు.”
“ఏం పని కావాలనుకుంటున్నావో అది కూడా ఒకసారి ఆలోచించాలి కదమ్మా! ఏదో ఒక ఉద్యోగంలో చేరితే సరిపోదా?” తల్లి ఇడ్లీలు వడ్డిస్తూ అంది.
“నాకు వార్తలు రాయాలని లేదు అమ్మా. వార్తల వెనుక ఉన్న నిజాలు తెలుసుకోవాలని ఉంది! ఒకరి గురించి అందరూ ఏదో అనుకుంటున్నప్పుడు, నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి.”
“అదేదో పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసేవాళ్లు చేస్తారు. నువ్వు ముందు ఏదో ఉద్యోగంలో చేరితే తర్వాత చూద్దువు గానీ!” అంటూ సుజాత అనగానే జాహ్నవి ఆమె వైపు చూసింది.
“అమ్మా! నేను ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. కానీ నాకు ఏ ఉద్యోగం చేయాలనిపిస్తుందో అది కూడా ముఖ్యం కదా!”
“ముఖ్యమే! కానీ మన పరిస్థితులు కూడా చూడాలి కదా జాను!” సుజాత గొంతులో కోపం లేదు. కూతురి భవిష్యత్తు గురించి ఉన్న భయం మాత్రమే ఉంది.
“మీ నాన్న జీతం ఎంతొస్తుందో నీకు తెలుసు కదా! ఇంటి అద్దె, కరెంటు బిల్లు, సరుకుల ధరలు అన్నీ పెరిగిపోతున్నాయి. నువ్వు ఉద్యోగం లో చేరితే ఆయనకు ధైర్యంగా ఉంటుంది!”
ఆ మాట వినగానే జాహ్నవి కి కొద్దిగా బాధేసింది! తల్లి తనను అర్థం చేసుకోవడం లేదని కాదు. తన కలలను అర్థం చేసుకోవడం లేదని!
“నాకు కూడా ఉద్యోగం చెయ్యాలనే ఉందమ్మా. నాన్న కి సహాయంగా ఉండాలనే ఉంది! కానీ ఏదో ఒకటి దొరికితే చాలు అని నా కలను పక్కన పెట్టలేను.” అంటూ జాహ్నవి అనగానే ఆమె వైపుగా చూసాడు కృష్ణ మూర్తి!
“కలలు కనడం తప్పు కాదు జాను. కానీ వాటి కోసం మనం ఎంత కష్టపడగలమో కూడా తెలుసుకోవాలి. నువ్వు ఎంచుకున్న పని మామూలు ఉద్యోగం కాదు. ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకు కూడా తెలుసు! ఎక్కడెక్కడికో వెళ్ళాలి! రాత్రి సమయంలో కూడా తిరగాల్సి వస్తుంది! తెలియనివాళ్లను ప్రశ్నించాలి! దాని కారణంగా గొడవల్లోకి వెళ్లాల్సి రావచ్చు! అలాంటప్పుడు నీ భద్రత విషయంలో మాకు భయం ఉండదా?”
“ఉంటుంది నాన్నా. మీకే కాదు! నాకు కూడా భయమే! భయం లేదని చెప్పడం ధైర్యం కాదు నాన్న! భయం ఉన్నా, అది నన్ను ఆపకూడదని అనుకోవడమే ధైర్యం.” అంటూ జాహ్నవి చెప్పిన మాటలు వినగానే సుజాత మరియు కృష్ణ మూర్తి ఇద్దరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు!
“సరే సరే! ముందు తిను! ఖాళీ కడుపుతో దేశాన్ని మార్చలేవు!” అంటూ సుజాత అనగానే జాహ్నవి మరియు కృష్ణ మూర్తి ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ నవ్వారు!
ఆ చిన్న నవ్వు ఆ ఇంట్లోని సీరియస్ డిస్కషన్ యొక్క ఉద్రిక్తతను తగ్గించింది. కానీ జాహ్నవి మనసులో మాత్రం ఒక ప్రశ్న అలాగే ఉండిపోయింది.
ఒక అమ్మాయి తన జీవితాన్ని తాను నిర్ణయించుకోవాలంటే, ముందు తన ఇంట్లో వాళ్ళకు కలిగే భయాన్ని గెలవాలా? బయటివాళ్ల అభిప్రాయాలను గెలవాలా? లేక ప్రతి అడుగుకూ తనను తాను నిరూపించుకోవాలనే అవసరాన్నే ప్రశ్నించాలా?
ఆ క్షణం ఆ ప్రశ్న కి జాహ్నవి దగ్గర సమాధానం లేదు! కాని సమాధానం తెలుసుకోవాలనే కోరిక మాత్రం మొదలయింది!
ఉదయం తొమ్మిదిన్నరకు జాహ్నవి తన ఇంటి నుండి బయలుదేరింది. చేతిలో పాత ల్యాప్‌టాప్ బ్యాగ్, అందులో సర్టిఫికెట్ల ఫైల్, రెండు నోట్‌బుక్స్, ఒక పెన్ను ఉన్నాయి.
ఖరీదైన దుస్తులు లేవు. మెరిసిపోయే హ్యాండ్‌బ్యాగ్ లేదు. బస్సు ఛార్జీకి సరిపోయే డబ్బులు, వెళ్ళే దగ్గర ఎంత సమయం పడుతుందో తెలియదు కాబట్టి లంచ్ కోసం సుజాత పెట్టిన చిన్న బాక్స్ మాత్రమే ఉన్నాయి.
ఆమె వెళ్లాల్సిన సంస్థ పేరు దిశా న్యూస్ నెట్‌వర్క్. వెబ్ న్యూస్ విభాగంలో ట్రైనీ రీసెర్చర్ ఉద్యోగం కోసం అప్లై చేసింది.
బస్టాప్ లో దిగిన తరువాత, ఆ స్టాప్ నుండి ఒక పెద్ద బిల్డింగ్ ని చూసింది జాహ్నవి! ఆ బిల్డింగ్ పైన సంస్థ పేరు ఇంగ్లీష్ లో సిల్వర్ అక్షరాల్లో మెరుస్తుంది.
ఆ బిల్డింగ్ లోకి వెళ్ళిన ఆమెకు కంప్యూటర్ల కీబోర్డు శబ్దాలు, వేగంగా మాట్లాడుతున్న ఉద్యోగుల గొంతులు వినిపించాయి. నేరుగా రిసెప్షన్ దగ్గరకు వెళ్లి, అక్కడ కూర్చుని రిజిస్టర్ లో ఉన్న వివరాలను కంప్యుటర్ లో ఎక్కిస్తూ కూర్చున్న అమ్మాయి ముందు నిలబడింది జాహ్నవి !
తన చేతిలో ఉన్న రెస్యూమ్ ని ఆమెకు అందించగానే కూర్చొమ్మని సైగ చేసింది ఆ అమ్మాయి!
దాదాపు నలభై నిమిషాల పాటుగా చేతికి ఉన్న వాచ్ లో టైం చూసుకుంటూ కూర్చున్న ఆమెకు, లోపలికి వెళ్ళమని సైగ చేయగానే వెంటనే లేచి ఆఫీస్ రూమ్ వైపుగా నడిచింది జాహ్నవి!
ఆఫీస్ రూమ్ లో తన సీట్ లో కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి! అతని పేరు మధుసూదన్. నలభై ఏడు సంవత్సరాల వయసులో హెయిర్ కి బ్లాక్ కలర్ వేసుకొని ఉన్నాడు!
అతని చేతిలో ఉన్న రెస్యూమ్ ని పరిశీలించి, అతనికి ఎదురుగా కూర్చున్న జాహ్నవి వైపు చూసాడు.
“జాహ్నవి! నీ అర్హతలు బాగున్నాయి! తెలుగు మీద పట్టు ఉంది. రీసెర్చ్ చేయాలనే ఆసక్తి కూడా రెస్యూమ్ లో రాసావు. కానీ మాకు కావాల్సిన పని కొంచెం భిన్నంగా ఉంటుంది.”
“ఏంటి సర్ అది?” అర్థం కానట్టుగా చూస్తూ అంది జాహ్నవి.
“న్యూస్ కోసం బయట తిరగాలి! కొన్నిసార్లు ఎంత రాత్రైనా మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికే వరకు అక్కడే ఎదురు చూడాలి! తెలియని వాళ్లను కలవాలి. వాళ్లు చెప్పేది నిజమో కాదో అర్థం చేసుకునే అవగాహన ఉండాలి! ప్రెషర్ ఉంటుంది! దాన్ని తట్టుకోవాలి! ఒక్కో సారి మన ఇన్వెస్టిగేషన్ ఆపడానికి బెదిరింపు కాల్స్ కూడా వస్తుంటాయి! భయం ఉండకూడదు!”
“అందుకే ఈ ఉద్యోగానికి అప్లై చేశాను సర్.” అంటూ జాహ్నవి అనగానే అతను చిన్నగా నవ్వాడు.
“మంచిదే! కానీ నువ్వు అమ్మాయివి కదా. ఇలాంటి పనులు చేయడానికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా?”
ఆ ప్రశ్న వినగానే జాహ్నవి ముఖంలోని నవ్వు మాయమైంది.
“సర్! మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా?”
“ఏంటి అది?”
“నా సామర్థ్యం గురించి అడగాల్సిన చోట నా ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా అని అడుగుతున్నారు. ఒకవేళ ఒక అబ్బాయి ఈ జాబ్ కోసం వచ్చి ఉంటే కూడా ఇదే ప్రశ్న అడిగేవారా?”
“ఇంతకు ముందు అంటే పోయిన సంవత్సరం అనుకుంటా! ఒక అమ్మాయి వచ్చింది! చాలా నమ్మకం కలిగి జాబ్ ఇచ్చాము! వారం ఉంది అంతే! ఒక రౌడీ షీటర్ తన వివరాలు అడుగుతుంది అని ఆమెను కత్తితో పొడిచాడు! అతన్ని పోలీసులు అరెస్ట్ కూడా చేసారు! కాని ఇబ్బంది ఎవరికీ అయింది? ఆ అమ్మాయికే కదా! మీకు ఏదైనా జరిగితే బాధ్యత మేమే తీసుకోవాలి కదా!”
“భద్రత గురించి అడగడం తప్పు కాదు సర్. కానీ భద్రత పేరుతో అవకాశం ఇవ్వకపోవడం సరైనదేనా? రాత్రి వరకు పని చేసే అబ్బాయికి ప్రమాదం జరగదా? అతనికి కుటుంబం ఉండదా? అతని గురించి ఇంట్లో వాళ్లు ఎదురుచూడరా?”
జాహ్నవి వేసిన ప్రశ్న కి అతను వెంటనే సమాధానం చెప్పలేదు. అతను మౌనంగా ఉన్నాడని తన గొంతును పెంచలేదు. అతనిని అవమానించాలనే ఉద్దేశమూ ఆమెకు లేదు. తనకు కావాల్సిన సమాధానం స్పష్టంగా అడిగింది అంతే!
“నాకు ఈ పని వచ్చని, నేను వందకు వంద శాతం ధైర్యంగా ఉంటాను అని ఇప్పుడే చెప్పలేను సర్. కాని అవకాశం ఇస్తే నేర్చుకుంటాను. చేయలేకపోతే నా తప్పు అంగీకరిస్తాను. కానీ ప్రయత్నించే అవకాశం రాకముందే, నేను అమ్మాయిననే కారణంతో నన్ను వెనక్కి పంపించకండి.”
“నీ ఆలోచనలు బాగున్నాయి. కానీ ప్రస్తుతం మాకు అనుభవం ఉన్నవాళ్లు కావాలి. ఏదైనా అవకాశం ఇచ్చేటట్టు ఉంటే మీకు కాల్ చేస్తాం!” అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ ని మూసేసి ఆమె వైపుగా ఉంచాడు మధుసూదన్!
“సరే సర్! థాంక్ యు!” అంటూ ఆ ఆఫీస్ రూమ్ నుండి బయటకు వస్తున్న ఆమెలో బాధ లేదు కానీ మనసులో నిరాశ మాత్రం ఉంది! తనకు ఉద్యోగం రాకపోవడం కంటే, తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కూడా దక్కకపోవడమే ఆమె మనసును కలచివేసింది!
ఆఫీస్ నుండి బయటకు వచ్చిన ఆమె తన హ్యాండ్ బ్యాగ్ నుండి ఒక నోట్ బుక్ తీసి అందులో రాయడం మొదలుపెట్టింది!
“నిజాన్ని తెలుసుకోవాలంటే, ముందుగా మనం నమ్ముతున్నదాన్ని కూడా ప్రశ్నించగలగాలి.” అంటూ ఆ పుస్తకం లో రాసి మూసేసింది జాహ్నవి!
ఎలాంటి సంఘటన నుండి అయినా ఒక కొత్త విషయం నేర్చుకోవడం ఆమెకు ఉన్న ఒక మంచి అలవాటు! ఆ ఆలోచనలను ఎప్పటికప్పుడు రాసుకోవడానికి నోట్ బుక్ ని ఎప్పుడూ తన బ్యాగ్ లోనే ఉంచుకుంటుంది!
బుక్ ని బ్యాగ్ లో ఉంచి బస్టాండ్ వైపుగా నడుస్తున్న ఆమె ఫోన్ రింగ్ అయింది! కాలింగ్ ఫ్రం అభిరామ్ అని కనబడగానే ఆమెలో ఉన్న నిరాశ మాయం అయింది!
“హలో రామ్!”
“ఇంటర్వ్యూ అయిపోయిందా జాను?”
“ఇంటర్వ్యూ అయి, రాకుండా పోయింది!”
“అదేంటి?”
“నాకు పని వచ్చా రాదా అని తెలుసుకునే లోపే, మా ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా అని అడిగారు. అబ్బాయిలు చెయ్యాల్సిన జాబ్ అన్నారు! ఇంకేం అంటాం! ప్యాంటు చొక్కా వేసుకొని ఇప్పటికిప్పుడు అబ్బాయిని అయిపోలేను కదా!”
“బాధగా ఉందా!”
“ఉండదా మరి!”
“అయితే బాధపడు! అంతే కాని నీ మీద నీకున్న నమ్మకాన్ని మాత్రం వాళ్ల ప్రశ్నలకు సమాధానంగా మాత్రం అప్పగించకు.” అంటూ అభిరామ్ చెప్పిన మాటలకు చిన్నగా నవ్వింది జాహ్నవి!
“అందరూ ఇలాగే చెబుతారు. కానీ ఇంటికి వెళ్లి మళ్లీ అదే పని మొదలుపెట్టాలి. అప్లికేషన్లు పెట్టాలి. ఓటమిని ఎదుర్కోవాలి.”
“అవును! నువ్వు చెప్పింది నిజమే కానీ ఒకటి గుర్తుపెట్టుకో జాను! నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరి అనుమతి అవసరం లేదు. నీ పని నిజాయితీగా చేయడానికి అవసరమైన నైపుణ్యాలు మాత్రం సంపాదించుకోవాలి. నీకు తెలియనిది నేర్చుకో, తప్పు చేస్తే సరిదిద్దుకో. ఎవరో నిన్ను తక్కువగా చూశారని, వాళ్లకు తప్పని నిరూపించడమే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకోకు!” అంటూ అభిరామ్ చెప్పిన మాటలు జాహ్నవికి నచ్చాయి.
అతనితో మాట్లాడిన తరువాత ఆమెలో కొంత ప్రశాతంత మొదలయింది! అదే చిరునవ్వుతో ఇంటికి బయలుదేరింది!
బస్టాప్ లో బస్ ఎక్కిన జాహ్నవి వెనక సీట్ లో కూర్చున్న ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటున్న మాటలు వినబడుతున్నాయి!
“పక్క వీధిలో ఆ అమ్మాయి గురించి విన్నావా? రాత్రి సమయంలో బయటకు వెళ్ళేది! ఇప్పుడు చూడు ఏదో సమస్య వచ్చిందట.”
“అయ్యో! ఆడపిల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా!”
“అవును మరి! మనం ఎన్ని చెప్పినా ఈ రోజుల్లో పిల్లలు వినడం లేదు.”
జాహ్నవి నెమ్మదిగా తలను కుడి వైపుగా తిప్పి వాళ్లవైపు చూసింది. వాళ్లు చెడ్డవాళ్లు కాదు. తమకు తెలిసిన విషయాల ఆధారంగా మాట్లాడుతున్న సాధారణ మనుషులు. కానీ వాళ్ల మాటల్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది.
సమస్య ఏం జరిగిందో తెలుసుకునే లోపే, ఆ అమ్మాయి ఎలా ఉండాల్సిందో తీర్పు సిద్ధమైపోయింది.
జాహ్నవి వాళ్లను ఏమీ అడగలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో, అసలు ఏం జరిగిందో కూడా ఆమెకు తెలియదు. వెంటనే తన నోట్ బుక్ తెరిచింది.
“ఒకరి గురించి విన్న మాట నిజమని అనుకోవడానికి ముందు, ఆ మాటకు ఆధారం ఏమిటో తెలుసుకోవాలి.” అని రాసి బుక్ ని తిరిగి బ్యాగ్ లో పెట్టేసింది!
ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు, మొదట ఆమెకు న్యాయం చేయాలా వద్దా అని నిర్ణయించేది ఆమె మంచిదా చెడ్డదా అన్న విషయమైతే. మనం నిజంగా న్యాయాన్ని నమ్ముతున్నామా? లేక మనకు నచ్చినవాళ్లకే న్యాయం జరగాలని కోరుకుంటున్నామా?
ఆ ప్రశ్నకు జాహ్నవి దగ్గర సమాధానం లేదు! కానీ ఆ క్షణం ఆమె బలంగా ఒక నిర్ణయం తీసుకుంది.
తనకు వెంటనే ఉద్యోగం దొరకకపోయినా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి నేర్చుకోవడం ఆపకూడదు అని! న్యూస్ ని ఎలా ధ్రువీకరించాలి, ఆర్టికల్స్ లో సమాచారాన్ని ఎలా వెతకాలి, ఒక వాదనకు ఆధారాలు ఎలా సేకరించాలి, ఒకరి ప్రైవసీ ని దెబ్బతీయకుండా నిజాన్ని ఎలా బయటపెట్టాలి! ఇవన్నీ నేర్చుకోవాలి.
ఎందుకంటే ప్రశ్నలు అడగడం ఒక్కటే ఇన్వెస్టిగేషన్ కాదు. ఆ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి ఓర్పు, బాధ్యత, నిజాయితీ కూడా కావాలి.
ఆ ఆలోచనలతో ఇల్లు చేసింది జాహ్నవి! ఇంటికి వెళ్ళిన ఆమెను చూస్తూ ఇంటర్వ్యూ ఏమైంది అని సైగ చేసింది సుజాత! రాలేదని తలూపింది జాహ్నవి!
“పోనీలే. ఇంకోసారి ప్రయత్నించు భాధపడకు!”
“నేను బాధపడతాను అమ్మా! కొన్నిసార్లు ఏడుస్తాను కూడా! కానీ అందుకని ప్రయత్నించడం మానేస్తే, నన్ను బాధపెట్టిన పరిస్థితులే గెలిచినట్టవుతుంది కదా!” అంటూ జాహ్నవి అన్న మాటలు వినగానే సుజాత ఆమెను దగ్గరకు తీసుకుంది!
ఆ చిన్న ఇంట్లో పెద్ద పెద్ద విజయాలు లేవు. ఖరీదైన వస్తువులు లేవు. భవిష్యత్తు గురించి ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. అయినా ఆ కౌగిలిలో జాహ్నవికి ఒక విషయం అర్థమైంది.
ధైర్యంగా ఉండటమంటే ఎప్పుడూ ఒంటరిగా పోరాడటం కాదు. మనకు భయం ఉందని అంగీకరించి, మనల్ని ప్రేమించే వాళ్లతో కలిసి ముందుకు వెళ్లడం కూడా ధైర్యమే.
భోజనం చేసిన తరువాత బెడ్ పై కూర్చుని ఉన్న జాహ్నవి, తన బ్యాగ్ నుండి నోట్ బుక్ తీసి రాయడం మొదలుపెట్టింది!
“ఒక అమ్మాయిని బలహీనురాలిగా చూసే ప్రపంచాన్ని మార్చాలంటే, ఆమె ధైర్యాన్ని ఎవరూ గుర్తించకపోయినా ముందుకు సాగడం నేర్చుకోవాలి.” అంటూ రాసి, ఆ పుస్తకాన్ని టేబుల్ పైన ఉంచి, బెడ్ పై కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ పడుకుంది!
ఆమె నేర్చుకోవాలనుకుంటున్న ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఒకరోజు తన జీవితాన్నే పూర్తిగా మార్చబోతోందని ఆ క్షణం జాహ్నవి కి తెలియదు!
తన ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో, ఓక స్త్రీ గురించి ఈ సమాజం ఎంత తేలికగా తీర్పు ఇచ్చేస్తుందో, ఆ తీర్పుల వెనుక దాగి ఉన్న నిజాన్ని బయటపెట్టడానికి ఎంత ధైర్యం అవసరమో కూడా తను తెలుసుకోబోతుంది!
ఆ రాత్రి జాహ్నవి తన కలను వదులుకోలేదు. అది ఆమె గెలుపు కాదు. ఆమె ప్రయాణం మొదలైన క్షణం. ఆ ప్రయాణమే ఈ స్వయంసిద్ధ!
:: అసలు కథ ముందుంది ::
‘జ్వాలా’ పోటీకి రాస్తున్న ఈ “స్వయంసిద్ధ“ ధారావాహిక లోని ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలను తెలుపుతారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు! – మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹‘
Swipe left/right or tap the sides to turn pages