New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
💗మౌనరాగం 💗 – 2

💗మౌనరాగం 💗 – 2

చకచకా మళ్లీ పనులన్నీ చేయడం మొదలుపెట్టింది సీత. 

 

తిన్న పాత్రలు కడగడం దగ్గర నుంచి ఇల్లంతా శుభ్రం చేయడం వరకు అన్నీ చేసేసింది.

 

ఎప్పుడూ అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, చిరునవ్వుతో కనిపించే సీత ముఖం మాత్రం పూర్తిగా వాడిపోయింది.

 

అప్పుడే ఇంటికి వచ్చిన చరణ్, అరుణ్, ఆరుణి ఆమెను గమనించారు.

 

చరణ్: ఏంటి సీతా… ముఖం అలా వాడిపోయింది? మధ్యాహ్నం భోజనం చేయలేదా?

 

ఆ మాట వినగానే సీత ఏమీ సమాధానం చెప్పకుండా, చేతులతో అయిపోయిందన్నట్లుగా సైగ చేసింది.

 

ఆమె సైగ అర్థం చేసుకున్న ముగ్గురికీ కోపం వచ్చింది.

 

అయితే రాజ్యలక్ష్మి ముందు ఏమైనా మాట్లాడితే, మళ్లీ సీతకు సపోర్ట్ చేస్తున్నామని గొడవ పడుతుందని అనుకున్నారు.

 

చరణ్ వెంటనే అరుణ్ వైపు చూసి బయటకు వెళ్లమన్నట్లుగా సైగ చేశాడు.

 

అరుణ్ కూడా అన్నయ్య ఉద్దేశం అర్థం చేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

 

అతను వెళ్లగానే చరణ్ సీత దగ్గరకు వచ్చి…

 

చరణ్: మళ్లీ వండుకోవాలి అని తెలియదా నీకు? ఆకలిగా ఉంటే అడగాలి కదా! ఇలా పస్తులు ఉండాల్సిన అవసరం ఏంటి?

 

అతను కోపంగా అనడంతో సీత తలవంచుకుంది.

 

ఎందుకంటే సీతకు బాగా తెలుసు. మళ్లీ పొయ్యి మీద గిన్నె పెట్టి వంట చేసుకోవాలంటే రాజ్యలక్ష్మి ఎంత గొడవ చేస్తుందో!

 

రాజ్యలక్ష్మికి ప్రతి విషయంలోనూ లెక్క అంటే లెక్కే!

 

ఎంత బియ్యం పోయాలి, ఎంత పప్పు వేయాలి, కూరకు ఎన్ని కూరగాయలు ఉపయోగించాలి, కాఫీ కోసం ఎన్ని పాలు పోయాలి… 

 

ఇలా ప్రతి వస్తువుకీ ఒక లెక్క ఉంటుంది.

 

ఆమె ఎంత చెబితే అంతే సీత ఉపయోగించాలి. 

 

ఒక్క గింజ బియ్యం ఎక్కువైనా, ఒక్క చుక్క పాలు ఎక్కువైనా ఊరుకునేది కాదు.

 

ఇంటి చిమ్మడం దగ్గర నుంచి బట్టలు ఉతకడం వరకు ప్రతి పనిలోనూ అంతే.

 

ఆమె చెప్పినన్ని వస్తువులే వాడాలి. ఒక్కపూటకు సరిపడే సరుకులు తగ్గినా కూడా సీతను వదిలేది కాదు.

 

చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవ చేసేది. ఒక్కోసారి ఇష్టం వచ్చినట్లు కొట్టేది కూడా!

 

అందుకే సీత ఆకలిగా ఉన్నా మళ్లీ వంట చేసుకోవడానికి ధైర్యం చేయలేకపోయింది.

 

అప్పుడే రాజ్యలక్ష్మి గొంతు వినిపించింది.

 

సీతా… సీతా… అని 

 

సీత అప్పటికే తలదించుకుని నిలబడి ఉండటంతో ఆ పిలుపు వినిపించలేదు.

 

అంతలో ఆరుణి సీత చేతిపై మెల్లగా తట్టి, రాజ్యలక్ష్మి ఉన్నవైపు చూపించింది.

 

అంతే! సీత గబగబా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లింది.

 

రోజూ రాజ్యలక్ష్మి కూర్చునే ప్రాంతానికి చేరుకుంది. 

 

అప్పటికే అక్కడ కూర్చుని ఉన్న అత్తను చూసి, ఏంటి అన్నట్లుగా చేతులతో సైగలు చేసింది.

 

రాజ్యలక్ష్మి తన ఎదురుగా వచ్చిన సీతను చూసి, తన కొడుకులు, కూతురు వచ్చే సమయం అయిందని, వాళ్ల కోసం స్నాక్స్ తయారుచేయమని సైగలతో చెప్పింది.

 

ఆమె మాటలు సీతకు వినిపించకపోయినా, రాజ్యలక్ష్మి ముఖంలోని భావాలను, చేతి సైగలను గమనించి విషయం అర్థం చేసుకుంది.

 

వెంటనే వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లింది.

 

సెనగపిండిలో కొంచెం బియ్యప్పిండి కలిపి, తగినంత ఉప్పు వేసి, ఉల్లిపాయలు సన్నగా కోసి పకోడీలు తయారుచేయడం మొదలుపెట్టింది.

 

అరగంటలో స్నాక్స్ సిద్ధం చేసింది. ఆ తర్వాత అందరికీ కాఫీ కూడా తయారుచేసింది.

 

పకోడీలు, కాఫీలు తీసుకుని ఎవరి గదికి వాళ్లకు వెళ్లి ఇచ్చి వచ్చింది.

 

అయితే మిగిలిన పకోడీలను చూసిన రాజ్యలక్ష్మి, ఎక్కడ సీత వాటిని తినేస్తుందో అన్నట్లుగా వెంటనే ఒక డబ్బాలో వేసి దాచిపెట్టుకుంది.

 

ఎందుకంటే వాటిని రాత్రి భోజనంలో ఉపయోగించుకోవాలని ఆమె ఆలోచన!

 

ఆరుణికి అప్పటికే కొంచెం అనుమానం వచ్చింది. సీత కోసం ఏమైనా పకోడీలు మిగిలాయో లేదో చూద్దామని వంటగదిలోకి వెళ్లింది.

 

అయితే అక్కడ రాజ్యలక్ష్మి మిగిలిన పకోడీలన్నింటినీ ఒక డబ్బాలో సర్దిపెట్టడం చూసింది.

 

అది చూసిన ఆరుణికి చాలా కోపం వచ్చింది.

 

మరోవైపు సీత బయట ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది.

 

ఆరుణి వెంటనే సీత దగ్గరకు వెళ్లి, ఆమె చేయి పట్టుకుని గబగబా తమ గదిలోకి తీసుకెళ్లింది.

 

ఇంటి వెనక వైపు నుంచి కూడా ఆ మూడు గదులకు వెళ్లేందుకు మెట్లు ఉండటంతో, ఎవరికీ కనిపించకుండా సీతను తన గదిలోకి తీసుకెళ్లింది.

 

అందరూ సీతను స్వీటు అనే పిలుస్తారు. ఎందుకంటే సీత ఎవరినీ ఎదిరించి మాట్లాడదు. ఎప్పుడూ అందరితో నవ్వుతూ, ఆప్యాయంగా ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారు.

 

అరుణి సీతను గదిలోకి తీసుకెళ్లేసరికి అప్పటికే అరుణ్ అక్కడికి వచ్చి ఉన్నాడు. అతని చేతిలో ఒక కవర్ ఉంది.

 

సీతను చూడగానే అరుణ్ గబగబా ఆ కవర్‌లో ఉన్న ఆహారాన్ని ప్లేట్‌లోకి తీసి ఆమెకు అందించాడు.

 

ఎందుకంటే సీత మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదని వాళ్లకు తెలుసు.

 

వాళ్ల అమ్మ ఎంత స్వార్థపరురాలో వాళ్లకు బాగా తెలుసు. సీత చిన్నప్పటి నుంచి ఆమె చేతుల్లో ఎన్ని కష్టాలు పడుతుందో కూడా తెలుసు.

 

సీత పుట్టినప్పుడే ఆ ఇంటికి వచ్చింది. అప్పట్లోనే రాజ్యలక్ష్మి ఎలాగైనా సీతను ఆ ఇంటి నుంచి పంపించేయాలని ప్రయత్నించింది. కానీ అప్పట్లో సీత మేనమామ ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఆయన మెడికల్ లీవ్‌లో ఉండటంతో రాజ్యలక్ష్మి సీత విషయంలో ఏమీ చేయలేకపోయింది.

 

సీతకు నాలుగేళ్లు వచ్చినప్పుడు ఆయన మళ్లీ ఆర్మీకి వెళ్లిపోయాడు.

 

ఆ తర్వాత కొంతకాలం సీత బాధ్యతలను ఆమె అమ్మమ్మ, తాతయ్య చూసుకున్నారు. వాళ్లు ఉన్నంతకాలం సీతకు కొంతైనా ప్రేమ, ఆప్యాయతలు దక్కాయి.

 

కానీ వాళ్లు కూడా చనిపోయిన తర్వాత సీత పూర్తిగా రాజ్యలక్ష్మి చేతుల్లోకి వెళ్లిపోయింది.

 

అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

 

ఇంట్లో పనిమనిషిలా పని చేయించుకోవడం, చిన్న చిన్న విషయాలకే ఇష్టం వచ్చినట్లు కొట్టడం… ఇలా సీతను ఎన్నో ఇబ్బందులకు గురిచేసేది.

 

సీత పిన్ని అప్పుడప్పుడు ఆమె కోసం కొత్త బట్టలు పంపిస్తే, రాజ్యలక్ష్మి వాటిని కూడా సీతకు ఇవ్వకుండా ఆరుణికి ఇచ్చేది.

 

ఒకవేళ ఆరుణి నాకు వద్దు, నేను వేసుకోను అని చెప్పినా సరే, తన మేనకోడలికి పంపించేది. 

 

సీత కాస్త సన్నగా ఉంటుంది ఆరుణి కాస్త లావుగా ఉంటుంది.

 

అందువలన ఆరుణి బట్టలను కూడా ఇచ్చేసేది సీతకు వేసుకోమని ఇచ్చేది .

 

దాంతో సీత వేసుకునే బట్టలన్నీ ఆరుణి వాడి వదిలేసినవే.

 

ఆ బట్టలు కూడా సీతకు సరిగ్గా సరిపోయేవి కావు.

 

 అయినా సూది, దారంతో తనకు తగ్గట్టుగా కుట్టుకుని వాటినే వేసుకునేది.

 

అలా చిన్నప్పటి నుంచి తనకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు కూడా తీరక ఎన్నో కష్టాలు పడుతూ పెరిగింది సీత.