New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 5

అగ్నిసాక్షి 🔥 – 5

డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి, అక్కడ ఎదురుచూస్తున్న వాళ్లందరినీ ఒక్కసారి చూశారు.

 

ఆయన ముఖంలో కనిపిస్తున్న గంభీరతను చూసి అందరి గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది.

 

“సారీ అండి… షీ ఈజ్ నో మోర్.”

 

అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోబోయారు.

 

“ఏమంటున్నారు డాక్టర్?”

 

అంటూ రాధిక గారు ఒక్కసారిగా ముందుకు వచ్చి ప్రశ్నించారు.

 

ఆ ప్రశ్న విన్న డాక్టర్ అక్కడి నుంచి వెళ్తూ మూడు అడుగులు వేసి ఆగిపోయారు. వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తూ,

 

“నేను నిజమే చెబుతున్నాను మేడం. షీ ఈజ్ నో మోర్. మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. కానీ తనని సేవ్ చేయలేకపోయాం.”

 

అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

ప్రతి ఒక్క డాక్టర్ చెప్పే మాటలే ఇవి…

 

మేము మా ప్రయత్నం చేశాం… కానీ కాపాడలేకపోయాం.

 

హాస్పిటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో ఉన్న తమవాళ్ల కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరి బంధువులు ఇలాంటి వార్త వినకూడదని మొక్కని దేవుడు అంటూ ఉండరు. అయినా కొన్నిసార్లు మనం ఎంతగా కోరుకున్నా, ఎంతగా ప్రార్థించినా జరగాల్సినది జరిగిపోతుంది.

 

ఎంతైనా మనకు ఇష్టమైన వాళ్లను కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధే.

 

“రాధీ…”

 

అంటూ విజయ గారు రాధికను పట్టుకుని ఏడవడం మొదలుపెట్టారు.

 

విజయను అలా చూసిన రాధిక గుండె కూడా బరువెక్కిపోయింది.

 

“విజ్జీ… నీకు ఇది కడుపుకోతే. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఆ దేవుడికి మనసంటూ లేదా! దాని లైఫ్‌లో అది ఎన్ని ఫేస్ చేసింది. అన్నీ భరించి అయినా తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనివ్వాలనుకుంది. ఇచ్చింది. కానీ దేవుడు దానిని తీసుకుని వెళ్లిపోయాడు.”

 

అంటూ రాధిక కళ్లలో నుంచి కన్నీళ్లు ధారగా కారాయి.

 

అయితే విజయ గారు తనను చూస్తే మరింత బాధపడతారని భావించి, కన్నీళ్లను బయటకు రానివ్వకుండా బలవంతంగా ఆపుకుంది. తన బాధను మనసులోనే దాచుకుంటూ, బయటకు మాత్రం విజయకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది యష్ వాళ్ల అమ్మ యశోద గారు.

 

పక్కనే ఉన్న కిషోర్ గారు కూడా ఆ వార్త విని పూర్తిగా డీలా పడిపోయారు. అప్పటివరకు ధైర్యంగా ఉన్న ఆయన ముఖంలోనూ నిస్సహాయత కనిపిస్తోంది.

 

ఆయన పరిస్థితిని చూసిన అరుణ్ గారు కూడా ఏం మాట్లాడాలో, ఎలా ఓదార్చాలో తెలియక అలాగే ఉండిపోయారు.

 

ఇంతలో అక్కడికి వచ్చిన నర్స్,

 

“సర్… మీరు బిల్ పే చేసి బాడీని తీసుకెళ్లండి.”

 

అంటూ చెప్పి వెళ్లిపోయింది.

 

“నేను బిల్ క్లియర్ చేసి వస్తాను.”

 

అంటూ యష్ వాళ్ల నాన్న రమేష్ గారు అక్కడి నుంచి రిసెప్షన్ వైపు వెళ్లారు.

 

అక్కడికి చేరుకున్న ఆయన రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్లి పేషెంట్ పేరు చెప్పి, తన జేబులో ఉన్న క్రెడిట్ కార్డులను బయటకు తీశారు.

 

“బిల్ ఎంత అయింది?”

 

అని అడిగారు.

 

ఆమె బిల్ మొత్తం చెప్పడంతో, క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసి తిరిగి అందరూ ఉన్న దగ్గరకు వచ్చారు.

 

—

 

ఎయిర్‌పోర్ట్‌లో…

 

ఆరు ముందుగానే ఫ్లైట్ దిగి ఎయిర్‌పోర్ట్‌లోని వెయిటింగ్ ఏరియాలో కూర్చుంది.

 

యష్ ఇంకా రాకపోవడంతో పదే పదే గడియారం వైపు చూస్తోంది.

 

ఇంకెంత టైం పడుతుందో వీడు రావడానికి…

 

అనుకుంటూ తన ఫోన్ తీసి యష్‌కి కాల్ చేస్తూ అక్కడే కూర్చుంది.

 

అప్పుడే యష్ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసింది.

 

“నేను ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిపోయాను. నీకు ఇంకా ఎంత టైం పడుతుంది రావడానికి?”

 

అంటూ ఫోన్ ఎత్తగానే అరుస్తూ అడిగింది.

 

ఆమె అరుస్తుందని ముందే ఊహించిన యష్ ఫోన్‌ను చెవికి కొంచెం దూరంగా పెట్టుకుని,

 

“నేను ఆల్రెడీ రీచ్ అయిపోయాను. రీచ్ అయ్యాను కాబట్టే కదా నీకు కాల్ చేసింది.”

 

అంటూ కూల్‌గా సమాధానమిచ్చాడు.

 

“అవునా! ఎక్కడున్నావ్? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను.”

 

అంటూ తాను ఉన్న ప్రదేశాన్ని చెప్పి, యష్ కోసం ఎదురుచూడసాగింది.

 

కొద్దిసేపటికే యష్ తన దగ్గరకు రావడం కనిపించింది.

 

అతన్ని చూడగానే ఆరు ముఖంలో ఒక్కసారిగా ఆనందం విరిసింది.

 

“యష్!”

 

అంటూ గట్టిగా పిలుస్తూ అతని దగ్గరకు పరుగెత్తుకెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది.

 

ఆమె ఎప్పటిలాగే అరుస్తూ పలకరిస్తుందని అనుకున్న యష్, ఇలా వచ్చి హగ్ చేసుకుంటుందని అస్సలు ఊహించలేదు.

 

ఊహించని ఆ పరిణామానికి ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి, వెనక్కి పడిపోబోయాడు. వెంటనే తేరుకుని ఒక అడుగు వెనక్కి వేసి తనను తాను బ్యాలెన్స్ చేసుకున్నాడు.

 

ఆ తర్వాత ఆమె వైపు చూస్తూ,

 

“ఎవరైనా ఇలా అరుస్తారా రాక్షసి?”

 

అంటూ చిన్నగా నవ్వాడు.

 

“ఎవరు అరిస్తే నాకు ఏంటి? నేను ఇలానే అరుస్తా!”

 

అంటూ ఏమాత్రం తగ్గకుండా సమాధానమిచ్చింది ఆరు.

 

“సరే కానీ, ముందు నా నుంచి జరుగు.”

 

అంటూ ఆరును నెమ్మదిగా విడిపించుకుని, తన బ్యాగ్ సర్దుకుంటూ,

 

“వెళ్దామా?”

 

అని అడిగాడు.

 

“ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం?”

 

అంటూ అతని వైపు చూసింది ఆరు.

 

“ఇంటికి అయితే వద్దు… దానిని చూసి చాలా డేస్ అవుతుంది. అక్కడికే వెళ్దామా?”

 

అంటూ యష్ ఏం చెప్తాడో అన్నట్టుగా అతని ముఖంలోకి చూస్తూ, కాళ్లతో నేలను చిన్నగా రాస్తూ నిలబడింది.

 

“ఎక్కడికి?”

 

అంటూ ఆరును ఆటపట్టించడానికి కావాలనే తెలియనట్టు అడిగాడు యష్.

 

ఆమె వెంటనే ముఖం చిన్నబుచ్చుకుంది.

 

“నీకు తెలీదా? ఎక్కడికో?”

 

అంటూ కాస్త అలకగా చూసింది.

 

“తెలుసు… కానీ నువ్వే చెప్తేనే తీసుకెళ్తా. లేకపోతే డైరెక్ట్‌గా ఇంటికే…”

 

అంటూ కావాలనే ఆమెను ఆటపట్టించాడు.

 

“వద్దులే… నేనే చెప్తా.”

 

అంటూ చిన్నగా నిట్టూర్చి, ఒక నిమిషం ఆగింది.

 

తర్వాత కొంచెం సందేహంగా అతని వైపు చూస్తూ,

 

“వేద దగ్గరికి తీసుకువెళ్తావా?”

 

అని అడిగింది.

 

ఆమె అలా అడిగేసరికి యష్ ఏం సమాధానం చెప్తాడోనని అతని ముఖంలోకి ఆశగా చూస్తూ నిలబడింది.

 

ఇంకా ఉంది… ❤️‍🔥