హైదరాబాద్‌లోని శివ లగ్జరీ ఫ్లాట్. కాలేజీ దగ్గర జరిగిన ఆ భయంకరమైన దాడి తర్వాత సాహిత్య భద్రత కోసం శివ ఆమెను తన ఫ్లాట్‌కే తీసుకువచ్చాడు. ప్రెసిడెంట్ వీరభద్రరావు మనుషుల నుండి ముప్పు పొంచి ఉండటంతో, పెద్దవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి ఒప్పించాడు శివ. సాహిత్య కూడా బావ రక్షణలో ఉండటంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే భయం తగ్గిన కొద్దీ, సాహిత్య లోపల ఉన్న పాత ‘రౌడీ మరదలు’ మళ్లీ నిద్రలేచింది.
ఒకే ఫ్లాట్… ఒకే హాల్… ఇద్దరు బావ మరదళ్లు. ఇక అల్లర్లకు కొదువ ఉంటుందా?
మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలవుతోంది. శివ ల్యాప్‌టాప్ ముందు కూర్చుని, ఒక వైపు ఆఫీస్ కోడింగ్ వర్క్, మరోవైపు ఫ్రెండ్ విక్రమ్ పంపిన ప్రెసిడెంట్ వీరభద్రరావు బ్యాంక్ అకౌంట్ వివరాలను సీరియస్‌గా పరిశీలిస్తున్నాడు. అతని నుదుటిపై ఇంకా నిన్నటి దెబ్బ తాలూకు చిన్న బ్యాండేజ్ ఉంది.
సరిగ్గా అప్పుడే సాహిత్య వంటగదిలో నుంచి చేతిలో ఒక గిన్నె పట్టుకుని వచ్చింది. ఆమె చక్కటి కాటన్ కుర్తీ వేసుకుని, తడి జుత్తును పైకి ముడేసి చాలా అందంగా ఉంది.
“బావా! నిన్న నీకు తలకు దెబ్బ తగిలింది కదా. నీకోసం నేను అమృతం లాంటి పసుపు పాలు, బాదం పప్పు కలిపి తెచ్చాను. తాగేయ్” అంది చాలా వినయంగా, నమ్రతగా నటిస్తూ.
శివ ల్యాప్‌టాప్ నుంచి కళ్లు తిప్పి ఆమె వైపు అనుమానంగా చూశాడు. పల్లెటూర్లో ఉప్పు కాఫీ ఇచ్చిన సంఘటన అతనికి ఇంకా గుర్తుంది.
“సాహిత్యా! నిజం చెప్పు, ఇందులో మళ్లీ ఏమైనా కలిపావా? నిన్ను నమ్మడం చాలా కష్టం” అన్నాడు గిన్నెను దూరంగా పెడుతూ.
“అయ్యో బావా! నిన్న నాకోసం అంత పెద్ద ఫైట్ చేసి రౌడీలను కొట్టావు. నీ ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం? నా మీద ఇంత అనుమానమా?” అంటూ కళ్లలో నీళ్లు తెచ్చుకున్నంత పని చేసింది.
శివ కొంచెం కరిగిపోయి, గిన్నె అందుకుని ఒక పెద్ద గుటక వేశాడు..
అంతే! పాలు గొంతులోకి వెళ్లగానే శివ కళ్లు బైర్లు కమ్మాయి. పసుపు పాలే… కానీ అందులో చక్కెర వేయకుండా, పిచ్చి పిచ్చిగా చేదు వేప రసం కలిపేసింది!