మౌనమే ని భాష – 5
గదిలో చీకటి రాజ్యమేలుతోంది. కిటికీ బయట వర్షం శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. శ్రావణి అలాగే కిటికీ పక్కన కూర్చుని, శూన్యంలోకి చూస్తూ తన గతంలోకి జారిపోయింది.
పోయిన ఆ డైరీ స్థానంలో ఇప్పుడు తన ముందున్న కొత్త పుస్తకం వైపు చూస్తుంటే, ఆమెకు తన పదేళ్ల ప్రాయం గుర్తొచ్చింది.
గతం – శ్రావణి 10 ఏళ్ల వయసులో
అది శ్రావణి అమ్మమ్మ ఇల్లు. అప్పుడే అమ్మ, నాన్నలను కోల్పోయిన శ్రావణికి లోకం అంటే ఏంటో తెలియని వయసు.
అందరూ ఉన్నా తను ఒక్కత్తే అయిపోయానన్న భయం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అత్త, మావయ్యల పలకరింపులో ఆత్మీయత కంటే ఏదో వెలితి కనిపిస్తోంది.
అందరి మధ్య ఉన్నా తను ఎవరితోనూ మాట్లాడలేకపోయేది.ఒక సాయంత్రం, శ్రావణి ఇంటి వెనక ఉన్న వేప చెట్టు కింద కూర్చుని ఏడుస్తోంది.
అప్పుడే అమ్మమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ శ్రావణి దగ్గరకు వచ్చింది. వణుకుతున్న తన చేతులతో శ్రావణి తల నిమిరింది.
ఏడవకు తల్లి నువ్వు ఇలా ఏడుస్తుంటే నీ అమ్మ, నాన్నల ఆత్మలు కూడా బాధపడతాయి అంది అమ్మమ్మ.శ్రావణి కన్నీళ్లు తుడుచుకుంటూ,
నాకు అమ్మ కావాలి అమ్మమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోను, ఎవరితో మాట్లాడినా భయం వేస్తోంది. నాన్న ఉంటే నన్ను గుండెలకు హత్తుకునేవారు కదా అని వెక్కి వెక్కి ఏడ్చింది.
అమ్మమ్మ ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత తను ఇంట్లోకి వెళ్లి తన బీరువాలో దాచుకున్న ఒక పాత, కొత్తగా కనిపిస్తున్న లెదర్ డైరీని తీసి శ్రావణి చేతిలో పెట్టింది.
ఇదిగో శ్రావణీ ఇది తీసుకో. ఇకపై నీకు ఎవరూ లేరని బాధపడకు. నీ మనసులో ఏమున్నా.. ఏ బాధ ఉన్నా, ఏ సంతోషం ఉన్నా.. ఇందులో రాయి.
నువ్వు ఇందులో రాసే ప్రతి అక్షరం నీ తల్లిదండ్రులకు చేరుతుంది. వాళ్ళు ఎక్కడున్నా నీ అక్షరాల రూపంలో నీ బాధను వింటారు.
నువ్వు రాసే ప్రతి మాటకు వాళ్ళు పైనుండి సమాధానం ఇస్తారు. ఇకపై ఇది నీ డైరీ కాదు.. ఇది నీ అమ్మ, నాన్నల ప్రతిరూపం అని చెప్పింది అమ్మమ్మ.
శ్రావణి ఆ డైరీని మొదటిసారి తాకినప్పుడు, తన అమ్మ చేయి పట్టుకున్నంత హాయిగా అనిపించింది.నిజంగానా అమ్మమ్మా.నేను ఇందులో రాస్తే అమ్మ చదువుతుందా అని అమాయకంగా అడిగింది శ్రావణి.
ఖచ్చితంగా చదువుతుంది తల్లి. నీకు ఎవరూ తోడు లేకపోయినా, ఈ అక్షరాలు నీకు తోడుగా ఉంటాయి. నీ మాటలను లోకానికి చెప్పకు, ఈ కాగితాలకే చెప్పు.
ఇవి నీ రహస్యాలను గుండెల్లో దాచుకుంటాయి అని అమ్మమ్మ భరోసా ఇచ్చింది.ఆ రోజు రాత్రి, శ్రావణి ఆ డైరీలో మొదటి అక్షరం రాసింది..
అమ్మా అని,అప్పటి నుండి మొదలైన ఆ ప్రయాణం ఇప్పటికీ సాగుతూనే ఉంది. మావయ్య ఇంట్లో తను పడ్డ కష్టాలు, అత్త వేసిన మాటలు, తన మనసులోని చిన్న చిన్న కోరికలు..
అన్నీ ఆ డైరీతోనే పంచుకుంది. తన పదేళ్ల ప్రాయంలో అమ్మమ్మ ఇచ్చిన ఆ కానుక, ఈ పదిహేను ఏళ్లలో ఆమె జీవితంలో ఒక భాగమైపోయింది.
ఆ డైరీని తాకితే తన అమ్మను తాకినట్టు, ఆ అక్షరాలను చూస్తే నాన్న పలకరిస్తున్నట్టు ఉండేది.
ప్రస్తుతం
ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటుంటే శ్రావణి కళ్ళు మళ్ళీ చెమర్చాయి. అమ్మమ్మా అమ్మా నాన్నలకు నా బాధ చేరుతుందని చెప్పావు కదా.
ఇప్పుడు నా బాధను మోసే ఆ పుస్తకమే దూరమైపోయింది.ఇప్పుడు నా మనసులోని మాటలు వాళ్ళకి ఎలా చేరుతాయి అని ఆమె మౌనంగా రోదించింది.
తన సర్వస్వాన్ని ఒక అపరిచితుడి చేతుల్లో పెట్టి, ఆ జ్ఞాపకాల కోసం శ్రావణి ఒక దీపంలా కాలిపోతోంది.
ఆఫీస్ నుండి ఇంటికి రాగానే వంశీకి మళ్ళీ పనుల ఒత్తిడి మొదలైంది. ఆ రోజు బస్సులో దొరికిన ఆ డైరీ గురించి అతను పూర్తిగా మర్చిపోయాడు.
ఇంటికి రాగానే కారు మెకానిక్ ఫోన్ చేయడం, తమ్ముడు రవి కాలేజీ ఫీజు గురించి గొడవ చేయడం, మళ్ళీ ఆఫీస్ తాలూకు కొత్త ప్రాజెక్ట్ మెయిల్స్ రావడం.. ఇవన్నీ వంశీని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
వంశీ తన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను రూమ్ మూలన ఉన్న సోఫా మీద పడేశాడు. ఆ బ్యాగ్ లోపల, చీకటి మూలలో శ్రావణి జీవిత కాలపు జ్ఞాపకం నిశ్శబ్దంగా ఉండిపోయింది.
మొదటి రోజు గడిచిపోయింది. ఆఫీస్‌లో క్లయింట్స్ మీటింగ్స్ ఉండటంతో వంశీకి అసలు ఊపిరి సలుపలేదు.
రెండో రోజు కూడా అలాగే గడిచింది. ఆ రెండు రోజులు శ్రావణికి నరకంలా ఉంటే, వంశీకి మాత్రం అవేమీ తెలియని ఒక సామాన్యమైన రోజుల్లా గడిచిపోయాయి.
ఆ డైరీ వంశీ బ్యాగ్‌లో ఉందని ఎవరికీ తెలియదు, కనీసం వంశీకి కూడా ఆ ఆలోచన రానంతగా అతను తన పనిలో మునిగిపోయాడు.
ఆదివారం కావడంతో వంశీ ఇంట్లో అందరూ రిలాక్స్‌గా ఉన్నారు. గోపాల్ గారు బాల్కనీలో పేపర్ చదువుతుంటే, సరస్వతి గారు వంటింట్లో టిఫిన్ చేస్తున్నారు. వంశీ ఇంకా నిద్రలోనే ఉన్నాడు……
కొనసాగుతుంది……..
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్..
Swipe left/right or tap the sides to turn pages