రావమ్మా.. మహాలక్ష్మి – 4
సుప్రజా.. పసుపు దంచి పెట్టి ఉంచాను.. కారం కూడా రెడీ గానే ఉంది.. ప్రణతి కోసం అరిసెలు, మురుకులు చేయించాను.. పిల్ల వచ్చేసరికి మైసూర్ పాక్ కూడా చేపించి ఉంచుతాను.. అంటూ చెప్తున్న తల్లి మాటలు వినకుండా పరధ్యానం లో ఉంది సుప్రజ.
సుప్రజా.. నేను మాట్లాడుతూనే ఉన్నాను.. నువ్వెంటి ఏదో ఆలోచన లో ఉన్నట్టున్నావు.. అంది రామాయమ్మ కూతురి ముఖం చూస్తూ.
అమ్మ.. ఈరోజు తో మహా చదువు పూర్తవుతుంది.. మా ఆయన సంగతి తెలుసుగా.. మహా ని తన కోడల్ని చేసేయాలని చూస్తున్నారు.. విష్ణు కి మహా అంటే చాలా ఇష్టం.. నాకు భయంగా ఉందమ్మా.. ఈ ఆపద నుండి ఎలా తప్పించుకోవడం.. అంది సుప్రజ దిగులుగా.
హ్మ్.. చచ్చేదాకా నీ ఆడపడుచు బాధ నీకు పోయేలా లేదు.. దాని కూతురే కోడలయితే ఇక అంతే సంగతి.. అంది రామాయమ్మ.
అదే కదా నా బాధ కూడా.. అసలు వాళ్ళిద్దర్నీ ఎలా వదిలించుకుందామా అంటే.. సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయే గాని నాకు వాళ్ళిద్దరి పీడా వదల్లేదు .. ఇప్పుడు కోడలుగా మహా వస్తే మనః శాంతి గా ఉండనే లేను..అంది సుప్రజ.
ఎలా ఉంటావు.. అప్పుడు నెత్తి మీద గుదిబండ అవుతుంది.. అయినా నాకు ఒక పరిష్కారం తోస్తుంది.. అంది రామాయమ్మ.
పరిష్కారమా.. ఏంటో చెప్పమ్మా.. ఈ విషయం గురించి ఆలోచిస్తే నాకు అసలు ఏమి తోచడం లేదు.. అంది సుప్రజ.
మహా కి మనమే ఒక మంచి సంభందం చూద్దాం.. టాపిక్ పక్కకి వెళుతుంది కదా.. అంది రామాయమ్మ.
ఏడ్చినట్టు ఉంది.. మనమే టాపిక్ లోకి లాగినట్టవుతుంది.. అంది సుప్రజ.
ముందు పూర్తిగా విని చెప్పు సుప్రజా.. మీ ఇంటికి వాళ్ళు వచ్చి మహాని అడిగినట్టుగా ప్లాన్ చేద్దాం.. చాలా మంచి సంబంధం అని నీ మొగుడు సురేంద్ర కూడా ఒప్పుకునేటట్టు చేస్తే సరిపోతుంది.. విష్ణుకి మహాకి జాతకాలు సరిపోలేదని చెప్తే సరిపోతుంది కదా.. అంది రామాయమ్మ.
అవును.. ఇది మంచి ఆలోచన.. ఈ పని సంగతి చూడు.. ఆయన ఎదురు చూస్తూ ఉంటారు నేను ఇంటికి బయలుదేరుతాను.. అంది సుప్రజ.
హ్మ్ జాగ్రత్త గా వెళ్ళిరా.. సామాను నేను పాలేరుతో పెట్టిస్తాను.. అంది రామాయమ్మ.
సరే.. అని బయటికి కదిలింది సుప్రజ.
ఏంటో చేశాను వెధవ సంభందం దీనికి.. ఆడబిడ్డ జీవితాంతం పెరట్లో సెటిలయి పోయింది.. ఖర్మ.. అనుకుంది రామాయమ్మ.
**************************
ఆనంద్ కుటుంబం అంత్యక్రియలు ముగిసాక కొంత మంది బంధువులు వెళ్లిపోయారు. మరికొంత మంది అవుట్ హౌస్ లో ఉన్నారు. అంజనీ దేవి మెయిన్ బిల్డింగ్ లో ఎవర్ని ఉండనివ్వలేదు.
పనివాళ్ళు ఎప్పటిలానే పనిచేస్తున్న అందరిలో ఏదో నిరాశక్తత.
అంజనీ దేవి తన గదిలో వాలుకుర్చీ లో కూర్చుని శూన్యం లోకి చూస్తుంది. జరిగిన విషాదం ఆమె గుండె ని బలహీన పరుస్తుంది.
ఇంత ఆస్థి.. వారసుడు కూడా చనిపోయాడు.. మరేం చేస్తారు.. అన్న బంధువుల మాటలు ఆమె చెవిన పడకపోలేదు.
తన భర్త నిరంజన్ కష్టపడి వ్యాపారం ప్రారంభించిన.. దాన్ని ఆనంద్ బాగానే వృద్ధి చేసాడు.. కోట్లకి పడగలెత్తారు. అంతా బాగానే సాగిపోతున్నది అనుకుంటే విధి ఒక్కసారిగా శపించిందా అన్నట్టు ఇలా ఎందుకు జరిగింది..?? ఆమె మనసు ఆమెని ప్రశ్నిస్తుంది.
కుటుంబం లో ఒక్కరు కాదు కుటుంబం అంతా పోయింది.. ఎందుకు.. రేపో మాపో పోతానేమో నేను.. వార్ధక్యం లో ఉన్న నేను ఏమి కాపాడగలను.. ఏం చేయాలి.. ఇప్పుడు.. ఈ క్షణం.. డబ్బు ఎంత సంపాదిస్తే ఏం అనుభవించే వాళ్లు లేనప్పుడు అనిపిస్తుంది… నా భర్త, బిడ్డ ఎంతో కష్టపడి సంపాదించిన ఈ ఆస్థి.. అన్యుల పాలా.. రాబందుల్లా కాచుకున్న వాళ్ళ పాలు చేయాలా?? మనసు అంగీకరించడం లేదు.. ఆస్థి వీర్ కి ఇవ్వాలా.. ఉన్నన్నాళ్ళు మా కుటుంబం మీద ఏడుస్తూనే ఉంది నిర్మల.. దాని ఏడుపుకే నా బిడ్డ, కుటుంబం పోయారేమో ఎవరికి తెలుసు.. లేదు.. అలా ఇవ్వలేను.. మరి?? నా వెంటఁ పట్టుకుపోలేను.. ఏం చేయాలి.. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి??
బాధగా మూసుకున్న ఆమె కళ్ల వెంబడి కన్నీళ్లు ధారగా కారిపోయాయి.
ఆమెకి ఆనంద్ చిన్న తనం జ్ఞాపకాలు కళ్ళకి మెదులుతున్నాయి.
ఆనంద్ కి సంబంధించి ఒక్కో జ్ఞాపకం మెదులుతుంటే.. ఒక్కసారిగా ఆమె మెదడులో ఫ్లాష్ లా ఒక్క ఆలోచన మెదిలింది.
వెంటనే ఆమె కళ్ళు తుడుచుకుంది.
గత జ్ఞాపకాల తలపులతో మనసు భారమైన అంజనీ దేవి ఒక్కసారిగా తేరుకుని, తన పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని తన లాయర్ జగన్నాథం గారికి ఫోన్ కలిపింది.
ఒక రింగు తిరిగేసరికి లాయర్ ఫోన్ కట్ చేసి వెంటనే లిఫ్ట్ చేశారు.
”నమస్కారం మేడం.. ఈ సమయంలో మీరు ఫోన్ చేశారంటే.. ఏమైనా అత్యవసరమా?” ఆందోళనగా అడిగాడు జగన్నాథం.
”జగన్నాథం గారు.. నేను తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నాను. నా కొడుకు, కోడలు, మనుమడు .. ఇలా అందరినీ కోల్పోయి ఒంటరిదాననైపోయాను. ఈ నిమిషంలో నాకు ఎవరో ఒక నమ్మకమైన వ్యక్తి అండగా ఉండాలి, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి” గద్గద స్వరంతో అంది అంజనీ దేవి.
”మీ బాధ నేను అర్థం చేసుకోగలను మేడం. విధి చాలా క్రూరమైనది. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. నేను రేపు ఉదయాన్నే నేరుగా పెద్ద భవనానికి వస్తాను. మన సంస్థకి, ఆస్తికి సంబంధించిన లీగల్ విషయాలు, వీలునామా గురించి మనం కూర్చుని మాట్లాడుకుందాం..” అని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు లాయర్.
”లేదు జగన్నాథం గారు.. రేపటి వరకు వేచి ఉండే ఓపిక నాకు లేదు. ఈ క్షణమే నా ప్రాణాలకు, మన ఆస్తికి, భవిష్యత్తుకి ఒక స్పష్టత కావాలి. మీరు ఇప్పుడే బయలుదేరి రాగలరా?” అని కోరారు ఆమె.
”తప్పకుండా మేడం, అర్ధరాత్రి అయినా పర్వాలేదు, నేను అరగంటలో అక్కడ ఉంటాను” అని ఫోన్ పెట్టేశాడు జగన్నాథం.
ఫోన్ పెట్టేసిన అంజనీ దేవి మళ్ళీ కుర్చీలో వెనక్కి ఆనుకుని కిటికీ గుండా బయట చీకట్లోకి చూస్తూ ఉండిపోయింది.
కొద్ది నిమిషాల తర్వాత లాయర్ జగన్నాథం కారు వచ్చి మెయిన్ బిల్డింగ్ గేటు వద్ద ఆగింది. సెక్యూరిటీ అతనికి తలుపు తీయడంతో, ఆయన నేరుగా అంజనీ దేవి గదికి చేరుకున్నారు.
రoడి జగన్నాథం గారు.. కూర్చోండి” అని సైగ చేశారు అంజనీ దేవి.
ఆయన కూర్చున్న వెంటనే ఆమె అసలు విషయానికి వచ్చారు.
”జగన్నాథం గారు.. నిరంజన్, ఆనంద్ కష్టపడి సంపాదించిన ఈ సామ్రాజ్యం, ఈ ఆస్తులు.. రేపు రాబందుల్లాంటి బంధువుల పాలు కాకూడదు. ముఖ్యంగా నిర్మల కుటుంబం ఈ ఆస్తి కోసం కన్ను వేసి ఉంది. నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. అలాగే, వీర్ మంచివాడే.. కానీ ఈ ఆస్తిని వీర్ కి ఇవ్వాలనే ఆలోచన కూడా నాకు లేదు. మరి ఈ ఆస్తికి సరైన వారసుడు ఎవరు? ఈ సామ్రాజ్యాన్ని కాపాడుతూ, మా వంశం పేరు నిలబెట్టే వ్యక్తి ఎవరు?” గుండె లోతుల్లో నుంచి వస్తున్న ఆవేదనతో అడిగారు అంజనీ దేవి.
జగన్నాథం గారు కాసేపు మౌనంగా ఆలోచించి, “మేడం, మీరు చెప్పింది నిజమే. ఇన్ని కోట్ల ఆస్తికి సరైన యాజమాన్యం లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. బంధువుల కన్ను పడకుండా ఉండాలంటే మనం ఒక పటిష్టమైన లీగల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడమో, లేదా మరేదైనా ప్రత్యామ్నాయ మార్గం వెతకడమో చేయాలి. అయితే, దీనికి ఒక బలమైన దారితీసే వ్యక్తి లేదా సంస్థ కావాలి” అన్నారు.
అంజనీ దేవి మొఖంలో ఒక గంభీరమైన ఆలోచన మెరిసింది. ఆమె కళ్లల్లో కోరిక, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నా కొడుకు రక్తం పంచుకున్న వాళ్ళే ఈ ఆస్థి అనుభవించాలి.. అంది స్థిరంగా ఆమె.
ఆమె వైపు ప్రశ్న్తర్థకం గా చూసాడు లాయర్ జగన్నాధం.
ఇంకా ఉంది
Swipe left/right or tap the sides to turn pages