ఏం చెప్పమంటావ్ విష్ణు.. నీకు గుర్తుందా.. ఉందో లేదో నాకు తెలీదు.. నేనైతే గుర్తుపెట్టుకోవాలి.. చిన్నప్పుడు.. బాగా చిన్నప్పుడు.. నిన్ను బావా అని పిలుస్తుంటే.. అలా పిలవొద్దని సుప్రజ అత్త తిట్టింది. మొగుడ్ని వదిలేసిన దానికి పుట్టావ్.. నువ్వు వాడిని బావ అంటావేంటి.. అంది.. అప్పట్నుంచి నిన్ను గానీ ప్రణతి ని గానీ వరస పెట్టి పిలవలేదు.. పిలవలేదు అంటే ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది.. ఆ తరువాత నా ముఖం, మా అమ్మ ముఖం కనిపిస్తే చాలు.. ఆవిడ తిట్టని రోజంటూ లేదు.. ఉందేమో నువ్వే చెప్పు విష్ణు.. మనసు కి అయిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తండ్రి లేని పిల్లగా పెరిగాను.. ఈ ఊళ్ళో సురేంద్ర మావయ్య మేనకోడలు అనే కదా నా ఐడెంటిటీ.
ఆమె వైపు బాధగా చూస్తున్న విష్ణు వైపు ఓ సారి కొన సాగించింది ఆమె.
విష్ణు.. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా.. పెనం మీద నుంచి పొయ్యి లో పడ్డట్టు..
హ్మ్.. నాకు నీ మనసు ఎప్పుడో తెలుసు విష్ణు.. కానీ నిన్ను తిరిగి ప్రేమించాలంటే నాకు భయం.. ఆ నరకం ఊహించుకుంటే భయంగా ఉంది విష్ణు.. నువ్వు నాకు ప్రతి అడుగులో తోడుగా ఉన్నావు.. ఎంతో సపోర్ట్ ఇచ్చావ్.. కానీ పెళ్లి చేసుకోమని అడగొద్దు విష్ణు.
మీ దయ దాక్షిణ్యాలమీద ఇన్నాళ్లు బ్రతికేసాం.. నిజం చెప్తున్నా.. ఉద్యోగం వస్తే అమ్మ ని తీసుకుని దూరంగా వెళ్లిపోవాలని ఉంది.. డబ్బుకి ఇబ్బంది పడని జీవితాన్ని గడపాలి అని ఉంది విష్ణు.. మీ అభిమానం ఎంత బావున్నా.. సుప్రజ అత్త రోజు చేసే అవమానం.. తట్టుకోలేను.. మనం పెళ్లి చేసుకుంటే ఇక ఎప్పటికి మీ పెరటి ఇంట్లోనే అమ్మ మగ్గిపోతుంది.. బయట లోకం చూడకుండా జీవితం అంతా కష్టపడుతూనే ఉంటుంది.. వాల్మీకి ఆశ్రమం లో ఉన్న సీతమ్మ కి రాముడు దూరమైనా వాల్మీకి తండ్రిలా కాపాడాడు.. కానీ మేమున్నది వాల్మీకి ఆశ్రమం కాదు.. ఇలా మాట్లాడుతుంటే నీకు బాధ కలుగుతుందేమో విష్ణు.. నన్ను క్షమించు.. అంది మహా.
చిన్నగా నిట్టూర్చి.. పోనీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోదాం మహా.. అన్నాడు మెల్లిగా విష్ణు.
హ్మ్.. అని నిట్టూర్చి చిన్నగా నవ్వి.. ఎలా?? మా అమ్మని కూడా పట్టుకునా… ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు ఉంటావ్ విష్ణు అలా.. అయినా నా సమస్యకి నిన్ను నీ తల్లిదండ్రులకి దూరం చేయాలా.. నేనంటే అత్తకి కోపం.. కానీ నువ్వు పంచప్రాణాలు తనకి..మేనమామ నేనిచ్చే కానుక కొడుకు నుండి దూరం చేయడమా.. వద్దు విష్ణు.. బాగా ఆలోచించాకే చేప్తున్నాను.. నీకు నా మీద ప్రేముంటే మీ కంపెనీ లో జాబ్ చూసిపెట్టు చాలు.. అంది మహా.