New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వాలం – 4
వాలం 5 min read

వాలం – 4

అసలు పొగరు తక్కువ లేదు ఈ పిల్లకి..అనుకున్నాడు కోపంగా అరవింద్. 

 

మహిత.. నీకు జరిగింది ఏది తెలియదు నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా.. నీకు ఈవిడ మేనత్త అవుతుంది.. మా వదిన చాలా మంచిది.. పెళ్లి కాక ముందు మేమిద్దరం స్నేహితురాళ్ళలా ఉండే వాళ్ళం..

మా అన్నయ్య నా పెళ్లి ని అంగీకరించలేదు.. ఎందుకంటే నేను చేసుకుంది ప్రేమ వివాహం.. పైగా కులం కాని వాడిని చేసుకున్నానని ఆయనకి కోపం వచ్చింది.. అందుకే మీ నాన్నకి అన్నయ్యకి ఉన్నన్నాళ్ళు పడనేలేదు.. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ లోకంలో లేరు.. ఇంకా ఎందుకు ఈ కోపాలు..ద్వేషాలు..? అంది వసుధ.

 

ఓహో.. అలాగా మేడం.. ఇప్పుడు నాన్న ఈ లోకంలో లేరు కదా అని జరిగిన అవమానాలు,వీళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచారన్న అతి పెద్ద విషయాన్ని నువ్వు పట్టించుకోవడమే లేదా.. కానీ వీళ్ళు దూరంగా ఉంచింది మా నాన్నని.. మా నాన్న విషయంలో ఏదైనా తప్పు జరిగితే నేను అస్సలు సహించను.. ఆయన ఈ లోకంలో లేకపోయి ఉండొచ్చు.. ఆయన బ్రతుకున్నప్పుడు గౌరవించని వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత మనకి దగ్గర అవటాన్ని నేను సహించను.. వెళ్ళిపోదాం పదమ్మ.. అంది కాసింత కోపంగా మహిత.

 

చాలు మహిత.. నీకు మీ నాన్న మూర్ఖత్వమే వచ్చింది.. మీ నాన్న మూర్ఖత్వం వల్లే నేను నా పుట్టింటికి దూరమై కొన్ని ఏళ్లు అయిపోయింది.. ఇన్నాళ్ళకి మా వదిన కనిపిస్తే కూడా మాట్లాడనివ్వడం లేదు నువ్వు..అంది కన్నీళ్ల తో..

వసుధ.

 

అయితే నువ్వే మాట్లాడుకుని రా.. నేనైతే ఇక్కడ నిలబడేది లేదు.. అంటూ కోపంగా కాస్త దూరంగా వెళ్లి నిలబడింది మహిత.

 

మహిత తన మనసులో బాగా కోపాన్ని పెంచుకున్నట్టుంది వసుధ.. తప్పేముంది తను చూసిన పరిస్థితులను బట్టి మహిత అలా తయారయ్యి ఉండొచ్చు.. అంది కౌసల్య. 

 

అది చాలా మొండిది వదిన.. దానికి వాళ్ళ నాన్న అంటే పిచ్చి ప్రేమ.. వాళ్ల నాన్న చనిపోయినప్పటి నుండి నా బాధ్యత అదే చూసుకోవాలన్న ఒక రకమైన పెద్దరికం, బాధ్యత.. ఎవరూ లేరన్న బాధ,దానిలో కోపాన్ని కూడా పెంచింది.. వాళ్ళ నాన్న లాగే తను ఏది అనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటుంది.. చెప్పింది వినదు.. కానీ దాని మనసు మాత్రం వెన్న లాంటిది.. నా కూతురు చాలా మంచిది వదిన.. అంది వసుధ. 

 

నువ్వు ఇంతగా ఏమీ చెప్పక్కర్లేదు వసు.. అసలు మీ ఇద్దరు.. ఎక్కడ ఉంటున్నారు..?? అని అడిగింది కౌసల్య.

 

దూరంగా కోపంగా నిలుచున్న మహిత వైపు చూసి పట్టించుకోకుండా నిలబడ్డాడు అరవింద్.

 

అందరం పలమనేరు లో ఉండేవాళ్ళం.. మహిత బెంగళూరులో చదువుకుంది.. మెడిసిన్ చదువుకుంది.. చివరి సంవత్సరం.. అవుతుంది. వాళ్ల నాన్న పోయాక అది ఏదోలా తయారైపోయింది.. దానికి తన తండ్రితో విపరీతమైన అటాచ్మెంట్.. ఆయన యాక్సిడెంట్ లో పోవటం తట్టుకోలేక పోతుంది.. ఇప్పటికీ ఆ యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోకి వెళ్లి కాసేపు మౌనంగా ఉండి వస్తుంది.. తన మనసులో ఉన్న బాధంతా వాళ్ళ నాన్న అక్కడే ఉండి వింటారని నమ్ముతుంది.. అంది వసుధ. 

 

వసుధ మాటలకి మహిత వైపు ఇంట్రెస్టింగ్ గా చూశాడు అరవిoద్. 

 

మేము వైజాగ్ లోనే ఉన్నాం వసు.. నువ్వు వెళ్లిపోయాక నీ మీద మీ అన్నయ్య కి కోపం పోయింది అని చెప్పలేను గానీ విపరీతమైన ప్రేమ ఉన్నచోటే విపరీతమైన కోపం కూడా పుట్టుకొస్తుంది.. అప్పుడప్పుడు నిన్ను గుర్తు చేసుకుని ఆయనకి బాధ కలిగినప్పుడల్లా నిన్ను తిట్టేవాళ్ళు.. ఆయన కోపం చూసి నేను కూడా నీతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు.. ఆ తర్వాత నీ ఫోన్ నెంబర్ గాని నువ్వు ఎక్కడున్నావో గాని ఏ విషయం కూడా నాకు తెలియలేదు.. రోజులు గడిచిపోయాయి.. సంవత్సరాలు గడచిపోయాయి.. మళ్లీ ఇన్నాళ్ళకి ఆ జగన్నాథుడి దయవల్ల మనం మళ్లీ కలవగలిగాము.. అంది కౌసల్య. 

 

ఓహో.. అంటే ఈవిడ మా నాన్నగారి చెల్లెలు అన్నమాట.. అంటే నాకు సొంత మేనత్త.. అంటే మహిత నాకు సొంత మరదలు.. నాకు మరదలు ఉందన్నమాట.. అప్రయత్నంగా అతడి  పెదవులపై చిరునవ్వు వచ్చింది.

 

అరవింద్లో అన్నయ్య సంస్కారం కనపడింది.. అలాగే అన్నయ్య కోపం కూడా.. అని అరవింద్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది వసుధ.

 

సారీ అత్తయ్య.. తను అలా మాట్లాడేసరికి కోపం వచ్చి మాట్లాడేసాను..అన్నాడు చిరునవ్వు తో అరవింద్. 

 

దానికి ముందు కోపం వచ్చి తర్వాతే మాట వస్తుందిలే.. దానితో నాకు అదే గొడవ.. ఉత్తి గయ్యాళి పిల్ల.. మా అత్తగారు గానీ మళ్లీ పుట్టిందా అని అప్పుడప్పుడు అనుమానం కూడా వస్తూ ఉంటుంది..అని నవ్వింది వసుధ. 

 

అరవింద్ అందంగా నవ్వేసాడు. 

 

ఆడపిల్ల ఈ రోజుల్లో అలాగే ఉండాలి లే వసు.. అయితే పూరీ దర్శనానికి వచ్చారన్నమాట.. అంది కౌసల్య. 

 

మనం ఎప్పుడూ అనుకునేవాళ్లం కదా వదినా.. నవక లేబర ఉత్సవానికి పూరి వెళ్లి తీరాలి అని..ఇన్నాళ్లకి కుదిరింది. మహి కి ఎల్లుండి కాలేజ్ ట్రిప్పు ఒకటి ఉంది.. స్నేహితులు అందరూ కలిసి హంపి వెళ్తున్నారు.. మేము ఈరోజు తిరిగి వెళ్ళిపోతున్నాము..అంది వసుధ. 

 

అవునా.. ఇప్పుడైనా ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుందాం.. పిల్లకి ఇంటికి వెళ్లాక మెల్లిగా నచ్చచెప్పి చూడు.. మన మధ్య ఉన్న బంధం ఎవరి తెంపిన తెగిపోయేది కాదు.. మీ అన్నయ్య కూడా నువ్వు నీ ఇంటికి తిరిగి వస్తే సంతోషపడతారు.. మహితకి కాస్త కోపం తగ్గాక ఇద్దరూ కలిసి వైజాగ్ రండి.. అంది కౌసల్య. 

 

తప్పకుండ వదిన.. నేను అరవింద్ నెంబర్ కూడా తీసుకుంటాను.. అని.. ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుంది వసుధ. 

మిస్డ్ కాల్స్ ఇచ్చుకుని నెంబర్లు సేవ్ చేసుకున్నారు.

 

ఇంతకీ అరవింద్ ఏం చేస్తున్నాడు..?? అని అడిగింది వసుధ.

 

నేను ఇంజినీరింగ్ చేశాను అత్తయ్య.. నాన్న వ్యాపారం ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను.. ఎంబీఏ చేస్తున్నాను.. అన్నాడు అరవింద్. 

 

మన వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారం అది.. మంచి పని చేస్తున్నావ్ అరవింద్.. అని, కౌసల్య వైపు చూసి.. నేను ఫోన్ చేస్తూ ఉంటాను వదిన.. మేము కాసేపట్లో దర్శనం చేసుకుని బయలుదేరాలి.. సాయంత్రం నాలుగు గంటలకి ఫ్లైట్ ఉంది.. అంది వసుధ. 

 

సరే అమ్మ.. కనీసం ఫోన్లో నైనా మనం మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది.. అంది కౌసల్య. 

 

హ్మ్.. అని, అరవింద్ నుదుటి మీద ముద్దుపెట్టుకుని.. నీ మేనత్తకి ఎవ్వరూ లేరు అరవింద్.. అందుకే దేవుడు మళ్లీ నిన్ను దగ్గర చేశాడేమో.. అంది వసుధ ఎమోషనల్ గా.

 

నీకు ఏ అవసరం వచ్చినా నీ మేనల్లుడు ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు.. నాకు ఫోన్ చెయ్ అత్తయ్య.. అన్నాడు అభిమానంగా అరవింద్. 

 

హ్మ్.. ఆ దయ్యం చాలా కోపంగా ఉంది.. ఇక నేను బయలుదేరతాను.. అని కంగారుగా మహిత నిలబడ్డ వైపు వెళ్ళిపోయింది వసుధ.

 

వసుధ తన దగ్గరికి వచ్చాక ఒకసారి కోపంగా వీళ్ళిద్దరి వైపు చూసి విసవిసా నడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మహిత.

 

హ్మ్.. మంచి ఫైర్ బ్రాండ్ లా ఉంది అమ్మ నీ మేనకోడలు..అన్నాడు నవ్వుతూ అరవింద్. 

 

హ్మ్.. మనసులో బోలెడు బాధ దాచుకున్న వాళ్ళు ఆ బాధని కోపంగా చూపిస్తూ ఉంటారు.. మహిత కూడా అదే స్థితిలో ఉంది నాన్న.. కోపంలో ఉండేటప్పుడు ఆలోచన పనిచేయదు.. మెల్లిగా తనే మారుతుంది లే.. ఇన్నేళ్ల తర్వాత మీ  మేనత్తని చూసేసరికి.. చాలా బాధనిపించింది.. మన ఇంట్లో ఉండేటప్పుడు యువరాణిలా ఉండేది రా.. వసుధ వెంకటేష్ అన్న అతన్ని ప్రేమించింది.. వాళ్లు మన కులం కాదు.. దాంతో మా మామయ్య గారు అత్తయ్య గారు మీ నాన్నగారు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు.. చాలా పెద్ద గొడవలు జరిగాయి.. వసుధ అందర్నీ వదులుకొని వెళ్లిపోయింది.. వసుధ వెళ్లిపోయాక కొన్నాళ్ళు ఇంట్లో పరిస్థితులు అంతా చాలా దరిద్రంగా ఉండేవి అనుకో.

ఎవరికి వాళ్లు ఒకరి మీద ఒకరు అరుస్తూనే ఉండేవాళ్ళు.. కూతురు వెళ్ళిపోయింది పరువు పోయింది అన్న బాధ మీ తాతయ్య నానమ్మలని కృంగదీసింది.. అలాగే బెంగతో చనిపోయేరు వాళ్ళిద్దరూ.. మీ నాన్నకి కూడా తన చెల్లెలు అంటే ఎంతో ప్రేమ.. ఆ ప్రేమ, తన మాటకి కూడా గౌరవం ఇవ్వలేదని బాధ.. కులం తక్కువ వాడిని చేసుకుందని కోపం.. ఆయనని ప్రశాంతంగా ఉంచలేదు.. కానీ వసుధ సంతోషంగా ఉండుంటుంది అన్న భావనతోనే నేను ఆయన ఇద్దరు ఉన్నాం.. అప్పటి పరిస్థితులు వేరు రా.. ఒకవేళ వసుధ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన సరే మన బంధువులందరూ మనల్ని వెలివేసేటట్టు చూసేవాళ్ళు.. ఇప్పుడు అంటే కాలం కొంచెం మారింది గాని.. అప్పటి పరిస్థితులు అలానే ఉండేవి.. క్రమేపి దూరం పెరిగిపోయింది.. ఇదిగో ఇప్పుడే వసుధ ని ఇలా చూస్తున్నాను..అంది కౌసల్య.

 

వాలం కొనసాగుతుంది