New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వాలం – 3
వాలం 5 min read

వాలం – 3

నవ కలేబర యాత్ర మొదలయింది. బాధాతప్త హృదయాలతో జగన్నాధుడికి.. వీడ్కోలు చెప్పడానికి అశేష జన సందోహం అక్కడ ఉన్నారు. 

ఆ జనంలో ఎవరు తొక్కేసుకోకుండా జాగ్రత్తగా తల్లిని.. తీసుకుని బయలుదేరాడు అరవింద్. 
చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. జై జగన్నాథ్ అంటూ బిగ్గర్గా అరుస్తున్నారు. అత్యంత బాధాకరమైన పరిస్థితి అది. భగవంతుడికి అంత్యక్రియలు చేసే ఆ సంప్రదాయం పూరీలో మాత్రమే జరుగుతుంది. 
కన్నీళ్లు పెట్టుకున్న తల్లిని చూస్తూ.. అమ్మ ఏంటిది.. మళ్ళీ కొత్త విగ్రహాలు పెడతారు.. జగన్నాథుడు ఎక్కడికి పోడు.. అన్నాడు అరవింద్.
రేయ్ నీకు తెలీదు.. మనిషి చనిపోయినప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి ఇంకొక కొత్త శరీరంలోకి.. వెళ్ళిపోతుంది.. కానీ పాత శరీరంతో బంధం ఉన్నవాళ్లు అందరూ ఆ నిజాన్ని అంగీకరించి కూడా మనిషి చనిపోయినప్పుడు ఏడుస్తున్నారు కదా.. మనిషి,భావోద్వేగాలకి అతీతం కాదురా.. ఆ దేవదేవుని భూస్థాపితం చేసేస్తారు ఇక్కడ.. చూడటానికి ఎంత బాధాకరంగా ఉంటుందో.. అంది కౌసల్య. 
చూస్తుండ గానే యాత్ర కోయిల్ వైకుంఠాన్ని చేరింది.
విగ్రహాలని అక్కడ ముందే తవ్వి ఉంచిన పెద్ద గోతిలో జాగ్రత్తగా దించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంత్యేష్టి సంస్కార నియమాలు.. తరతరాలు గా ఉన్న దైతాపతులు పాటిస్తారు. 
నవకలేబర యాత్ర పూర్తయ్యాక.. ఆ రాత్రి నూతన విగ్రహాల్లోకి బ్రహ్మ పదార్థాన్ని పెట్టి పూజలు మళ్ళీ యధావిధిగా కానిస్తారు.
విగ్రహాలని భూస్థాపితం చేశాక అందరూ జై జగన్నాథ్ అంటూ కన్నీళ్ళతో పెద్దగా స్వామిని స్మరించుకుంటూ.. అక్కడినుండి బయటపడటానికి కంగారుపడుతున్నారు. 
అమ్మ కంగారు లేదు.. జనం తొక్కేసుకుంటారు నువ్వు ఒక సైడ్ కి నిల్చో కాసేపు తర్వాత వెళ్దాం లే..అన్న అరవింద్ మాటలు విని ఒక పక్కగా నిలబడిపోయింది కౌసల్య. 
ఇంతలో జనంలోంచి ఎవరో తోసిస్తే ఒక్క ఉదుటన అరవింద్ మీద  పడింది 22 ఏళ్ళ ఒక అమ్మాయి.
ఆమె కింద పడిపోకుండా టక్కున ఆమె నడుం మీద చేయి వేసి పట్టుకున్నాడు.
వెంటనే కోపంగా…
హే.. నా నడుం మీద చేయి వేస్తావ్ ఏంటి.. పిచ్చిపిచ్చిగా ఉందా.. అంటూ కోపంగా అడిగిందామె.
అప్పుడు చూశాడు ఆమె ముఖం.
పసిడివన్నె మేని ఛాయ, తీర్చిదిద్ధి నట్టున్న కనుబొమల మధ్య విల్లు ఎక్కు పెట్టినట్టు ఎర్రని బింది పెట్టుకుంది. సన్నని కోటేరు ముక్కు.. లేత గులాబీ రేకులతో పోటీ పడుతున్న పెదవులు.. ఆ పెదవుల కింద ముద్దుగా ఉన్న చిన్ని గడ్డం.. శంఖంలాంటి మెడ.. తీరైన అవయవ సౌష్టవం.. లేత ఎరుపు చుడిదార్ లో ముద్దుగా ఉంది.
హే.. నిన్నే.. వదులు అలా తినేసేలా చూస్తావ్ ఏంటి.. అలా అంటున్నా ఆమె కళ్ళల్లో  కోపం చూసి వెంటనే ఆమెని వదిలేశాడు.
హలో మేడం , జనంలో ఎవరో తోసేస్తే మీరే వచ్చి నా మీద పడ్డారు.. నేనేమీ మిమ్మల్ని నా మీదకి లాక్కోలేదు.. కాసింత చిరాగ్గానే సమాధానం చెప్పాడు అరవింద్.
నాకు తెలుసులెండి ఇలాంటి చోట్లే కదా మీరు చేతివాటం చూపించేది..అంది ఆమె.
జరిగింది చూసిన కౌసల్య ముందుకు వచ్చి.. ఏంటమ్మా నువ్వే వచ్చి పడటం నేను చూసాను.. మా అబ్బాయి నువ్వు అనుకున్నట్టు కాదు.. ఇంత జనంలో ఏవో పొరపాట్లు.. జరుగుతాయి.. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా.. అంది కౌసల్య.
ఓహో.. మీ పుత్ర రత్నం గారా.. తల్లి పక్కనుండ గానే ఇలాంటి వెధవ వేషాలు వేస్తున్నాడే ఇదేనా మీ..పెంపకం.. అంది ఆమె.
ఓయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్.. ఊరుకుంటే రెచ్చిపోతున్నావ్.. చూస్తుంటే నువ్వే ఏదో ఎక్స్పెక్ట్ చేసి పడ్డట్టు ఉన్నావ్.. ఇలా రాద్ధాంతం చేసి నలుగురు అటెన్షన్ నీ మీద ఉండాలని కదా ఇలాంటివన్నీ చేసేది.. అన్నాడు అరవింద్ కోపంగా.
మిస్టర్.. ఎక్కువ మాట్లాడుతున్నావ్.. అని వేలు చూపిస్తూ బెదిరిస్తున్నట్టు ముఖం పెట్టింది ఆమె. 
ఎక్కువ చేసావు అంటే నడుం కాదు ఎక్కడపడితే అక్కడ పట్టుకుంటాను వెళ్ళిపో..అన్నాడు అరవింద్. 
యు ఇడియట్.. అని అరవింద్ మీద చేయి ఎత్తినదామే.
ఒక్క క్షణం ఆగితే ఆమె చెయ్యి విసురుగా వచ్చి అరవింద్ చెంపని తాకేది.
కాని 45 ఏళ్ళ ఒక స్త్రీ మూర్తి.. ఆమె చేతిని పట్టుకుని ఆపి.. మహీ.. చేసింది చాలు.. నీ వెనుక వెళ్తున్న అబ్బాయి నిన్ను ఈ అబ్బాయి మీదకి తోసేసాడు.. నువ్వు పడిపోకుండా తను ఆపాడు.. విషయం అర్థం చేసుకోకుండా ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు.. అంది ఆమె.
అది కాదు అమ్మ.. అంది చిన్నబోతు ఆమె.
ఆమె చేతిని కిందకు దించి.. అరవింద్ వైపు చూసి.. సారీ బాబు మా అమ్మాయి అపార్థం చేసుకుంది.. నిజానికి తను పడిపోకుండా నువ్వు పట్టుకున్నావని నేను అర్థం చేసుకోగలను.. ఏమనుకోవద్దు.. అంది ఆమె.
ఇంత సంస్కారం గా మాట్లాడుతున్నారు మీకు ఇలాంటి అమ్మాయి పుట్టింది ఏంటండీ..? అన్నాడు అరవింద్.
ఏయ్.. మా అమ్మ నీ వైపు పొరపాటు లేదు అని చెప్తుంది కాబట్టి ఓకే.. లేదంటే నా.. అంది ఆ అమ్మాయి.
కౌసల్య ఆమె తల్లి వైపు ఆశ్చర్యం గా చూసి..నువ్వు.. నువ్వు.. వసుధ కదా.. అంది.
అప్పుడు కౌసల్య వైపు చూసి.. కన్నీళ్లు నిండిన కళ్ళతో చూసి.. వదిన.. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి.. అంది ఒక్కసారిగా వచ్చి హత్తుకుంటూ.
అరవింద్,ఆ అమ్మాయి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూసి.. మళ్లీ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు.
ఎలా ఉన్నావ్ వసుధ.. ఇన్నాళ్ళకి నిన్ను నేను చూడగలిగాను.. ఆ జగన్నాదుడే మనల్ని ఇలా కలిపాడేమో..అంది కౌసల్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ. 
అవును వదిన.. నువ్విలా ఉన్నవేంటి.. అంటే అన్నయ్య.. అంది బాధగా వసుధ. 
కాలం చేసి సంవత్సరం పైగా అయింది.. నువ్వు కూడా నుదుటి బొట్టు లేకుండా ఉన్నావ్ ఏంటమ్మా..అంది కౌసల్య.
ఆయన వెళ్లిపోయి మూడేళ్లయింది.. యాక్సిడెంట్ లో పోయారు.. కానీ అన్నయ్య.. కనీసం ఆఖరి చూపు నోచుకోవటానికి కూడా నాకు లేకుండా పోయిందా.. కన్నీళ్లతో అంది వసుధ.
నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియలేదు.. ఆయన హార్ట్ ఎటాక్.. వల్ల పోయారు.. అంత మన దురదృష్టం.. అంది కౌసల్య. 
హలో హలో.. కాసేపటినుండి చూస్తున్నాను.. ఇద్దరూ సెంటిమెంటల్ డ్రామా పండించేస్తున్నారు.. మాకు ఏమైనా చెప్తారా లేదా.. అoది అమ్మాయి కాస్త విసుగ్గా.
ఎవరమ్మా.. అన్నాడు అరవింద్. 
అప్పుడు ఇద్దరు కళ్ళు తుడుచుకొని.. మొత్తానికి బాగా పరిచయమయ్యారు బావ మరదలు ఇద్దరు.. అన్నారు వసుధ, కౌసల్య ఇద్దరు ఒకేసారి.
బావ మరదళ్ల??అని ఇద్దరు షాకింగ్ గా ఒకరినొకరు చూసుకున్నారు అరవింద్,ఆ అమ్మాయి.
ఓ పక్కగా మాట్లాడుకుందాం.. రా వదిన.. అంటూ పక్కనే ఉన్న మంటపం దగ్గరికి వెళ్లి కూర్చున్నారు, వదిన మరదలు ఇద్దరు.
చేసేదేం లేక అరవింద్, మహి కూడా అటువైపు నడిచారు. 
వదిన.. నాకు ఒక్కతే కూతురు.. మహిత.. అంది వసుధ. 
నువ్వు అరవింద్ ని గుర్తుపట్టలేదా..?? అంది కౌసల్య.
అర్థం అయింది.. నా చిన్నారి అరవింద్ రామ్ అని.. ఎంత పెద్దవాడు అయిపోయాడు.. చిన్నప్పుడు ఇంతింతేసి  బుగ్గలు వేసుకొని బాగా ఒళ్ళుగా ఎంత బాగుండేవాడు.. ఇప్పుడు బాగా సన్నబడిపోయాడు.. అంది వసుధ… అరవింద్ వైపు ముచ్చట గా చూస్తూ.
అరవింద్ ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు
మహిత కూడా చక్కగా ఉంది మహాలక్ష్మి లాగా.. అంది మహిత వైపు చూస్తూ కౌసల్య.
ఈ అమ్మాయి నా మరదలా… బంధువులా.. పెద్ద ఫైర్ బ్రాండ్ లా ఉంది.. అనుకున్నడు అరవింద్ తన మనసులో.
ఒక్క నిమిషం.. నాకు ఇప్పుడు అర్థమైందమ్మ..వీళ్ళు.. మిమ్మల్ని కాదు అని చెప్పి మిమ్మల్ని దూరంగా పెట్టిన..మీ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ నా.. ఇన్నేళ్లలో కనీసం ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావ్ కూడా పట్టించుకోలేదు.. ఇప్పుడేంటంటే ప్రేమలు పొంగిపోతున్నాయి.. నాన్నని యాక్సెప్ట్ చేయలేదు.. ఇప్పుడు మాత్రం బంధుత్వాలు కలిపేసుకుంటున్నావా నువ్వు.. అంది కోపంగా మహిత.
వసుధ, కౌసల్య.. మహిత వైపు బాధగా చూసారు.
కాసింత కోపంగా ఆమె వైపు చూశాడు అరవింద్ రామ్.
వాలం కొనసాగుతుంది