ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-103
తారక్ చేతుల్లో కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోయిన సాక్షి, మరుసటి రోజు ఎప్పటిలాగే ఉదయాన్నే మేల్కొంది.
తనను గట్టిగా హత్తుకుని పడుకున్న తారక్ చెంపపై ముద్దుపెట్టింది. అతని జుట్టును మెల్లగా చెదరగొట్టి, నెమ్మదిగా అతని నుంచి విడిపించుకుని స్నానం చేసి వచ్చింది.
“ఇంత తొందరగా ఎందుకు లేచావు? ఇంట్లో అంత పెద్దగా ఏం పని లేదు కదా… ఇంటి నిండా పనివాళ్లు ఉన్నారు. అలాంటప్పుడు ఇంత పొద్దున్నే లేచి ఏం పని చేయాలి నువ్వు?
నీకు ఉన్న ఒకే ఒక్క డ్యూటీ… ఈ తారక్ రామ్ యాదవ్‌ను చూసుకోవడం. అది చేయాలి కదా నువ్వు,” అంటూ బెడ్ మీద నుంచి లేచి ఒళ్లు విరుచుకుంటూ, సాక్షికి కన్నుకొట్టి అడిగాడు.
“ఓహో… అవునా? మరి మీ డ్యూటీ మాత్రమే చేయాలా? ఇంతకీ ఆ డ్యూటీ ఏంటో?” అంటూ తడి జుట్టును తుడుచుకుంటూ, ఆ జుట్టును వెనుకకు వేసుకుంది. ఆమె జుట్టులోని నీటి బిందువులు తారక్ ముఖంపై పడేలా చేస్తూ, నవ్వుకుంటూ అద్దం ముందు నిలబడి నుదుటిపై బొట్టు పెట్టుకుంది.
“ఇంకేం లేదు… భర్త లేవగానే మార్నింగ్ కిస్ ఇచ్చి, మేకప్ కిస్ ఇచ్చి, బెడ్ కిస్ ఇచ్చి నిద్ర లేపాలి. తర్వాత కాఫీ కిస్, టిఫిన్ కిస్… అలాగే ఆఫీసుకు పంపించేటప్పుడు చివరిగా గుర్తుండిపోయేలా ఇలా దీర్ఘంగా ముద్దు పెట్టాలి,” అంటూ ఆమెను తనవైపు లాక్కుని ఆమె పెదవులపై ముద్దుపెట్టాడు.
ఆమె కొసరుకున్న కొద్దీ అతనికి మరింతగా ఆటపట్టించాలనిపించింది. తనకు తృప్తి కలిగేంతగా ఆమెను ముద్దాడిన తారక్, చివరగా తన పెదవులను తుడుచుకుంటూ ఆమెను వదిలాడు.
“ఛీ తారక్ సర్! నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. మీరు ఇంకా స్నానం కూడా చేయలేదు. నన్ను ముట్టుకున్నారు… గబ్బుగా ఉన్నారు!” అంటూ ముద్దుగా కళ్ళు పెద్దవి చేసి అతన్ని మందలించింది.
“ఏంటి ‘ఛీ’ అంటున్నావు? రాత్రి మనిద్దరం ఏం చేశామో మర్చిపోయావా? దానికంటే ఇదేంటి?” అంటూ అడిగి, మళ్లీ ఆమెను ముద్దుపెట్టుకోవడానికి వెళ్లాడు.
అతని ముఖం మీద తడి టవల్‌ను విసిరి, సాక్షి రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయింది.
“యూ ఇడియట్! నా మీద టవల్ విసిరి వెళ్లిపోతావా? ఇంటివాళ్ల ముందు నీ చీర లాగకపోతే నా పేరు తారక్ కాదని శపథం చేస్తున్నాను!” అంటూ తారక్ సరదాగా బెదిరించి, ఫ్రెష్ అయి జిమ్‌లో వర్కౌట్ పూర్తి చేసి స్నానం చేయడానికి వెళ్లాడు.