New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆమె ఇంకా అక్కడే ఉంది… – 5

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 5

ఒక రహస్యమైన లేఖతో వేలగూడెం చేరుకున్న రచయిత ఆద్వైత్… అక్కడి పాత బంగ్లాలో ఎన్నో సంవత్సరాలుగా తన కోసమే ఎదురు చూస్తున్నట్టున్న ఒక రహస్యమైన అమ్మాయిని కలుస్తాడు. కానీ ఆ బంగ్లాలో ప్రతి అడుగూ ఒక కొత్త రహస్యాన్ని, ప్రతి తలుపు ఒక భయంకరమైన నిజాన్ని అతని ముందుకు తీసుకు వస్తుంది.

 

***

 

ఆ అమ్మాయి అతన్ని కొట్టినా సరే అతను మాత్రం..

“వెనక ఎవరో ఉన్నారు” అని మెల్లగా అన్నాడు.

 

ఆ అమ్మాయి ఒక్కసారిగా తిరిగి అతని భుజాలను పట్టుకుంది.

 

ఆమె కళ్లలో కన్నీళ్లు.

“లేదు. వెనక్కి తిరిగితే… అది మిమ్మల్ని చూసేస్తుంది” అంది బాధగా..

 

ఆమె మాట పూర్తవగానే…

అదే క్షణంలో… కారిడార్ చివర ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది.

 

భళ్ల్..!

 

ఆ అద్దం వెయ్యి ముక్కలుగా చెల్లాచెదురైంది.

లాంతరు వెలుగు గాలికి బలంగా ఊగింది.

చీకటి మరింత దగ్గరైంది.

 

ఆ అద్దంలోని ప్రతి ముక్కలో… ఆద్వైత్ వెనుక ఎవరో నిలబడి ఉన్న ప్రతిబింబం కనిపించింది.

 

అప్పుడే…

కింద అంతస్తులోని పాత గడియారం…

టన్…

టన్…

టన్…

 

మూడు సార్లు మోగింది.

 

ఆ శబ్దంతో…

ఇల్లు మొత్తం కాసేపు నిశ్శబ్దమైంది.

ఆ అమ్మాయి నెమ్మదిగా కళ్లను మూసుకుంది.

 

“వచ్చేసింది..“ అని చాలా మెల్లగా అంది.

 

“ఎవరు?” ఆద్వైత్ అడిగాడు.

 

ఆమె సమాధానం చెప్పలేదు.

 

ఇద్దరూ మెట్ల వైపు నడిచారు.

 

అప్పుడే…

 

ఘల్…

ఘల్…

ఘల్…

గజ్జెల శబ్దం.

మెట్ల కింద నుంచి.

 

నెమ్మదిగా…

ఒక్కో మెట్టు ఎక్కుతోంది.

 

ఇద్దరూ ఊపిరి బిగపట్టారు.

చీకటిలో…

మొదట ఒక తెల్లటి చేయి కనిపించింది.

 

తర్వాత…

ఆ చేయి మెట్ల రైలింగ్‌ పై ఆనుకుంది.

 

ఆద్వైత్ గుండె ఆగిపోయినట్టైంది.

 

కొన్ని క్షణాల తర్వాత…

ఒక వృద్ధురాలు నెమ్మదిగా పైకి వచ్చింది.

 

తెల్లటి జుట్టు..

ముడతలు పడిన ముఖం..

చేతిలో పాత కర్ర..

కాళ్లకు వెండి గజ్జెలు..

 

కానీ…

ఆమె కళ్లలో నల్లటి కనుగుడ్లు లేవు.

మొత్తం తెల్లగా ఉన్నాయి.

ఆమె నేరుగా ఆద్వైత్ వైపు చూసింది.

 

కొన్ని క్షణాలు… నవ్వింది.

ఆ నవ్వులో ఆనందం లేదు.

ఎవరినో గుర్తు పట్టిన ఆనందం మాత్రమే ఉంది.

 

“వచ్చావా…” అని మెల్లగా అంది.

 

“ఈసారి కూడా… ఆమెను కాపాడగలనని అనుకుంటున్నావా?” అంది.

 

ఆ మాట విన్న వెంటనే…

ఆ అమ్మాయి ముఖం పాలిపోయింది.

 

“ఆగు!” అని గట్టిగా అరిచింది.

 

అయితే…

ఆ వృద్ధురాలు తన కర్రను నేలపై ఒక్కసారి బలంగా కొట్టింది.

 

ధమ్..!

ఆ శబ్దంతో…

ఇల్లంతా ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది.

 

లాంతరు ఆరిపోయింది.

వర్షం శబ్దం ఆగిపోయింది.

 

ఆద్వైత్‌ కు…

తన గుండె కొట్టుకునే శబ్దం మాత్రమే వినిపిస్తోంది.

 

ఆ చీకటిలో…

ఎవరో అతని చెవి దగ్గరకు వచ్చి…

చాలా మెల్లగా చెప్పారు…

“ఈసారి… నువ్వు కూడా ఇక్కడి నుంచి బ్రతికి వెళ్లవు…”

 

ఆద్వైత్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు…

కానీ అక్కడ…

ఎవరూ లేరు..

 

కొన్ని క్షణాలు…

ఆద్వైత్ అలాగే నిలబడి ఉన్నాడు.

తన చెవుల్లో ఇంకా అదే మాటలు మార్మోగుతున్నాయి.

 

“ఈసారి… నువ్వు కూడా ఇక్కడి నుంచి బ్రతికి వెళ్లవు…”

 

అతని నుదుటి పై చెమట చుక్కలు మెరిశాయి.

 

“ఎవరు…?” అని గట్టిగా అరిచాడు.

 

అతని గొంతు బంగ్లా అంతా ప్రతిధ్వనించింది. కానీ సమాధానం రాలేదు.

 

నెమ్మదిగా…

లాంతరు మళ్లీ వెలిగింది.

ఆ పసుపు వెలుతురులో ఆ అమ్మాయి అతని ఎదుటే నిలబడి ఉంది.

 

ఆమె కళ్లు మాత్రం మెట్ల వైపే ఉన్నాయి.

 

“వెళ్లిపోయిందా…?” అని ఆద్వైత్ అడిగాడు.

 

ఆ అమ్మాయి మెల్లగా తల ఊపింది.

“లేదు… అది ఎప్పుడూ వెళ్లదు. మనల్ని చూస్తూనే ఉంటుంది.”

 

ఆద్వైత్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు.

“అసలు అది ఎవరు?!”

 

ఆమె లోతుగా నిట్టూర్చింది.

“ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెబితే… మీరు నన్ను నమ్మరు.”

 

అప్పుడే…

హాల్‌ లోని గోడపై వేలాడుతున్న పాత ఫోటో ఒక్కసారిగా నేలపై పడిపోయింది.

 

భళ్ల్..!

 

గాజు ముక్కలు చెల్లాచెదురయ్యాయి.

 

ఆద్వైత్ వెంటనే అక్కడికి పరుగెత్తాడు. నేలపై పడిన ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. అది ఈ బంగ్లాలోని కుటుంబ ఫోటో.

 

దుమ్మును మెల్లగా తుడిచాడు.

ఒక్కసారిగా అతని గుండె బలంగా కొట్టుకుంది.

ఫోటోలో…

అదే బంగ్లా.

అదే ఆవరణ.

మధ్యలో ఒక పెద్ద కుటుంబం.

 

వారి వెనుక…

తెల్లటి చీరలో అదే అమ్మాయి నిలబడి ఉంది.

కానీ…

ఆమె పక్కనే నిలబడి ఉన్న యువకుడిని చూసిన క్షణంలో…

ఆద్వైత్ చేతిలోని ఫోటో జారిపోయింది.

 

ఆ యువకుడి ముఖం…

అచ్చం ఆద్వైత్‌ లాగే ఉంది.

ఒక్క తేడా కూడా లేదు.

 

“ఇది… ఎలా సాధ్యం…?”

అతను వణుకుతున్న స్వరంతో అడిగాడు.

 

ఆ అమ్మాయి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చింది.

ఫోటోను చేతిలోకి తీసుకుని దానిపై ప్రేమగా చేయి వేసింది.

 

ఆమె కళ్లలో నీళ్లు మెరిశాయి.

 

“ముప్పై సంవత్సరాలుగా… ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే… మీరు మళ్లీ వస్తారని నాకు తెలుసు.”

 

ఆ మాట ముగిసిన వెంటనే…

పై అంతస్తులోని చివరి గది నుంచి…

ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించింది.

 

“అమ్మా… తలుపు తీయమ్మా…”

 

ఆ శబ్దం వినగానే…

ఆ అమ్మాయి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది.

 

“అయ్యో…” అని భయంతో వెనక్కి అడుగు వేసింది.

 

“ఆ శబ్దం విన్నారా…?” అని ఆద్వైత్ అడిగాడు.

 

ఆమె నెమ్మదిగా తల ఊపింది.

“విన్నాను, కానీ… ఈ ఇంట్లో వినిపించే ప్రతి ఏడుపు… బ్రతికున్న మనిషిదని అనుకోవద్దు.”

 

ఆ మాటలతో…

పై అంతస్తులోని చివరి గది తలుపు…

ధమ్..! అని ఒక్కసారిగా తనంతట తానే తెరుచుకుంది.

లోపల నుంచి చల్లటి గాలి ఒక్కసారిగా కారిడార్‌ లోకి దూసుకొచ్చింది…

 

అదే సమయంలో…

మల్లెపూల పరిమళం మళ్లీ బంగ్లా అంతా వ్యాపించింది.

 

మర్చిపోవాలనుకున్న గ్రామం

 

ఉదయం…

 

ఆ చల్లటి గాలి ఒక్కసారిగా ఆద్వైత్ ముఖాన్ని తాకింది… అతని కళ్ల ముందు అంతా మసకబారిపోయింది.

 

భారీ వర్షం ఆగిపోయింది.

ఆద్వైత్ కళ్లు తెరిచాడు.

తాను బంగ్లాలోని ఒక పాత గదిలో మంచంపై పడుకుని ఉన్నాడు.

 

నిన్న రాత్రి జరిగినవన్నీ గుర్తొచ్చాయి.

వృద్ధురాలు…

ఆ చీకటి…

ఆ స్వరం…

అతను వెంటనే లేచి బయటికి వచ్చాడు.

 

హాల్‌ లో ఎవరూ లేరు.

ఆ అమ్మాయి కూడా కనిపించలేదు.

 

“హలో…!” అని రెండు సార్లు పిలిచాడు.

 

సమాధానం లేదు.

బయటికి వచ్చాడు.

నిన్న రాత్రి భయంకరంగా కనిపించిన ఆ బంగ్లా…

ఉదయపు వెలుతురులో కూడా ప్రశాంతంగా లేదు.

 

ఇంటి ముందున్న వేప చెట్టు కింద ఒక ముసలాయన నేలను ఊడుస్తున్నాడు.

 

అతన్ని చూసి ఆద్వైత్ ఆశ్చర్యపోయాడు.

“తాతయ్య… ఈ ఇంట్లో ఉండేది ఎవరు?!”

 

ముసలాయన చేస్తున్న పని ఆపి, చేతిలోని చీపురును పట్టుకుని కొన్ని క్షణాలు ఆద్వైత్ వైపు చూసి…

“రాత్రి ఇక్కడే ఉన్నావా బాబు?”

అని మాత్రమే అడిగాడు.

 

ఆద్వైత్ అతన్ని చూస్తూ.. “అవును” అన్నాడు.

 

ఆ మాట విన్న వెంటనే…

ముసలాయన ముఖం రంగు మారిపోయింది.

 

“అయితే… నువ్వు చాలా అదృష్టవంతుడివి” అన్నాడు.

 

ఆద్వైత్ ఆశ్చర్యంగా.. “ఎందుకు?!” అని అడిగాడు.

 

“ఈ ఇంట్లో రాత్రి గడిపిన వాళ్లలో…

ఉదయం బయటికి వచ్చిన వాళ్లు చాలా తక్కువ”

అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

 

***

 

పాత కుటుంబ ఫోటోలో ఆద్వైత్‌ లాగే కనిపించిన ఆ యువకుడు ఎవరు? అతనికి ఆద్వైత్‌ తో ఉన్న సంబంధం ఏమై ఉంటుంది?

“ఈ ఇంట్లో రాత్రి గడిపిన వాళ్లలో ఉదయం బయటికి వచ్చిన వాళ్లు చాలా తక్కువ” అని ముసలాయన ఎందుకు అన్నాడు? అసలు ఆ బంగ్లాలో దాగి ఉన్న భయంకరమైన నిజం ఏమిటి?

 

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే… “ఆమె ఇంకా అక్కడే ఉంది…” కథను తప్పకుండా ఫాలో అవ్వండి.

 

                sp ✍️… writes