ఆ రాత్రంతా శ్రావణికి కంటిమీద కునుకు లేదు. కొత్త డైరీలో రాసిన ఆ నాలుగు ముక్కలు ఆమెలోని ఆవేదనను తగ్గించలేకపోయాయి.
తెల్లవారుజామునే నిద్రలేచి, గదిలో ఉన్న వెలుతురును చూసి ఆమెకు ఎందుకో భయం వేసింది. తన సర్వస్వం అయిన ఆ డైరీ ఇప్పుడు,
ఏ అపరిచితుడి చేతుల్లో ఉందో అన్న ఆలోచన ఆమెను నిముషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.
ఆ రోజు శ్రావణి ఆఫీస్కు గంట ముందే బయలుదేరింది. ఆశ చావలేదు. బహుశా తను ఆ రోజు దిగిపోయిన బస్టాప్ దగ్గరో,
లేక తను వెళ్ళిన దారిలో ఎక్కడైనా ఆ డైరీ పడి ఉందేమోనని ఆమె మనసు గుసగుసలాడింది.
బస్టాప్ చేరుకోగానే, శ్రావణి కళ్లు నేల మీద గాలిస్తున్నాయి.
జనం తోపులాట, బస్సుల హారన్ల చప్పుడు.. ఏవీ ఆమెకు వినిపించడం లేదు. అక్కడ ఉన్న ప్రతి మనిషిని, ప్రతి మూలను వెతికింది.