వీర్ చిన్నగా నవ్వి..అంత దూరం నుండి వచ్చి.. నీతో అబద్దం చెప్తానా మహాలక్ష్మి..?? అని, ఆమె ముందు నిలబడి.. ఓహ్.. గాడ్.. నిన్ను చూస్తే మా మావయ్య ని చూస్తున్నట్టే ఉంది.. అన్నాడు వీర్.
సీత అతడిని పరికించి చూస్తు.. ఎవరు నువ్వు?? అంది.
సుప్రజ దెబ్బ తిన్న పులిలా చూస్తుంది. విష్ణు లో మౌనంగా ఒక అగ్ని పర్వతం రగులుతుంది. సురేంద్ర, ప్రణతి ఆశ్చర్యం గా చూస్తున్నారు.
మహా కి జరుగుతున్నదేదీ అర్ధం కావట్లేదు..
సీత వైపు చూసి.. సీత దగ్గరికి వెళ్లి వంగి ఆమె కాళ్ళకి నమస్కరించి.. “అత్తయ్య..ఈరోజుతో మీ కష్టాలు సరి.. నాతో రండి.. అంతులేని ఐశ్వర్యం లో సంతోషం గా ఉండొచ్చు ” అన్నాడు వీర్.
ఎవరు నువ్వు?? అని అడిగాను.. అంది సీత కాస్త కఠినం గా.
ఇంకా మీరు గుర్తు పట్టలేదా..?? నేను ఆనంద్ ప్రతాప్ మేనల్లుడిని.. నా పేరు వీర్.. అన్నాడు వీర్ గర్వంగా.