వలయం -22
కల్పన అప్పటికే గోర్లు కొరికేసుకుంటూ “లేదు నేను నిధిని చంపలేదు, తనని చంపాలి అని నేనెందుకు అనుకుంటాను తను నా బెస్ట్ ఫ్రెండ్ అయినా తను చనిపోలేదు బ్రతికే ఉంది, ఇప్పుడు మనం నిధి దగ్గరికి వెళ్తున్నాం” అని అన్నది.
అప్పటివరకు కల్పనా గురించే ఆలోచిస్తూ ఆమె తన మీద ఏమైనా ప్లాన్ చేస్తుందా అని అనుమానంతో ఉన్న రాజేష్ నిధి బ్రతికే ఉంది అనే మాట కల్పన నోటి నుంచి బయటికి వచ్చిన మరుక్షణం ఒక్కసారిగా బైక్ బ్రేక్ వేసి ఆపి ఆమె వైపు తిరిగి “నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? ఇప్పుడు మనం నిధి దగ్గరికి వెళ్తున్నామా..? అంటే నిధి బ్రతికే ఉందా ఆరోజు చనిపోలేదా..? అంటే నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు” అని అయోమయంగా అంతకుమించి అనుమానంగా అడిగాడు రాజేష్.
“అయ్యో ఇప్పుడు మీకు చెప్పే టైం లేదు, అక్కడ నిధి ప్రమాదంలో ఉంది త్వరగా బైక్ స్టార్ట్ చేయండి, లేట్ అయితే అక్కడ నిధికి ఏమవుతుందో ఏంటో భయంగా ఉంది” అని అన్నది కల్పన..
“ఏంటి నిది ప్రమాదంలో ఉందా..? కానీ ఆరోజు గ్యాస్ సిలిండర్ పేలిపోయి చనిపోయింది కదా, ఆమె డెడ్ బాడీ కూడా హాస్పిటల్ మార్చురీలో ఉంది, ఇప్పుడేమో నిధి ప్రమాదంలో ఉంది అంటున్నావ్, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా..?” అని రాజేష్ సీరియస్గా అడిగాడు..