ఆధ్య… మొదలైన మరో అధ్యాయం… – 1
ఉదయం ఐదు గంటలు…
ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. వీధిలో అక్కడక్కడా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. చల్లని గాలి కిటికీలో నుంచి లోపలికి వస్తుంటే, ఆ ఇంటి చిన్న గదిలో మాత్రం ఓ అమ్మాయి పుస్తకాలతో కుస్తీ పడుతోంది…
ఆ అమ్మాయి పేరు ఆద్య…
ముందున్న పుస్తకంలో అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నా… ఆమె మనసులో మాత్రం ఏవో ఆలోచనలు అలజడి సృష్టిస్తున్నాయి.
మరో రెండు నెలల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు పూర్తవుతాయి… ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలి… తన కాళ్ల మీద తాను నిలబడాలి… తన తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించాలి.
ఇవే ఆమె కలలు…
ఆ కలలన్నీ నెరవేరితే తన జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయని ఆమె నమ్మకం.
కానీ ఆ ఇంట్లో తన కలలకు ఎంత విలువ ఉందో ఆమెకు బాగా తెలుసు…
ఆద్యా…
వంటగదిలో నుంచి తల్లి పిలుపు వినిపించి… వస్తున్నానమ్మా… అంటూ ఆ పుస్తకాన్ని మూసి బయటకు వచ్చింది ఆద్య…
అమ్మా, ఈరోజు కాలేజీలో ప్లేస్మెంట్ గురించి ఒక సెషన్ ఉంది… అందుకే నేను కొంచెం ముందుగా వెళ్లాలి… అని చెప్తుంది ఆధ్య వాళ్ళ అమ్మతో…
కూతురి మాటలకు తల్లి సరోజిని ఒక్క క్షణం మౌనంగా ఉండి… అదేంటమ్మా, నిన్న మీ నాన్నగారు కాలేజీ ఫీజు గురించి అడుగుతుంటేనే ఎంత బాధపడ్డారో చూశావు కదా… మళ్లీ ఇప్పుడు ఉద్యోగం… ప్లేస్మెంట్లు అంటున్నావు… అన్నారు సరోజని గారు…
ఫీజు గురించి నాకు తెలుసమ్మా. అందుకే కదా ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్నాను… అని ఆధ్య చెప్తుంటే…
అనుకోవడం తప్పు కాదు. కానీ మన పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా… అంటారు సరోజని గారు…
ఆద్య ఏమీ మాట్లాడలేదు…
తల్లితో వాదిస్తే ఆమె బాధపడుతుంది… మౌనంగా ఉంటే తన మనసులోని మాట ఎవరికీ తెలియదు…
ఈ రెండింటి మధ్య నలిగిపోవడం ఆద్యకు కొత్తేమీ కాదు…
…….
ఉదయం ఎనిమిది గంటలకు ఫ్యామిలీ అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేశాక…
తండ్రి రామమూర్తి పేపర్ చదువుతుంటే తమ్ముడు అభి ఫోన్లో ఏదో చూస్తూ తనలో తనే నవ్వుకుంటున్నాడు…
నాన్నా… అంటూ చెప్పడం మొదలుపెట్టింది ఆద్య…
ఏంటి అని ఆయన పేపర్ చూస్తూనే అడిగితే…
మా కాలేజీలో కంపెనీల ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి… నేను కూడా అప్లై చేయాలనుకుంటున్నాను నాన్న… అని అడిగింది ఏమంటారో అని భయపడుతూనే…
రామమూర్తి గారు పేపర్ పక్కన పెట్టి కూతురివైపు చూసి…నీ చదువు పూర్తవ్వనివ్వు ముందు… అన్నారు ఆయన…
అది పూర్తవడానికి ఇంకో రెండు నెలలే ఉంది నాన్నా… ఇప్పటినుంచే ప్రిపేర్ అయితే మంచిదని…
చెప్పేది విను ఆద్యా… ఆయన గొంతులో అసహనం… మన ఇంటి పరిస్థితి నీకు తెలుసు… నీ చదువుకోసం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాం… ఉద్యోగం వస్తే మంచిదే… కానీ దానికోసం ఇంకా డబ్బులు ఖర్చు చేయడం నా వల్ల కాదు…
నేను పెద్ద కోచింగ్ ఏమీ తీసుకోను నాన్నా. కాలేజీలోనే ప్రిపరేషన్కి సహాయం చేస్తున్నారు… నిదానంగా చెప్పింది ఆధ్య…
అయితే చూసుకో. కానీ ఏవేవో ఆశలు పెట్టుకుని తర్వాత బాధపడకు…
ఆ మాటలు పైకి క్యాజువల్ గా అనిపించినా… ఆద్య మనసుకి మాత్రం గట్టిగానే తగిలాయి.
అయినా ఆమె చిరునవ్వు నవ్వి…
సరే నాన్నా… అని చెప్పి అక్కడినుంచి పక్కకు వచ్చేసింది…
ఆమెకు తెలుసు… తన కలలను కాపాడుకోవడానికి అంత సులువుగా ఆ ఇంట్లో తనకు అనుమతి దొరకదని… అంత కంటే కూడా తన పట్టుదలే ఎక్కువ అవసరమవుతుందని కూడా తెలుసు తనకి…
……..
కాలేజీకి చేరుకున్న ఆద్యకు అక్కడి వాతావరణం కొంత ఊరటనిచ్చింది.
ఏయ్ ఆద్యా… అంటూ దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చింది తన స్నేహితురాలు మేఘన…
ఏంటే… ఇప్పుడు కూడా నీ ఫేస్ లో అదే సీరియస్నెస్… కనీసం కాలేజీలో అయినా నవ్వొచ్చు కదే…
ఈ… అంటూ ఆద్య పెదాలు సాగదీసింది…
మేఘన గుర్రుగా చూస్తుంటే…
నవ్వుతున్నానుగా… అంది ఆధ్య…
అది నవ్వు కాదు. ఏదో ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ కి కాఫీ కొడుతూ దొరికిపోయిన దొంగ స్టూడెంట్ కవర్ చేసుకోవడానికి నవ్వినట్టు ఉంది…
మేఘన మాటలకి నిజంగానే నవ్వేస్తుంది ఆధ్య… ఆమెను చూసి మేఘన కూడా నవ్వుతుంది…
కాసేపటికి ప్లేస్మెంట్ సెషన్ స్టార్ట్ అయింది…
స్టేజ్ పైకి వచ్చిన లెక్చరర్ స్టూడెంట్స్ తో మాట్లాడటం స్టార్ట్ చేశాడు…
మీ అందరికీ ఒక విషయం చెప్పాలి… మంచి ఉద్యోగం సంపాదించడానికి మంచి మార్కులు మాత్రమే సరిపోవు… మీ మీద మీకు నమ్మకం ఉండాలి… మీ పరిస్థితులు ఎలా ఉన్నా నేర్చుకోవాలనే తపన … ఆసక్తి… మీలో ఉండాలి… అంటూ ఆయన మాట్లాడుతుంటే…
ఆద్య చాలా శ్రద్ధగా వింటోంది…
మీ కుటుంబ పరిస్థితులు మీకు కొన్ని పరిమితులు విధించవచ్చు… కానీ ఆ పరిమితులే మీ జీవితానికి శాశ్వతమైన హద్దులు కావు… మీరు ఏం చేయగలరో నిర్ణయించేది మీ ప్రయత్నం మాత్రమే… అందులో లోపం లేకుండా చూసుకునే పూర్తి భాధ్యత మీదే… అంటూ ఆయన మాట్లాడుతుంటే…
ఆ మాటలు ఆమె మనసులో ఎక్కడో లోతుగా నాటుకుపోయాయి…
సెషన్ పూర్తయిన తర్వాత మేఘన ఆమె దగ్గరకు వచ్చి… ఏంటి మేడమ్… ఉద్యోగం వచ్చేసినట్టు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్… జాబ్ వచ్చేసిందా… అంటుంది.
అలా ఏమీ లేదు. కానీ ప్రయత్నించాలనే ధైర్యం వచ్చింది…
అదే కావాలి ఇప్పుడు మనకి… ఏ కంపెనీకి అప్లై చేస్తావో చెప్పు. ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుదాం…
ఆద్య సరే అంటూ తల ఊపింది…
ఆ రోజు ఆమె తన భవిష్యత్తు కోసం ఒక చిన్న నిర్ణయం తీసుకుంది.
ఎవరూ తనను ప్రోత్సహించకపోయినా, తాను మాత్రం తన ప్రయత్నం ఎప్పుడు అపకూడదని నిర్ణయించుకుంది…
………
సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఆద్యకు గుమ్మం దగ్గరే తండ్రి గొంతు వినిపించింది…నేను ఇంకెంతకాలం ఇలా అప్పుల కోసం తిరగాలి..? ఎవరిని అడిగినా ఉపయోగం ఉండటం లేదు… ఇప్పటికే తీసుకున్న అప్పులకు సమాధానం చెప్పలేకపోతున్నాను… అంటూ
తల్లి నెమ్మదిగా… ఏదో ఒక మార్గం దొరుకుతుందండీ… అని చెప్తుంటే…
ఏం మార్గం…? ఇంటి ఖర్చులు, అభి చదువు, ఆద్య పెళ్లి… అన్నీ నా తల మీదే ఉన్నాయి… ఇంకా ఏ మార్గం మిగిలింది మనకోసం అంటూ ఆయన చాలా కోపంగా మాట్లాడుతుంటే…
ఆద్య అడుగులు అక్కడే ఆగిపోయాయి.
తన పెళ్లి… తనకు ఇంకా చదువు పూర్తికాలేదు… ఉద్యోగం రాలేదు… తన భవిష్యత్తు గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే… తన జీవితానికి సంబంధించిన మరో నిర్ణయం ఇంట్లో మొదలవడంతో… ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది…
అప్పుడే ఆమె తండ్రి… మన బంధువుల్లో ఒక సంబంధం ఉందని చెప్పారు… అబ్బాయికి చిన్న ఉద్యోగం ఉంది… వాళ్లకు మన పరిస్థితులు తెలుసు… ఈ సంబంధం కుదిరితే మనకూ కొంత భారం తగ్గుతుంది… అని చెప్పగానే…
ఆద్య చేతిలోని పుస్తకాలు జారిపడబోయాయి…
తల్లి ఏం సమాధానం చెప్పిందో వినాలని అనిపించింది… కానీ అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది ఆమె…
నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది…
కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది…
ఎదురింటి చిన్నారి చేతిలో బెలూన్ పట్టుకుని పరుగెడుతుంది… ఆ పిల్లకు తన బెలూన్ ఎక్కడికి ఎగిరిపోతుందో తెలియదు… ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు… అయినా దాన్ని గట్టిగా పట్టుకుని నవ్వుతోంది…
అది చూసి ఆధ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి…
తనకూ అలాంటి చిన్న కోరికే ఉంది… తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించాలని.
అంతకంటే పెద్ద ఆశలేమి లేవు…
కానీ ఆ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి కూడా తాను ఎందుకు ఇంత పోరాడాల్సి వస్తోంది… దీని అంతటికీ కుటుంబ పరిస్థితులే కారణం అనుకొని… మంచం మీద కూర్చుని పుస్తకాన్ని తెరిచింది…
చదవాలని ప్రయత్నించింది… కానీ అక్షరాల మీద దృష్టి నిలవడం లేదు…
తన జీవితంలో జరగబోయే నిర్ణయాలను తాను తీసుకోలేకపోతే… ఇక చదువు పూర్తిచేసి ఉద్యోగం సంపాదించినా ప్రయోజనం ఏమిటి…?
ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి…
కొద్దిసేపటికి ఫోన్ మోగింది… అది మేఘన నుంచి మెసేజ్…
ఆద్యా… రేపు మనం రెజ్యూమ్ తయారు చేద్దాం… నువ్వు ఉద్యోగం సంపాదిస్తావు… నాకు తెలుసు… ఇంకా ఎక్కువగా ఆలోచించకు…
ఆ చిన్న సందేశం చదివిన ఆద్య పెదవులపై చిన్న చిరునవ్వు పూసింది…
ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినా… మనల్ని నమ్మే ఒక్కరైనా మనతో ఉండటం ఎంత బాగుందో కదా… అలాంటి సంతోషమే ఇప్పుడు ఆధ్య మనసులో నిండి ఉంది…
కానీ వెంటనే ఆమె మనసులో మరో ఆలోచన మెదిలింది…
ఎప్పుడూ ఇంకొకరు తనను నమ్మాలని ఎందుకు ఎదురుచూడాలి…?
తనను తాను నమ్ముకోవడం ఎప్పుడు నేర్చుకుంటుంది…? అనుకుంటూ… ఆమె పుస్తకాన్ని మూసి, టేబుల్ మీదున్న ఒక పేపర్తీ తీసుకుంది…
దాని మీద మూడు విషయాలు రాసింది.
1. నా చదువు పూర్తి చేయాలి…
2. ఉద్యోగం సంపాదించాలి…
3. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు అన్నీ నేనే తీసుకోగలిగే స్థాయికి ఎదగాలి…
ఆ మూడు వాక్యాలను చాలాసేపు చూస్తూ ఉండిపోయింది…
తర్వాత ఆ కాగితాన్ని తన పుస్తకంలో భద్రంగా పెట్టింది…
ఆమెకు తెలియదు… రాబోయే రోజుల్లో ఈ మూడు నిర్ణయాల కోసం తను ఎంత ఫైట్ చేయాల్సి వస్తుందో అని…
కానీ ఆ రాత్రి మాత్రం ఆద్య ఒక విషయం నిర్ణయించుకుంది… తన కలలను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేదని…
…….
అర్ధరాత్రి దాటింది…
ఇంట్లో అందరూ నిద్రపోయారు…
ఆద్య మాత్రం మళ్లీ పుస్తకం తెరిచి చదవడం మొదలు పెట్టింది…
బయట చీకటి ఇంకా తొలగపోలేదు.
కానీ ఆమె మనసులో మాత్రం ఓ చిన్న వెలుగు ఉదయించింది…
అది తన విజయానికి సంబంధించిన వెలుగు కాదు…
కానీ తన జీవితం కోసం తాను పోరాడాలని నిర్ణయించుకున్న ఓ అమ్మాయి గుండెలో పుట్టిన మొదటి ఆశ…
ఆ ఆశ ఆమెను ఎక్కడికి తీసుకెళ్తుందో కాలమే చెప్పాలి మరి…
ఇప్పుడే మొదలైన ఆధ్య ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి…
మళ్ళీ కలుద్దాం ❤️
Swipe left/right or tap the sides to turn pages