New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆధ్య… మొదలైన మరో అధ్యాయం… – 2

ఆధ్య… మొదలైన మరో అధ్యాయం… – 2

ఉదయం ఆరు గంటలకు కిటికీలోంచి పడుతున్న సూర్యకిరణాలు ఆద్య ముఖాన్ని తాకుతున్నా… ఆమె చూపు మాత్రం టేబుల్ మీదున్న పుస్తకం మీదే నిలిచింది… 

నిన్న రాత్రి తన తండ్రి మాట్లాడిన మాటలు పదేపదే గుర్తుకొస్తున్నాయి…
ఈ సంబంధం కుదిరితే మనకూ కొంత భారం తగ్గుతుంది… ఆ మాటల్లో తన భవిష్యత్తు కంటే కుటుంబానికి కలిగే ఆర్థిక ప్రయోజనమే ఎక్కువగా కనిపిస్తుంది… 
తన పెళ్లి వల్ల కుటుంబానికి భారం తగ్గుతుందా…?
తనను ఒక బాధ్యతగా చూస్తున్నారా… లేక భారంగా చూస్తున్నారా…?
తన అభిప్రాయానికి ఇంట్లో అసలు విలువే లేదా…? అంటూ సాగుతున్న ఆలోచనలు ఆమె మనసును కలవరపెడుతుంటే…అప్పుడే తల్లి గదిలోకి వచ్చి… 
ఆద్యా… ఇంకా లేవలేదా…? కాలేజీకి వెళ్లాలి కదా… అంటూ పిలుస్తుంది… 
లేచానమ్మా… అని ఆద్య చెప్తే… 
అయితే త్వరగా రెడీ అవ్వు… మీ నాన్నగారు ఈరోజు ఆ సంబంధం వాళ్లతో మాట్లాడతానన్నారు… అని చెప్తుంది సరోజినీ… 
ఆద్య ఒక్కసారిగా షాక్ అయ్యి లెత్తి చూసి…
ఏ సంబంధం అమ్మా…? అని అడుగుతుంది… 
సరోజిని కాసేపు కూతురి ముఖంలోకి చూసి…
నిన్న రాత్రి మీ నాన్నగారు చెప్పిన సంబంధమే… అబ్బాయి పేరు కార్తీక్… ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడట… వాళ్ల కుటుంబం కూడా మంచిదేనని మీ మేనత్త చెప్పింది… అని అంటుంటుంది… 
మరి నాకెందుకు చెప్పలేదు అమ్మా…?
ఏం చెప్పాలే నీకు…?
నా పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం నన్ను అడగాలని అనిపించలేదా…? మీకు…
సరోజిని నిట్టూర్చి… అడిగితే నువ్వు ఒప్పుకుంటావా…? అని అడుగుతుంది… 
ఒప్పుకోవాలా వద్దా అన్నది తర్వాతి విషయం అమ్మా… అసలు నా అభిప్రాయం అడగాలి కదా… 
అన్నీ నీకు నచ్చినట్టే జరగాలంటే ఎలా చెప్పు…? మన పరిస్థితులు కూడా చూడాలి కదా…
అమ్మ మాటలకి ఆద్య కళ్లలో నీళ్లు తిరిగాయి…
మన పరిస్థితులు నాకు తెలియవని అనుకుంటున్నావా అమ్మా…? నాన్న అప్పుల గురించి నాకు తెలుసు… ఇంట్లో ఖర్చుల గురించి తెలుసు… అందుకే కదా ఉద్యోగం సంపాదించి మీకు అండగా నిలబడాలని అనుకుంటున్నాను… మీరెందుకు నన్ను అర్థం చేసుకోరు… 
ఉద్యోగం వస్తుందని ఏంటి నమ్మకం…?
ఆ ప్రశ్నకు ఆద్య దగ్గర వెంటనే సమాధానం లేదు…
కానీ ఆ ప్రశ్నలో తన కూతురిపై నమ్మకం కంటే అనుమానమే ఎక్కువగా వినిపించింది… ఆధ్యకి… 
రాకపోతే మళ్లీ ప్రయత్నిస్తానమ్మా… ఒక్కసారి ఎట్టెంప్ట్ ఫెయిల్ అయినంత మాత్రానా జీవితం ఆగిపోదు ఇక్కడితో ఆగిపోదు కదా… 
సరోజిని మౌనంగా నిలబడిపోయి చూస్తుంది… 
కూతురి మాటల్లో తప్పేమీ లేదు. కానీ భర్తకు ఎదురు చెప్పే ధైర్యం ఆమెకు లేదు…
ఇక తనతో వాదించే ఓపిక లేక… నువ్వు కాలేజీకి రెడీ అవ్వు… సాయంత్రం వచ్చాక మీ నాన్నగారితో నువ్వే మాట్లాడుకో… అంటూ వెళ్లిపోయింది…
ఆద్య సరోజినీని కన్వెన్స్ చేయాలనుకోలేదు… 
ఎందుకంటే తల్లిని ఒప్పించడం కంటే… తన నిర్ణయాన్ని తండ్రికి అర్థమయ్యేలా చెప్పడం ఇప్పుడు ముఖ్యమని ఆమెకు అర్థమైంది…
…….
కాలేజీలో ఆద్య మనసు లెసన్స్ మీద లేదు.
లెక్చరర్ చెబుతున్న విషయాలను నోట్స్‌లో రాసుకుంటున్నా… ఆలోచనలు మాత్రం తన ఇంటి చుట్టూనే తిరుగుతున్నాయి…
క్లాస్ అయిపోయిన తర్వాత మేఘన ఆమె దగ్గరకు వచ్చింది…
ఏమైంది ఆద్యా…? ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాను… ఏదో పరధ్యానంగా ఉన్నావు… ఏంటి విషయం అంటుంది… 
ఆద్య కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి… తర్వాత జరిగినదంతా చెప్పింది.
మేఘన శ్రద్ధగా విని… అంటే మీ ఇంట్లో నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు సరే… మరి నీకు ఏం కావాలి… అని అడుగుతుంది… 
నాకు ఉద్యోగం కావాలి మేఘనా… కనీసం నా కాళ్ల మీద నేను నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలనుకుంటున్నాను…
అయితే అదే విషయం మీ నాన్నగారికి చెప్పు…
చెప్పినా అర్థం చేసుకుంటారో లేదో తెలియదు.”
అర్థం చేసుకుంటారో లేదో అన్న భయంతో నీకు ఏం కావాలో చెప్పకుండా ఉంటే… వాళ్లకు ఎలా తెలుస్తుంది…
ఆద్య తన స్నేహితురాలివైపు చూసింది…
మేఘన మాటలు సింపుల్ గానే ఉన్నాయి… కానీ వాటిని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు…
నాకు నాన్నంటే భయం కాదు మేఘనా… ఆయన నా వలన బాధపడకూడదనుకుంటాను… ఆయనకు ఇప్పటికే ఎన్నో సమస్యలున్నాయి… నా వల్ల మరో సమస్య రావడం నాకు ఇష్టం లేదు…
మేఘన ఆమె చేతిని పట్టుకుని… 
నీ భవిష్యత్తు గురించి మాట్లాడటం ఆయనకు సమస్య కలిగించడం కాదు ఆద్యా… నీ మనసులోని మాట చెప్పే హక్కు నీకుంది… నువ్వు కోరుకున్నది వెంటనే దొరకకపోవచ్చు… కానీ అడగకుండానే వదులుకోవడం ఎందుకు…? ఒక ప్రయత్నం చెయ్యి… తప్పేముంది… 
ఆద్య మనసులో ఏదో ఆలోచన వచ్చింది…
ఆ రోజు ఆమెకు మరో విషయం అర్థమైంది…
తన మనసులోని మాటను చెప్పడం వల్ల అందరూ తనను అంగీకరించకపోవచ్చు… అయినా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పు కాదు కదా…
…….
సాయంత్రం ఐదు గంటలకు… 
ఆద్య ఇంటికి చేరుకునేసరికి తండ్రి హాల్లో కూర్చుని ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నారు….
అవునండీ… అమ్మాయికి ఇంకా చదువు పూర్తికాలేదు… కానీ మంచి సంబంధం అయితే చదువుదేముంది… మీరు ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడండి… 
ఆ మాటలు విన్న ఆద్య అడుగులు అక్కడే ఆగిపోయాయి…
ఫోన్ పెట్టిన తర్వాత రామమూర్తి కూతురిని చూసి…
వచ్చావా..? రేపు సాయంత్రం వాళ్లు ఇంటికి వస్తున్నారు… నువ్వు కూడా ఇంట్లోనే ఉండు… అన్నారు… 
ఆద్య తన చేతిలోని బ్యాగ్‌ను పక్కన పెట్టి… 
 వాళ్ళ దగ్గరికి వచ్చి… నాన్నా, మీతో ఒక విషయం మాట్లాడాలి… అంటుంది… 
ఏంటో చెప్పు…
నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు…
రామమూర్తి ముఖం ఒక్కసారిగా మారిపోయింది…
ఏం మాట్లాడుతున్నావ్…?
నేను ఉద్యోగం సంపాదించాలి నాన్నా… నా చదువు పూర్తిచేసుకుని…  నా కాళ్ల మీద నేను నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలనుకుంటున్నాను…
అయితే అప్పటివరకు నేను ఏం చేయాలి…? ఇంటి ఖర్చులన్నీ ఎలా నడపాలి…? నీకు ఉద్యోగం వచ్చే వరకు నీకోసం ఎదురుచూస్తూ కూర్చోవాలా…?
వణుకుతున్న గొంతుతో… 
నేను మీకు భారం కావాలని అనుకోవడం లేదు నాన్నా… అందుకే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్నాను… అంటుంది…
ఉద్యోగం… ఉద్యోగం… అందరూ ఉద్యోగాలు సంపాదించగలిగితే నిరుద్యోగులు ఎందుకుంటారు…? నీకు ఉద్యోగం వస్తుందనే హామీ ఏమైనా ఉందా…?
హామీ లేదు నాన్నా… కానీ ప్రయత్నించే అవకాశం ఇవ్వండి…
నీ ప్రయత్నాల కోసం నా దగ్గర డబ్బుల్లేవని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను కదా…
నాకు డబ్బులు అవసరం లేదు నాన్నా… కాలేజీలోనే ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ చేస్తున్నారు. నేనే చదువుకుంటాను…
ఇప్పుడు నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉంది… కానీ రేపు ఉద్యోగం రాకపోతే ఏం చేస్తావు..? వయసు పెరిగిపోతే సంబంధాలు వస్తాయా…?
ఆ ప్రశ్న ఆద్యను బాధించింది…
అయినా ఈసారి ఆమె మౌనంగా ఉండలేదు…
నాన్నా…  ఉద్యోగం రాకపోతే మళ్లీ ట్రై చేస్తాను… ఒకసారి ఓడిపోయినంత మాత్రాన నేను పనికిరానిదాన్ని అయిపోను… పెళ్లి ఆలస్యమైనంత మాత్రాన నా జీవితం కూడా ఆగిపోదు కదా…
నాతోనే వాదిస్తావా..?
ఆయన గొంతు పెరిగింది…
వంటగదిలో ఉన్న సరోజిని బయటకు వచ్చి…
ఏమైందండీ…? అని అడిగింది కంగారుగా 
నీ కూతురికి పెళ్లి వద్దట… ఉద్యోగం సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటుందట…
ఆద్య తల్లి వైపు చూసి…
అమ్మా… నేను పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు… నా జీవితాన్ని నేను కొంతవరకు సెటిల్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాను…
అదంతా నీకు ఇప్పుడు అర్థం కాదు… అని రామమూర్తి గారు అన్నారు… మా అనుభవం మాకు ఉంది… నువ్వు చెప్పిన ప్రతిదానికీ తల ఊపితే రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు…?
ఆద్య కాసేపు తండ్రిని చూసింది…
తన తండ్రి తన శత్రువు కాదు…
కాకపోతే తన లైఫ్ గురించి ఆయన భయపడుతున్నారు… ఆర్థిక సమస్యలతో అలసిపోయారు… తన కూతురి భవిష్యత్తు గురించి కూడా ఆయనకు టెన్షన్ పడటం సహజం… 
కానీ ఆయన భయానికి పరిష్కారం తన కలలను వదులుకోవడమేనా…?
నాన్నా… నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను… తప్పు చేస్తే అందులోంచి ఎంతో కొంత నేర్చుకుంటాను అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను…  మళ్లీ ప్రయత్నిస్తాను… కానీ ప్రయత్నించే అవకాశం ఇవ్వకుండానే నేను ఓడిపోతానని నిర్ణయించకండి…
ఆ మాటలు విన్న రామమూర్తి గారు కాసేపు మౌనంగా ఉండిపోయారు…
అయితే ఆయన మనసు వెంటనే మారలేదు…
సరే… రేపు సంబంధం వాళ్లు వస్తున్నారు. ముందు వాళ్లతో మాట్లాడనివ్వు… ఆ తర్వాత చూద్దాం… అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆయన… 
ఆద్యకు అది అంగీకారం కాదని తెలుసు.
కానీ కనీసం తన మనసులోని మాటను చెప్పగలిగింది…
కనీసం అది ఆమె చెప్పగలిగింది చిన్న సంతోషం కలిగింది…
………
రాత్రి భోజనం చేసిన తర్వాత ఆద్య తన గదిలోకి వెళ్లింది…
టేబుల్ మీదున్న పుస్తకాన్ని తెరిచింది. కానీ చదవాలనిపించలేదు…
తండ్రి మాటలు బాధించాయి… తన భవిష్యత్తు గురించి ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పోరాటం చేయాల్సి వస్తోందన్న ఆలోచన ఆమెలో బాధను కలిగించింది…
ఆమె ఫోన్ తీసుకుని మేఘనకు మెసేజ్ చేసింది…
నేను నాన్నతో మాట్లాడాను… కానీ ఆయన ఇంకా ఒప్పుకోలేదు… అని… 
మేఘన నుండి వెంటనే సమాధానం వచ్చింది…
పర్వాలేదు ఆద్యా… ఒక్కరోజులో అందరూ మారిపోరు… నువ్వు నీ ప్రయత్నం విడిచిపెట్టకు… అని 
ఆద్య ఫోన్ పక్కన పెట్టింది… 
తర్వాత తన పుస్తకంలో దాచిన కాగితాన్ని బయటకు తీసి… అందులో రాసిన మూడు లైన్స్ మళ్ళీ చదివింది.
నా చదువు పూర్తి చేయాలి…
ఉద్యోగం సంపాదించాలి…
నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకోగలిగే స్థాయికి ఎదగాలి…
ఆమె ఆ కాగితాన్ని మడిచి పుస్తకంలో పెట్టింది…
ఈసారి ఆమె కళ్లలో కన్నీళ్లు లేవు…
మనసులో ఏదో నిశ్చాయించుకుంది…
తన కుటుంబాన్ని ఎదిరించడం తన లక్ష్యం కాదు… తన కుటుంబం తనను అర్థం చేసుకునే వరకు తన ప్రయత్నాన్ని ఆపడం కూడా తనకు ఇష్టం లేదు…
తన బాధ్యతలను విస్మరించకుండా… తన కలలను వదులుకోకుండా ముందుకు వెళ్లే మార్గాన్ని తానే వెతుక్కోవాలి అనుకుంది… 
ఆమె ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను మరోసారి చెక్ చేసింది… 
అప్లికేషన్ చివరి తేదీ దగ్గరపడుతోంది.
ఆమె తన డీటెయిల్స్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేసింది…
ఎంటర్ చేసే టప్పుడు మనసులో ఒకటే అనిపిస్తుంది… 
నా జీవితాన్ని మార్చడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు… కానీ నా నిర్ణయాలకు తగిన బాధ్యత తీసుకునే ధైర్యం మాత్రం నాలో ఉండాలి… అనుకుంది… 
అప్లికేషన్ పూర్తిచేసి సబ్మిట్ బటన్ నొక్కింది.
స్క్రీన్ మీద మెసేజ్ కనిపించింది…
యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిట్టెడ్ సక్సెస్ఫుల్లీ… అని వచ్చింది… 
ఆద్య ముఖంలో చిరునవ్వు… 
అది ఉద్యోగం వచ్చిన ఆనందం కాదు…
తన భవిష్యత్తు కోసం తాను వేసిన మొదటి అడుగు…
కానీ ఆమెకు తెలియని విషయం ఒకటి ఉంది…
మరుసటి రోజు ఇంటికి రాబోతున్న ఆ సంబంధం… ఆమె జీవితంలో ఊహించని సంఘర్షణకు తెరతీయబోతోందని… 
ఆ సంఘర్షణలో ఆద్య తన నిర్ణయాన్ని నిలబెట్టుకోగలదా…?
లేక కుటుంబం కోసం మరోసారి తన కలలను పక్కన పెట్టాల్సి వస్తుందా…?
మళ్ళీ కలుద్దాం ❤️