ప్రేమకు చిరునామా ❤ – 1
ప్రేమకు చిరునామా ❤️
Episode 1 – ఆ మెసేజ్ ఎవరు పంపారు ?
హైదరాబాద్ నగరం… రాత్రి దాదాపు తొమ్మిది గంటలు దాటింది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. చల్లటి గాలి వీస్తూ, అప్పుడప్పుడు మెరుపులు ఆకాశాన్ని వెలిగిస్తున్నాయి… చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతున్నాయి. కాసేపట్లో వర్షం జోరుగా కురిసేలా ఉంది.
ఒక బస్టాండ్ దగ్గర… ఇతర వ్యక్తులు నిలబడి ఉన్నారు… ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ… అతని ఎదురుగా వైషు నిలబడి ఉంది.
వర్షపు చినుకులు ఆమె జుట్టును తడుపుతున్నాయి. ముఖం మీద పడుతున్న ముంగురులను పక్కకు జరుపుకుంటూ అతని వైపు చూస్తోంది. లేత రంగు దుస్తుల్లో, కాటుకతో నిండిన పెద్ద కళ్లతో బంగారు వర్ణం రంగుతో.. ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. కానీ ఆ ఆమె కళ్లలో బాధ ఎక్కువగా ఉంది… ఎన్నో సంవత్సరాలుగా తనలో దాచుకున్న ఎన్నో ప్రశ్నలు ఈరోజు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి…
ఆమె ఎదురుగా ఉన్నది అనిరుధ్.
డార్క్ బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో నిలబడి ఉన్నాడు. ఆరు అడుగుల ఎత్తు, మేలిమి ఛాయా, చక్కగా పెంచుకున్న గడ్డం, గాలికి కొద్దిగా చెదిరిన జుట్టు… ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అతని ముఖంలో ఈరోజు మాత్రం ఆ నవ్వు లేదు. వైషు మాట్లాడే మాటల కోసం ఎదురుచూస్తున్నాడు….
ఎన్నో రోజుల తర్వాత ఈరోజు వాళ్లు మళ్లీ ఎదురుపడ్డారు. ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు కొట్టుకున్న హృదయాలు, ఇప్పుడు ఎదురుగా నిలబడినా మాటల కోసం తడబడుతున్నాయి. ఒకరిని ఒకరు విడిచి ఉండలేని ఆ మనసుల్లో ఇప్పుడు ప్రేమ కంటే బాధ ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నో చెప్పాలనుకున్న మాటలు పెదవుల దగ్గరే ఆగిపోతుంటే, కళ్లలో మాత్రం ప్రేమ, భయం, కోపం, కన్నీళ్లు, తెలియని ప్రశ్నలు… అన్నీ కలగలిసి మనసును అలజడి రేపుతున్నాయి…
“నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు కదా అనిరుధ్… నీ ప్రాణం నేనే అని అన్నావు కదా? మరి నేను కనిపించకుండా పోయిన ఇన్ని రోజులు ఒక్కసారి కూడా నన్ను వెతకాలని అనిపించలేదా? అసలు నేను నీకు గుర్తుకు రాలేదా?” అని అడిగింది
ఆమె గొంతులో కోపం ఉంది. కానీ ఆ కోపం వెనుక ఎన్నో రోజులుగా ఏడ్చి అలసిపోయిన మనసు ఉంది.
అనిరుధ్ ఏదో చెప్పబోయాడు.
“వైషు… నా మాట” ఒకసారి విను…
“వద్దు!” అంటూ అతన్ని మధ్యలోనే ఆపేసింది.
“ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వినలేను. ఐదు సంవత్సరాల క్రితం కూడా నువ్వు ఇలాగే నన్ను నమ్మించడానికి ప్రయత్నించావు. కానీ అప్పుడు నీ మాటలు వినడం వల్ల నా జీవితంలో ఏం జరిగిందో నీకు తెలుసా?”
ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. వాటిని అతనికి కనిపించకుండా తుడుచుకుంటూ మళ్లీ మాట్లాడింది.
“అందుకే నేను వెళ్లిపోయాను..నీ జీవితంలో నుంచి పూర్తిగా వెళ్లిపోయాను.మళ్ళీ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి నీ వైపు చూడాలనుకోలేదు… ఎందుకంటే తిరిగి వస్తే మళ్లీ నీ మీద ప్రేమ పెరుగుతుందని భయపడ్డాను. నిన్ను మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించానో నాకు మాత్రమే తెలుసు… నీకు దూరంగా ఉన్నా ఎన్ని రోజుల్లో ప్రతి రోజు నాతో నేను పోరాడాను.
కానీ నువ్వు…
నువ్వేం చేసావ్…
నువ్వు మాత్రం చాలా సులభంగా నన్ను మర్చిపోయావు”
అనిరుధ్ ఆమె వైపు మౌనంగా చూస్తూనే ఉన్నాడు.
“మన మధ్య ఉన్న బంధానికి అర్థం ఏమిటి అనిరుధ్? ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం మాత్రమేనా?
ఆ మనిషి మనకు దూరమైనప్పుడు మనసు ఎలా ఉంటుందో నీకు తెలియదా?
నీకు నేను దూరంగా వెళ్లిపోయాక కూడా నీ గురించి ఆలోచించినప్పుడల్లా నా ప్రాణం విలవిలలాడేది…
నీ నుండి వచ్చే ఒక్క మెసేజ్ ఒక ఫోన్ కాల్ కోసం నేను ఎంత ఎదురుచూసేదానో….
మరి నీకు?
నేను నీ జీవితంలో లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావు?
అసలు నేను గుర్తున్నానా?”
ఆమె మాటలు ముగిసేసరికి వర్షం ఇంకా జోరుగా కురవడం మొదలైంది.
వైషు తన కన్నీళ్లను తుడుచుకుంటూ.
“ఇంకా మాట్లాడి ప్రయోజనం లేదు అనిరుధ్. మన మధ్య ఉన్నది ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు నువ్వు నీ దారిలో… నేను నా దారిలో.”
అంటూ బాధగా వెనక్కి తిరిగి వెళ్లబోయింది.
అప్పుడే వెనక నుంచి అనిరుధ్ గొంతు వినిపించింది .
“నువ్వు వెళ్లిపోయిన రోజు నేను బాధపడలేదనుకుంటున్నావా, వైషు?”
ఆమె అడుగు ఒక్కసారిగా ఆగింది.
అనిరుధ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మాట్లాడటం కొనసాగించాడు.
బహుశా గుర్తు లేదేమో…
నువ్వు వెళ్లిపోయిన ఆరోజు..
“నువ్వు నాకు పంపిన ఆ చివరి మెసేజ్… ఇప్పటికీ నా ఫోన్‌లో ఉంది…
ప్రతిరోజూ ఒక్కసారైనా దాన్ని చూస్తాను. నువ్వు నన్ను మర్చిపోమన్నావు…
నీ జీవితంలోకి తిరిగి రావద్దన్నావు. …
నిన్ను వెతకడానికి ప్రయత్నించవద్దన్నావు..
నువ్వు చెప్పిన మాటను గౌరవించాలా…
లేక నిన్ను వెతుక్కుంటూ రావాలా అని తెలియక ఐదు సంవత్సరాలు అలాగే ఉండిపోయాను.” అని బాధగా అన్నాడు…
వైషు అతని వైపు ఆశ్చర్యంగా చూసింది.
అనిరుధ్ ఆమె వైపు చూస్తూ అన్నాడు…
“నువ్వు వెళ్లిపోయిన బాధ నాకు లేదనుకుంటున్నావా? నువ్వు కనిపించకపోతే నా ప్రాణం ఎలా విలవిలలాడుతుందో నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోయావని అనుకున్నప్పుడు…
నిన్ను వెతికి మళ్లీ నిన్ను ఇబ్బంది పెట్టే హక్కు నాకు లేదనిపించింది.”
ఆమె అతని వైపు నోట మాట రాక చూస్తూ నిలబడిపోయింది.
అనిరుధ్ ఆమె చేతిని నెమ్మదిగా తడుముతూ ఇలా అన్నాడు …
“కానీ ఒక విషయం మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, వైషు…”
ఆమె తల పైకెత్తి అతని కళ్లలోకి చూస్తుంది.
“నువ్వు నిజంగానే నన్ను వదిలేయాలనుకున్నావా… లేక నన్ను వదిలేయాల్సిన పరిస్థితి నీకు వచ్చిందా?”
వైషు ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది.
ఆమె పెదవులు వణుకుతున్నాయి… కానీ మాట బయటకు రావడం లేదు.
అనిరుధ్ ఫోన్‌లో ఉన్న ఆ చివరి మెసేజ్‌ను ఆమెకి చూపిస్తాడు..
ఆ మెసేజ్ చదివిన ఆమెకి కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది..
“నన్ను మర్చిపో అనిరుధ్. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు .. నీ లైఫ్ నీది నా లైఫ్ నాది .. నాకోసం ఎదురుచూడకు.”అని
వైషు ఆ మెసేజ్ వైపు చూస్తూ ఉండిపోయింది…
“అనిరుధ్… ఆ మెసేజ్… అని తడబడుతూ…
“ఆ మెసేజ్ నేను నీకు పంపలేదు.” అని అంది.
అనిరుధ్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు.
ఆకాశంలో మెరుపు మెరిసింది…
“ఏంటి వైషు ఏమన్నావు నువ్వు”
“అవును ఆ మెసేజ్ నేను పంపలేదు”అని మరోసారి అంది…
అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోలేక ఒకరి మొహాలు ఒకరు చూస్తూ ఉండిపోయారు…
అసలు అనిరుద్ కి అనేసి పంపింది ఎవరు…?
అసలు ఏం జరిగింది..?
ఆ ఐదు సంవత్సరాలుగా వాళ్లిద్దరినీ దూరంగా ఉంచిన నిజం… ఇప్పుడే బయటపడబోతోందా?
ఐదు సంవత్సరాల క్రితం…
“అనిరుధ్… ఇంకా ఎంతసేపు రా? టిఫిన్ చేసి వెళ్లొచ్చు కదా! టైమ్ అయిపోతుంది.”
వంటగదిలో నుంచి రేవతి గొంతు వినిపించింది.
“వస్తున్నానమ్మా… రెండు నిమిషాలు!”
“నీ రెండు నిమిషాలు ఎప్పుడూ పది నిమిషాలే అవుతాయి. త్వరగా రా!”
“అబ్బా అమ్మా… ఉదయాన్నే మొదలుపెట్టావా?”
“నేను మొదలుపెట్టానా? నువ్వు టైమ్‌కి లేవకుండా ఉంటే నేను ఏం చేయాలి? ఈరోజు బైక్ మీద వెళ్లొద్దు. బస్సులో వెళ్లు.”
“మళ్లీ బైక్ ఎందుకు వద్దంటున్నావమ్మా?”
“నిన్న పెట్రోల్ అయిపోయి మధ్యలో ఆగిపోయింది కదా! ఈరోజు కూడా ఏదైనా అయితే?”
“అమ్మా, నిన్న పెట్రోల్ అయిపోయింది. ఈరోజు కొట్టించుకున్నాను.”
“అది నాకు తెలియదు. బస్సులో వెళ్లు.”
“సరే… బస్సులోనే వెళ్తాను. Happyనా?”
“నువ్వు టైమ్‌కి ఆఫీస్‌కి వెళ్తే ఇంకా Happy.”
అనిరుధ్ నవ్వుతూ టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు.
“సరే, ఇప్పుడు టిఫిన్ పెట్టు. లేదంటే బస్సు కూడా మిస్ అవుతుంది, నీ lecture కూడా పూర్తవదు.”
“నువ్వు మాట్లాడకుండా తింటే lecture అవసరమే ఉండదు.”
అంటూ రేవతి ప్లేట్‌లో దోశ పెట్టింది.
అనిరుధ్ నవ్వుతూ తినడం మొదలుపెట్టాడు.
కానీ ఆ రోజు అతను బస్సులో ఎవరిని కలవబోతున్నాడో…
ఆ పరిచయం తన జీవితాన్ని ఐదు సంవత్సరాల తర్వాత కూడా వెంటాడుతుందని…
అతనికి అప్పట్లో తెలియదు.
Swipe left/right or tap the sides to turn pages