New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మానసచోరుడు❤️‍🔥 – 3

మానసచోరుడు❤️‍🔥 – 3

తమిళనాడు…

 

శ్రీరంగంలోని అగ్రహారం…

 

ఆ రంగనాథుని సన్నిధిలోనే కాదు, ఆ పెరుమాళ్ల బుజ్జి కన్నయ్య సన్నిధిలోనూ భక్తులకు కొదవలేదు. అయినా ఆ ఇద్దరూ ఒక్కరే అయినా, ఏ పేరుకు ఉన్న ప్రత్యేకత ఆ పేరుదే!

 

ఆ మాయగోపాలుడి సన్నిధిలో నిత్యం ఆయన సేవలోనే మునిగిపోయే విశ్వనాథ శాస్త్రిగారు, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఆ కన్నయ్య సేవలో నిమగ్నమయ్యారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆ పరమాత్ముడి ఆశీస్సులు అందేలా చేస్తూ, తన నిత్యకైంకర్యాలను కొనసాగిస్తున్నారు.

 

మరోవైపు, వచ్చిన భక్తులకు భక్తిశ్రద్ధలతో ప్రసాదం పంపిణీ చేస్తున్న తన కూతురిని చూసిన విశ్వనాథ శాస్త్రిగారు, ఆమెను పిలుస్తూ…

 

విశ్వనాథ శాస్త్రి: అమ్మా వినమ్రా! అమ్మను మిగిలిన ప్రసాదాల తయారీ పూర్తయిందో లేదో అడిగి రామ్మా!

 

తండ్రి పిలుపు వినగానే, ఆ పదహారణాల భామ తన కోల కళ్లను తిప్పి ఆయన వైపు చూసింది. పెదవులపై చిరునవ్వును అద్దుకుంటూ, అలాగే నాన్నా అన్నట్టుగా తల ఊపి ప్రసాదాలు తయారుచేసే గది వైపు అడుగులు వేసింది.

 

అక్కడికి వెళ్లిన వినమ్ర తన తల్లి కోసం చుట్టూ చూసింది. కానీ ఆవిడ కనిపించకపోవడంతో, అప్పుడే అక్కడికి వచ్చిన తన సహోదరుడు మనోహర శాస్త్రిని చూసింది.

 

అతని దగ్గరకు వెళ్లి, తన కోమలమైన చేతులతో సైగలు చేస్తూ ప్రసాదాల తయారీ పూర్తయిందా అని అడిగింది. అతను ఏదో సమాధానం చెప్పగానే, అక్కడే ఉన్న ప్రసాదాల గిన్నెను తీసుకుంది. మిగిలిన ప్రసాదాలను కూడా తీసుకురమ్మన్నట్టుగా అన్నవైపు చూసి సైగ చేసింది.

 

మనోహర శాస్త్రి సరేనన్నట్టుగా తల ఊపడంతో, వినమ్ర ప్రసాదాల గిన్నెను తీసుకుని తిరిగి భక్తుల దగ్గరకు వచ్చింది.

 

ఆమెకు ఇదంతా అలవాటే!

 

ప్రతిరోజూ ఆ కన్నయ్య సన్నిధికి వచ్చే భక్తులతో మమేకమవడం, తన స్నేహితులతో కబుర్లు చెప్పడం, వాళ్లు అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇవ్వడం… ఇవన్నీ ఆమె దినచర్యలో భాగమే.

 

అయితే ఆమె సమాధానాలు మాత్రం మాటల రూపంలో ఉండవు.

 

ఎవరైనా ఏదైనా అడిగితే, తన కోల కళ్లతోనే వాళ్లను పలకరిస్తుంది. చేతి సైగలతో తనకు తెలిసిన విషయాన్ని తెలియజేస్తుంది. ఒక్కోసారి పెదవులపై చిరునవ్వుతోనే ఎదుటివాళ్ల ప్రశ్నకు సమాధానం ఇచ్చేస్తుంది.

 

ఆమె పలకరింపులో ఏదో తెలియని ఆప్యాయత ఉండటంతో, చాలామంది ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడతారు.

 

అలా ప్రసాదాలు పంచుతున్న వినమ్రను చూస్తూ, అక్కడికి వచ్చిన భక్తుల్లో ఒకరు తన పక్కనే ఉన్నవారితో నెమ్మదిగా అన్నారు.

 

భక్తురాలు: అమ్మో! శాస్త్రిగారి అమ్మాయిని చూస్తుంటే కుందనపు బొమ్మలెక్క ఉంటది. ఎంత చక్కగుందో! కానీ ఆ భగవంతుడు ఈ అమ్మాయికి ఆ లోటు ఎందుకు పెట్టాడో ఏమో పాపం!

 

ఆ మాట వినగానే పక్కనున్న భక్తులు కూడా వినమ్ర వైపు చూశారు.

 

మరో భక్తురాలు: అవునండీ! ఇంత అందమైన పిల్లకు ఆ దేవుడు మాటను మాత్రం ఎందుకు ఇవ్వలేదో!

 

వాళ్ల మాటలు విన్న మరొకరు ఏదో చెప్పబోతుండగా…

 

సరిగ్గా అప్పుడే!

 

అక్కడి వారందరి చెవులను ఓ తీయని స్వరం పలకరించింది.

 

ఆ స్వరం అంత మధురంగా ఉండటంతో, ఒక్క క్షణం పాటు అక్కడున్నవారంతా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు.

 

ఎక్కడి నుంచి వినిపించిందా అన్నట్టుగా, అందరూ ఆ స్వరం వచ్చిన వైపు తలలు తిప్పారు.

 

అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు.

 

ఆశ్చర్యంతో వారి కళ్లింతలయ్యాయి.

 

ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

 

 

 

 

🌿🌷🌿🌿🪷🌿🌿🪷🌿🌿🌷🌿

 

 

 

 

ముంబై…

 

 

పేరుమోసిన పబ్ లోని చీకటి రూములో ఒక వింత నిశ్శబ్దం చోటు చేసుకుంది.

 

కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఏదో పెను తుఫాను దాగి ఉంది.

 

తన బాస్ ఆదేశం మేరకు జియాజ్ దగ్గరకు వెళ్లిన గుణ, వాడికి ప్రాణాల మీద ఆశ వదులుకునేంత భయం చూపించడానికి సిద్ధమయ్యాడు.

 

అప్పుడే…

 

ఇంతసేపు తన కుర్చీలో కూర్చుని పరిస్థితిని గమనిస్తున్న అతని బాస్ నెమ్మదిగా పైకి లేచాడు.

 

అతని అడుగులు జియాజ్ వైపు పడుతున్న కొద్దీ, అక్కడున్నవారి గుండెల్లో తెలియని అలజడి మొదలైంది.

 

అతను జియాజ్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.

 

ఎలాంటి హడావుడి లేదు.

 

కనీసం కోపాన్ని కూడా బయటకు చూపించలేదు.

 

కేవలం జియాజ్ కళ్లలోకి సూటిగా చూశాడు.

 

అంతే!

 

ఇప్పటివరకు తనను తాను గొప్పవాడిగా భావించుకుంటూ, ఎదుటివాళ్లను తన చూపులతోనే భయపెట్టే జియాజ్ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.

 

ఆ డెవిల్ చూపును తట్టుకోలేక వణికిపోయిన జియాజ్, భయంతో తనపై తనకే నియంత్రణ కోల్పోయాడు.

 

ఆ దృశ్యాన్ని చూసిన గుణ పెదవులపై వెటకారపు నవ్వు మెరిసింది.

 

అక్కడ బిజినెస్ డీల్స్ కోసం వచ్చిన వాళ్లు మాత్రం నిశ్చేష్టులయ్యారు.

 

వాళ్ల కళ్ల ముందు ఇప్పటివరకు కనిపించిన జియాజ్ రూపం మెదిలింది.

 

డ్రగ్స్ వ్యాపారంలోనూ, ఆయుధాల అక్రమ లావాదేవీల్లోనూ ఆరితేరిన నలభై ఏళ్ల జియాజ్ అంటేనే చాలామందికి భయం.

 

తనకు ఎదురొచ్చినవాళ్లను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ, తన అడ్డదారికి అడ్డొచ్చినవాళ్లను క్రూరంగా అంతమొందిస్తూ తనకంటూ ఓ భయంకరమైన పేరును సంపాదించుకున్నాడు.

 

అలాంటివాడు ఇప్పుడు తన ముందు నిలబడ్డ ఈ వ్యక్తిని చూసి వణికిపోతున్నాడు!

 

అది కూడా తనకంటే పద్నాలుగేళ్లు చిన్నవాడైన వ్యక్తిని చూసి!

 

అసలు ఈ డెవిల్ ఎవరు ???