వలయం -12
“ఓకే మామయ్య మీరు కంగారు పడొద్దు, తను ఎక్కడికి వెళ్ళదు నేను కాలేజీకి వెళ్లి తన ఫ్రెండ్స్ ని అడిగి కనుక్కుంటాను, కచ్చితంగా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చే ఉంటుంది. కాకపోతే హాస్టల్ లో నేను వెళ్లి ఎంక్వయిరీ చేసిన విషయం తనకు తెలిసే ఉంటుంది మీకు ఫోన్ చేస్తే మీరు తిడతారు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందేమో” అని 10 నిమిషాలు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకొని ఆ తర్వాత ఫోన్ కట్ చేశారు.
ఈ పిచ్చి పిల్ల ఏం చేస్తుందో ఏంటో, మాకు చెప్తే మేము అరుస్తాము అనే కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తుంది, ఇలా చేస్తే మేము భయపడతాము అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతుందా అని కూతురు గురించి టెన్షన్ పడుతున్నారు సుబ్బారావు..
అలా ఉదయ్ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగాడు లేదో అతని ఎదురుగా చేతులు కట్టుకొని కనిపించింది కల్పన.
సడన్గా అక్కడ కల్పన ని చూడటంతో ఉదయ్ ఉలిక్కిపడి “నువ్వేంటి ఇక్కడ” అని ఆశ్చర్యంగా అడిగాడు..
“నేను ఇక్కడ నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని వచ్చాను, ఇప్పటివరకు నీ గురించి నేను ఏమో అనుకున్నాను కానీ రెండు రోజులు క్రితమే నాకు అసలు విషయం తెలిసింది” అని అన్నది కల్పన.