వలయం -16
“ఓకే అండి తన గురించి మాకు కూడా ఏమీ తెలియదు, తను మాకు ఏ విషయం అయితే చెప్పిందో అదే మీకు చెప్పాను. తను ఏమైందో ఎక్కడికి వెళ్లిందో మీరే తెలుసుకోండి” అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఉదయ్ రమ్య ఎక్కడికి వెళ్లిపోయిందో అసలు ఏం చేస్తుందో ఏమీ అర్థం కాక అయోమయంగా తన బైక్ దగ్గరకి వచ్చాడు.
తన మామయ్య తనకి ఫోన్ చేసి రమ్య గురించి కనుక్కోమన్నాడు. అప్పటికే రమ్య కనిపించకుండా పోయింది ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్తున్నాను అని అందరికీ చెప్పింది. కానీ ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్ళలేదు. అంటే మామయ్య అనుకున్నట్టు రమ్యకు ఏదైనా అయ్యిందా అనే కంగారు భయం ఉదయ్ లో మొదలైంది..
అంటే ఇప్పటికే రమ్య కనిపించకుండా దాదాపు మూడు వారాలు అవుతుంది నేను నిధి చనిపోయిన బాధలో ఉండటంతో తన గురించి పెద్దగా పట్టించుకోలేదు తెలుసుకోలేదు. ఎంత పొరపాటు జరిగిపోయింది అసలు ఈ రమ్య ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది అని రమ్య ఫోన్ కి ట్రై చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది..
అసలు ఈ రమ్య ఏం చేస్తుంది అని అనుకుంటూ రెండు రోజులు రమ్య కోసం వెతికాడు. కానీ ఎక్కడ తెలియలేదు తనకి బంధువులకి ఫ్రెండ్స్ కి అందరికీ ఫోన్ చేసి కనుక్కున్నాడు. కానీ ఎవ్వరి దగ్గర కూడా రమ్య లేదు అనే మాట మాత్రమే వినిపించింది.