New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వాలం – 1
వాలం 5 min read

వాలం – 1

   పడమట సూర్యుడు అస్తమించి అరగంట కావస్తుంది. చీకటి జడలు విప్పి దిక్కుల్లో పరచుకుంటుంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన అటవీ ప్రాంతం. ఎత్తయిన, దట్టమైన చెట్లతో ఆకాశాన్ని మూసేస్తుంది.  అన్నిరకాల జంతువులకి నివాసం.. ఆ అడవి. కీచురాళ్ల రొద అప్పుడప్పుడు తీతువు పిట్ట కూతలు.. ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో వినిపిస్తున్న నక్క ఊళలు.. భయానక వాతావరణాన్ని తలపిస్తున్నాయి. 

అడవి కి కిలోమీటర్ దూరంగా విశాల మైన పచ్చిక బయలు లో ఉన్న టెంట్ హౌస్ ముందు నెగడు వెలుగుతూ ఉంది. టెంట్ హౌస్ లో లాంతరు వెలుతురు పలచగా పరుచుకుని ఉంది.
లోపల మూలగా ఉన్న ఫోల్డింగ్ టేబుల్ మీద.. ఉంది ఆ లాంతరు. 
ఆ టేబుల్ ముందు వేసున్న కుర్చీ లో కూర్చుని డైరీ రాసుకుంటున్నాడు 52 ఏళ్ళ మహాదేవ్. 
” ఇక్కడి కొచ్చినప్పటి నుండి రోజుకో వింత అనుభవం.. హంపి అందాలు, శిల్ప కళా వైభవం.. చారిత్రక విశేషాలు ఒకటైతే.. ఈ అడవి మరోవైపు నాలో జిజ్ఞాస ని పెంచుతోంది. 
“అనేగుంది “విలేజ్ ప్రజలు చాలా మంచి వాళ్ళు.. ఇక్కడికి వచ్చే టూరిస్టులకి అన్ని విధాల సహాయం చేస్తారు.. ఎవరు ఎటువంటి ఇబ్బందిని కూడా కలిగించరు.. కానీ వీళ్ళందరూ ఒక రహస్యాన్ని మాత్రం మనసులో దాచుకున్నట్టు అనిపిస్తుంది.. ఆ రహస్యం ఏమిటి అని ఆలోచిస్తుంటే.. నా మనసు ఒక రహస్యాన్ని నువ్వే బయట ప్రపంచానికి తెలియజేయొచ్చు కదా అని అడిగినట్టు అనిపించింది.. అందుకే ఈ రాత్రి ఇక్కడ. 
రాత్రి పూట ఈ అరణ్యం వైపు వెళ్లోద్దని ప్రజలు అంటున్నారు.. పోలీసులు చెబుతున్నారు.. ఈ అరణ్యంలో జీవిస్తున్న క్రూర జంతువుల వల్ల భయం వల్ల అంటున్నారేమో అని అనుకున్నాను.. కానీ కారణం మరేదో ఉందని తర్వాత తెలిసింది .
ఈ అరణ్యం లో ప్రపంచాన్ని చూడటానికి ఇష్టపడని ఒక అడవి జాతి తెగ జీవిస్తున్నారు అని.. వాళ్ళు అడవి నుండి బయటికి రారు..అడవిలోకి వెళ్లిన వాళ్ళని అడవి లోంచి బయటికి పంపించరుట.. ఇంతవరకు ఆ జాతి వారిని ఎవరు చూసి ఎరుగరట.. మరి ఈ విషయం ఎలా ప్రచారంలోకి వచ్చింది… వాళ్లను ఎవ్వరూ చూడకపోతే అడవి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ బయటకి రాకపోతే ఈ విషయం బయటకు ఎలా వస్తుంది.. ఇది అడవి లోపలికి వెళ్లకుండా చేయటానికి సృష్టించిన ఒక పుకారా.. అసలు ఈ అడవి లోకి వెళ్తే ఏం జరుగుతుంది.. లోపలికి వెళ్లిన వాళ్ళు ఎవరైనా ఉండుంటారా..?? ఉన్నా వాళ్ళు బయట పడటం లేదా..??
ఈ ప్రాంతం యొక్క చారిత్రక వివరాలు కనుక్కుంటే..ఎప్పుడో త్రేతా యుగం లో గోకుర జాతి ప్రజలు.. ఈ అడవుల్లో జీవించేవారంట. 
తరువాత ద్వాపరం.. ఇప్పుడు కలియుగం.. ఇంకా వాళ్ళు ఇక్కడే ఉంటారా..?? ఈపాటికి వాళ్లు నశించిపోయి ఉంటారు.. అయినా ఈ కలియుగంలో కూడా ప్రపంచం చూడకుండా బ్రతకాలని ఎవ్వరు అనుకుంటారు..??
ఖచ్చితంగా ఇదంతా.. ఒక పుకారు కావొచ్చు.. లోపల ఉన్న విలువైన వృక్ష సంపద ని రక్షించుకోడానికి లేక భక్షించడానికో ఇలాంటి ఒక పుకారుని సృష్టించి ఉండొచ్చు…
ఇంతలో ఏదో టెంట్ బయట పడ్డ శబ్దం. 
అతడి పెన్ అక్కడితో ఆగిపోయింది. అతడు నొసలు చిట్లించి టెంట్ బయటి వైపు చూసాడు.
ఏమి కనపడలేదు. టేబుల్ మీద టార్చ్ తీసుకుని.. డైరీ ని మూసేసి.. టెంట్ హౌస్ డోర్ జిప్ కాస్త తీసి బయటికి చూసాడు. 
బయట వీస్తున్న గాలికి బయట మంట నాట్యం చేస్తున్నట్టు ఉంది. ఆ నెగడు కి అటు ఇటు రెండు పొడుగాటి కట్టెలు నిలువుగా సమాంతరంగా పాతి.. వాటి పైకొనలను కలుపుతూ అడ్డంగా ఇంకో కట్టెని ఏర్పాటు చేసి ఆ కట్టె మధ్యలో ఏర్పాటు చేసిన కొక్కేనికి.. వేలాడదీసిన టీ కెటిల్ గాలికి ఎగిరి పడ్డట్టు ఉంది.
ఓహో.. ఇదా శబ్దం.. అనుకుంటూ.. వెళ్లి కాస్త దూరంలో పడిన టీ కెటిల్ ని తీసి.. ముందుకి నడుస్తున్న మహాదేవ్ కి టెంట్ లో ఎవరో ఉన్నట్టు అనిపించారు. 
లోపల లాంతరు కాంతికి టెంట్ వాల్ పై అర్థం కాని ప్రతిబింబం. 
ఏమిటది.. అనుకుంటూ లోపలికి తొంగి చూసాడు అతడు. 
టెంట్ కి వెనుక వైపు గా టెంట్ మీద ఏదో కూర్చున్నట్టు ఉంది. 
ఆ చీకటి, ఆ ఒంటరి తనం, జివ్వున వీస్తున్న గాలికి.. అతడి వొళ్ళు సన్నగా కంపించింది. 
మెల్లిగా టెంట్ లోపలికి వెళ్లి జిప్ వేసేశాడు. 
ఏదైనా జంతువా.. అనుకుంటూ ఆ టెంట్ చివరి వైపు వెళ్ళాడు. 
ఆ ఆకారం కూర్చున్న చోట టెంట్ పైభాగం కొంచెం లోపలికి కృoగింది. 
సన్నని కాళ్ళు గల ఆకారం లా లీలగా కనబడుతుంది. 
కాని ఏమిటో అర్థం కావడం లేదు. టెంట్ కనుక చిల్లి పడితే సేఫ్టీ ఉండదు. కొండ దోమల కాటు చాలా ప్రమాదకరం. 
అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. 
ఇప్పుడు ఏం చేయాలి.. అనుకుంటూ, నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుని టెంట్ లో ఏదైనా కర్ర లాంటి వస్తువు ఉందేమో అని చూసాడు. 
ఈలోపు ఆ ఆకారం కాస్త కదిలింది. అది కదలగానే టెంట్ గోడలపై నీడలా పడిన ఆకారం చూసి.. కళ్ళు చిట్లించి చూసాడు మహాదేవ్. 
పాములా అటుఇటు కదులుతుంది.. అంటే అదొక తోక.. ఏదో జంతు “వాలం”.
అప్పుడు అంచనా వేసాడు అతడు. ఆ తోక ని బట్టి. 
హమ్మయ్య కోతిలా ఉంది.. వెళ్ళిపోతుంది.. నేను రాసుకుంటే సరి.. అని టేబుల్ వైపు కదిలాడు మహాదేవ్. 
వెళ్ళికూర్చుని తన డైరీ కోసం చూసిన అతడు కళ్ళు మరింత విచ్చుకున్నాయి. అక్కడ అతడి డైరీ లేదు. 
అరె.. ఈ డైరీ ఇక్కడే పెట్టాను కదా.. ఏమైంది..?? అంటూ కింద మీద వెతికేసాడు మహాదేవ్. 
ఎక్కడా కనబడలేదు. ఏమైంది.. డైరీ రాస్తూ ఇక్కడే వదిలి వెళ్ళాను కదా బయటికి.. కొంపదీసి ఆ కోతి గానీ లోపలికి వచ్చిందా.. అనుకుంటూ.. చుట్టూ చూసి.. ఒక మూలగా పెట్టున్న గొడుగు ని చూసి.. దాన్ని చేతిలోకి తీసుకుని.. ఆ కోతి కూర్చున్న చోటు కిందకి వెళ్లి గొడుగుతో పైకి పొడిచాడు మహాదేవ్. 
ఆ కోతి కంగారు పడి.. అక్కడి నుండి కిందకి దూకింది. 
దాని చేతిలో ఏమి ఉన్నట్టు అనిపించలేదు. 
టెంట్ విండో జిప్ తీసి బయటికి చూసాడు అతడు.
టెంట్ వెనుక వైపు పడి కనపడింది.. ఆ డైరీ. అతడు టార్చ్ ఫోకస్ చేయగానే..
అయితే కోతి పనే.. అనుకుని విండో జిప్ వేసేసి.. టెంట్ ముందుభాగం వైపు వచ్చి.. డోర్ జిప్ తెరచి టార్చ్ తో బయటికి వచ్చాడు అతడు. 
టెంట్ వెనుక భాగం వైపు నడచి కింద పడి ఉన్న డైరీ తీసుకుని.. దానికంటిన మట్టి ని తుడిచి.. కోతి కోసం చుట్టూ టార్చ్ వేసి చూసాడు. 
ఏమి కనబడక పోయేసరికి.. అడవిలోకి వెళ్ళిపోయిందేమో.. అనుకుని.. ముందుభాగం వైపు వచ్చి నెగడు ని సరిచేసి.. మళ్ళీ టెంట్ లోపలికి వచ్చేసాడు మహాదేవ్. 
చేతికి ఉన్న వాచ్ వైపు చూసాడు. టైం రాత్రి 12 చూపిస్తుంది. 
త్వరగా రాయడం ముగించి పడుకోవాలి.. అనుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్లి డైరీ తెరిచాడు మహాదేవ్. 
తను రాసిన చివరి పేజీ దగ్గరికి వెళ్లి.. రాయబోయిన అతడి చేయి ఆగిపోయింది. అక్కడున్న అక్షరాలని చూసి అతడి కళ్ళు పెద్దవయ్యాయి. 
“ఈ అడవి జోలికి వస్తే ప్రాణాలతో తిరిగివెళ్లవు.. వెంటనే వెళ్ళిపో.. లేదంటే నీ చివరిరోజు ఇక్కడే అవుతుంది” అన్న అక్షరాలు చూసి.. భయం తో అతడి గొంతు తడారిపోయింది.
– వాలం కొనసాగుతుంది