వాలం – 2
“ఈ అడవి జోలికి వస్తే ప్రాణాలతో తిరిగివెళ్లవు.. వెంటనే వెళ్ళిపో.. లేదంటే నీ చివరిరోజు ఇక్కడే అవుతుంది” అన్న అక్షరాలు చూసి.. భయం తో అతడి గొంతు తడారిపోయింది.
ఏంటిది ఎవరు రాసారు ఇది..?? అనుకుంటూనే అక్షరాలని బాగా గమనించాడు మహదేవ్.
గుండ్రంగా ముత్యాలు పేర్చినట్టుగా ఉన్నాయి.. అక్షరాలు వెనుక పసుపు రాసినట్టు ఉంది.. పసుపు రాసి దాని మీద అక్షరాలు రాస్తే ఎలా ఉంటుందో అలా ఆ అక్షరాలు హైలెట్ చేయబడి ఉన్నాయి.
ఇంత తక్కువ సమయంలో ఈ టెంట్ లోకి వచ్చి రాసి మాయమైపోయే ఛాన్స్ ఎక్కడుంది.. నేను ఒక కోతిని మాత్రమే గమనించాను.. అంటే ఎవరైనా మనుషులు కూడా వచ్చారా..?? వస్తే వాళ్ళు నన్ను ఎందుకు బెదిరిస్తున్నట్టు..? అసలు ఏముంది ఈ అడవిలో..?
అని ఆలోచిస్తూ అలవోకగా పుస్తకం వైపు చూసిన మహదేవ్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు.
ఈ అడవిలో ఏముంది?? అనే నీ ప్రశ్న.. ఆలోచన.. నీ మరణానికి హేతువు కాగలవు.. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో.. అన్న అక్షరాలు వాటి అంతట అవే డైరీలో ప్రత్యక్ష మవసాగాయి.
అతడి ఒళ్లంతా చెమటలతో తడిసిపోయింది. ఏదో తెలియని భయం మనసుని ఆవరించింది. అతని చెయ్యి తన ఫోన్ మీదకి వెళ్ళింది.
పోలీస్ స్టేషన్ కి డయల్ చేశాడు. సిగ్నల్ లేకపోవడం వల్ల కనెక్ట్ అవ్వలేదు.
మళ్ళీ డైరీ వైపు చూసి.. టెంట్ లో నలువైపులా భయం గా గమనించాడు.. టెంట్ లో అతడు తప్ప వేరెవరు లేరు.
అతడి మనసుకి వెంటనే ఏదో స్ఫురించింది. వెంటనే బ్యాగ్ లో అన్ని సర్దుకుని..టార్చ్ లైట్ తీసుకుని బయటికి వచ్చి.. అడవి వైపు భయం గా చూసాడు మహాదేవ్.
చిక్కటి చీకటిలో.. గాలికి ఊగిపోతున్న చెట్లు కురులు వదిలేసిన దెయ్యాల్లా ఉన్నాయి.
ఎవరు.. నన్ను భయపెట్టాలి అనుకున్నది ఎవరు..?? నన్ను భయపెడితే నేను పారిపోతానా.. వెనుక ముందు ఎవరూ లేనివాడిని.. ముందుకే వెళ్తా.. అంటూ అడవిలోకి అడుగులు వేసాడు అతడు.
అతడు అడవిలోకి వెళ్లి కనుమరుగు కాగానే టెంట్ ముందు మండుతున్న నెగడు ఒక్కసారిగా ఆగిపోయింది.
అడవిలోంచి ఒక ఆర్తనాదం భయంకరo గా వినపడింది.
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
పూరీ.. దేశం లోనే గొప్పదైన పుణ్యక్షేత్రం. భక్తజనులతో సందడిగా ఉంది. కాని అoదరి ముఖాలలో ఏదో తెలియని బాధ..అది అధిక ఆషాడ మాసం కావడం తో నవ కళేబర ఉత్సవం ఆరోజు జరగనుంది.
పాత చెక్క విగ్రహాల స్థానం లో కొత్త విగ్రహాలను పెట్టె ప్రక్రియ. ఆ కొత్త విగ్రహాలకోసం కావాల్సిన వేపచేట్టుని దైవజ్నులు గుర్తిస్తారు. కొత్త విగ్రహాలు తయారయ్యాక పాత విగ్రహాలలోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల లోనికి అర్థరాత్రి కటిక చీకటిలో మార్చి పాత విగ్రహాలకి అంత్యక్రియలు చేస్తారు.
ఇది పూరీ లో అధిక ఆషాడం వచ్చిన ప్రతిసారి జరిగే ప్రక్రియ. పాత విగ్రహాలను కోయిల్ బైకుంఠ అనే స్థలం లో భూస్థాపితo చేస్తారు. ఇది చాలా బాధాకరం గా ఉంటుంది. భగవంతునికి జరిగింది అంత్య క్రియ గానే భావిస్తారు అక్కడివారు.
మళ్ళీ విగ్రహాలు ఖననం చేసేటప్పుడు పాత విగ్రహాలు అక్కడ మాయమైపోయి ఆనవాలు కూడా కనిపించకుండా పోవడమే విశేషం.
ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ఎంతోమంది భక్తులు పూరీ విచ్చేస్తారు.
ఆలా భక్తులు వసతి ఉండే ఒక లాడ్జి.. లో.. ఒక గది ముందు నిలబడి ఒక అబ్బాయి తలుపు కొడుతున్నాడు.
కాసేపటికి ఒక 48ఏళ్ళ స్త్రీ మూర్తి తలుపు తీసింది.
మా.. ఘర ఝాడు కరిబారు అచ్చి.. సోయికి ఉఠిలణి కి?” అన్నాడు ఆ 15 ఏళ్ళ కుర్రాడు.
ఈ ఒరియా అర్థం అయి చావదు.. అనుకుంటూనే.. ఆ పిల్లోడి చేతిలో చీపురు, చాట చూసి.. హా..అని అడ్డు తప్పుకుని.. అయినా వీడింకా నిద్రపోతున్నాడు గా.. వీడు చీపురు పట్టుకెళ్తే అరుస్తాడు.. నిద్రలేపితే సరి.. పుణ్యక్షేత్రానికి వచ్చిన త్వరగా లేవక పోతే ఎలా.. అనుకుంటూ..
ఉండవయ్య.. మా అబ్బాయి ఇంకా లేవలేదు.. లేపుతాను.. అంది.
ఆ పిల్లోడు అర్థమయినట్టే తలూపాడు.
ఆమె లోపలికి వెళ్లి మంచం మీద దుప్పటి లో దూరిపోయి పడుకున్న కొడుకుని చూసి.. రేయ్.. లేవరా.. ఏమిటా మొద్దు నిద్ర.. అని దుప్పటి లాగేసి.. అక్కడ దృశ్యం చూసి అవాక్కయి అలానే ఉండిపోయింది.
గుమ్మం దగ్గర కుర్రాడు పడిపడి నవ్వసాగాడు.
వాడు నవ్వుతుంటే చిరాకొచ్చి మంచం పైన మనిషి ఆకారంలో పెట్టిన తలగడలని.. పక్కనే ఉన్న మంచం మీదకి విసిరి కొట్టి విసుగ్గా కూర్చుండిపోయింది ఆమె.
“ము భితరకు ఆసిపారిబి కి?” అన్నాడు ఆ కుర్రాడు నవ్వు ఆపుకుంటూ.
రారా నాయనా.. వచ్చి.. తుడువు.. నా పుత్ర రత్నం ఏ రాత్రో బయటికి పోయినట్టు ఉన్నాడు.. రానీ చెప్తా వాడి పని.. అనుకుని గొనుక్కుంది ఆమె.
”మా.. ఆపణంక నామ క’ణ?” అన్నాడు ఆ కుర్రాడు గది ఊడుస్తూనే.
వాడి ప్రశ్న సరిగా అర్థం కాక అయోమయం గా చూసింది ఆమె.
నేమ్.. నేమ్… అన్నాడు వాడు.
వీడికి నా పేరు ఎందుకు.. అని లోపల తిట్టుకున్న కౌసల్య అని చెప్పింది ఆమె.
కౌసల్య మా..”భాయి రాతిరు బాహారకు చాలిగలేణి.”..అన్నాడు వాడు.
భాయి.. అన్న.., రాతిరు అంటే రాత్రి.. బహారకు.. బయటికి.. ఆ చివర ముక్క ఏమన్నాడో గానీ.. వీడు నా కొడుకు గురించి చెప్తున్నాడు.. అరవింద్ రాత్రి బయటకు వెళ్ళిపోయాడు అన్నమాట.. అనుకుని ఆ కుర్రాడి వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది కౌసల్య.
ఆ కుర్రాడు గది ఊడ్చి, బాత్ రూమ్ క్లీన్ చేసి.. వెళ్లిపోతున్నప్పుడు కూడా కౌసల్య వైపు చూసి.. నవ్వాపుకోలేక నవ్వుతూ వెళ్ళిపోయాడు.
గది తలుపు వేసుకుంటూ..రానీ అరవింద్ ని.. అస్సలు బుద్ధిలేదు… వాడున్నాడని నేను అనుకోవాలని ఇలా దిండ్లు పెట్టి వెళ్తాడా.. చెప్తాను వాడి పని.. అనుకుంటుండగానే.. తలుపు కొట్టిన సవ్వడి..
మళ్లీ ఈ పిల్లాడు ఎందుకొచ్చినట్టు ఇప్పుడే గది ఊడ్చాడు కదా.. నన్ను చూసి వెటకారంగా నవ్వుతున్నాడు.. అస్సలు క్షమించకూడదు వీణ్ణి.. అనుకుంటూ తలుపు తీసింది కౌసల్య.
ఎదురుగా ఆరడుగుల ఆజానుబాహుడు.. దోర మీసాల చందురుడు.. రింగులు తిరిగిన జుట్టు..కండలు తిరిగే దేహం, ఎదుటి వాడి కళ్ళభాష చదవ గలిగే కళ్ళు.. మీసాల చాటున దాగిన చిరునవ్వు తో నిలబడి ఉన్నాడు అరవింద్.
నైట్ ప్యాంటు, టీ షర్ట్ లో ఉండి.. నవ్వాపుకోడానికి ట్రై చేస్తూ.. గుడ్ మార్నింగ్ అమ్మ.. అన్నాడు 25 ఏళ్ళ అరవింద్.
ఓహో.. ఆ కుర్రాడు చెప్పాడా.. నేనెలా ఫూల్ అయ్యానో.. అందుకేనారా సిగ్గు లేకుండా నవ్వుతున్నావు.. అమ్మని మోసం చేయడానికి మనసెలా వస్తుంది రా నీకు..అని చిన్నబోయిన ముఖం పెట్టింది కౌసల్య.
కౌసల్య భుజాల చుట్టూ చేతులు వేసి.. అమ్మ.. జస్ట్ ఫన్.. సరదాగా.. ఈరోజు నవ కలేబర ఉత్సవం కదా .. ఈ ఉత్సవం చూడాలని నువ్వు ఎప్పటి నుండి అడుగుతున్నావ్.. రాత్రి అనుకున్నాం కదా ఉదయాన్నే లేవాలి అని . అందుకే లేచి నేను వాకింగ్ కి కూడా వెళ్లి వచ్చేసాను.. నువ్వు రెడీ అయిపోయావు గా.. నేను పది నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయిపోతాను.. వెంటనే ఆలయానికి బయలుదేరుదాం ఓకేనా.. అన్నాడు అరవింద్ ప్రేమగా.
ఏదోలా మాయ చేసేస్తావ్ లే.. త్వరగా రా నాకు కొంచెం ఆకలిగా కూడా ఉంది.. షుగర్ కదా ఎక్కువసేపు ఆకలితో ఉండలేను .. అంది కౌసల్య.
టూ మినిట్స్.. అంటూ టవల్ తీసుకుని.. లోపలికి వెళ్ళాడు అరవింద్.
కిటికీ లోంచి కాస్త దూరంగా కనిపిస్తున్న ఆలయం వైపు చూస్తూ.. జగన్నాధ.. మావారు పోయి అప్పుడే సంవత్సరం దాటిపోయింది కూడా.. అరవింద్ పెళ్లి చూసే అదృష్టం ఆయనకి లేకుండా పోయింది.. వీడికి ఒక మంచి అమ్మాయి భార్యగా వస్తే నా బాధ్యత తీరిపోతుంది.. త్వరలోనే అది జరిగేలా అనుగ్రహించు స్వామి.. అని మనసులోనే కోరుకుంది కౌసల్య.
వాలం కొనసాగుతుంది
Swipe left/right or tap the sides to turn pages