New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వైదేహి – 3
వైదేహి 6 min read

వైదేహి – 3

“ఆ, నేను ఇంకా మీతో అదే విషయం చెబుదాం అనుకున్నానండి. ఇంతలో మీరు అదే విషయం చెప్పారు” అన్నారు సుజాత గారు.

“అమ్మాయికి ముందు రోజే చెప్తాము. ఎప్పటి నుంచి చెప్తే మనసు పాడు చేసుకుంటుంది” అన్నారు సుజాత గారు.
“అలాగే సుజాత, ఇక నేను ఆఫీస్‌కి వెళ్తాను” అని ఆయన ఆఫీస్‌కి వెళ్లిపోతే, పెళ్లిచూపులు రెండు రోజుల్లోనే ఉండటంతో కూతురికి చీర, అలాగే ఆరోజు పెట్టుకోవడానికి కొన్ని నగలు అన్నీ తీసి రెడీ చేసి పెట్టే పనిలో పడ్డారు సుజాత గారు.
ఇక సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చారు వైదేహి, గగన, ఇంకా దేవా ముగ్గురు.
“అమ్మా, రేపు సెలవు” అంటూ ఎగురుకుంటూ వచ్చారు ముగ్గురు.
“అదేంటి? రేపు శనివారం కాదు కదా, మరి ఎందుకు సెలవు?” అని అడిగారు సుజాత గారు పిల్లల వైపు చూస్తూ.
“తెలుసా అమ్మా, వరుసగా మూడు రోజులు సెలవులు” అంటూ ఆనందంగా చెప్పింది గగన.
“ఇది సరే, ఇంతకీ రేపు సెలవు ఎందుకో చెప్పలేదు” అంటూ సుజాత గారు అడగడంతో…
“రేపు ఏదో బంద్ ఉందంటమ్మా. మొత్తం స్టేట్‌లో ఏ స్కూల్ కూడా రేపు ఓపెన్‌లో లేదు. ఇంకా ఎల్లుండి సెకండ్ సాటర్డే, ఆ తర్వాత సండే. అందుకే మూడు రోజులు సెలవు వచ్చింది” అంది వైదేహి.
“అవునా? సరే, సరే. అయితే నువ్వు, అక్క ఇద్దరూ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తారా?” అని అడిగారు సుజాత గారు దేవా వైపు చూస్తూ.
“అమ్మా, తమ్ముడు, చెల్లి వెళ్తే వెళ్లి, నేను మాత్రం వెళ్లను. నాకు చాలా సిలబస్ ఉంది. ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మళ్లీ అస్సలు టైమ్ దొరకదు” అంది వైదేహి.
“నేను కూడా నీ గురించి ఏం చెప్పట్లేదు లేవే. నువ్వు వెళ్తాను అన్నా నేను నిన్ను పంపించను. చెల్లి, తమ్ముడి కోసం మాత్రమే అడుగుతున్నాను” అన్నారు సుజాత గారు.
“అలా అయితే వాళ్లని పంపించేసేయ్” అంది వైదేహి.
వాళ్లు కూడా వెళ్తాము అని సంబరంగా చెప్పడంతో సుజాత గారు తన అన్నయ్యకి ఫోన్ చేస్తే, ఆయన మరుసటి రోజు ఉదయం వస్తాను అని చెప్పడంతో సుజాత గారు ఇద్దరు పిల్లలకి రెండేసి జతల బట్టలు ప్యాక్ చేసి పెట్టారు.
ఆరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన కోటేశ్వరరావు గారికి కూడా వీళ్లు విషయం చెప్పడంతో, ఆయన కూడా చిన్న కూతురు, కొడుకు ఇంట్లో లేకుండా ఉండడం మంచిదే అనుకుని వాళ్లు వెళ్లడానికి ఒప్పుకున్నారు.
ఆరోజు కూడా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం వాళ్ల మేనమామ రావడంతో సుజాత గారు ఆయనకి కూడా విషయం చెప్పారు.
“ఆహా, మంచిదే సుజాత. మంచి మాట చెప్పావు. ఇక మన వైదేహికి మంచి రోజులు వచ్చినట్టే” అన్నారు ఆయన.
“ఏమో అన్నయ్యా, ఒకవైపు అది గొప్ప ఇంటికి కోడలు అవుతుంది అని సంతోషపడుతున్నా, ఇప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది అని బాధగా కూడా ఉంది” అన్నారు సుజాత గారు.
“తప్పదు కదా సుజాత! మరి మీ పెళ్లి టైమ్ అప్పుడు మేము కూడా ఇలాగే బాధపడ్డాం. కానీ నిన్ను పంపించక తప్పలేదు కదా! అయినా ఎప్పటికైనా తను వేరే ఇంటికి వెళ్లాల్సిన అమ్మాయి కదా! కాకపోతే ముందు వెనుక అంతే. అయినా మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని కాలదన్నుకుని తర్వాత బాధపడటం ఎందుకు?” అంటూ సుజాత గారి అన్నయ్య గారు చెప్పడంతో…
“అందుకే నేను కూడా ఒప్పుకున్నాను అన్నయ్యా” అన్నారు సుజాత గారు.
“సరే, అయితే ఇక నేను పిల్లల్ని తీసుకుని బయలుదేరుతాను” అని బయట ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆయన.
చెల్లి, తమ్ముడు వెళ్లిపోయాక అప్పుడు లోపలికి వచ్చి పుస్తకాలు పట్టుకుంటున్న కూతుర్ని పిలిచారు సుజాత గారు.
సుజాత గారు పిలవడంతో పుస్తకం పట్టుకుని తల్లి దగ్గరికి వెళ్లింది వైదేహి.
“చిట్టితల్లి, ఇలా కూర్చో” అంటూ కూతుర్ని తన పక్కన కూర్చోబెట్టుకుని, “అది చెప్పాను కదా, పెళ్లిచూపుల కోసం వాళ్లు ఆదివారం వస్తున్నారు అమ్మా” అన్నారు సుజాత గారు.
ఆ విషయం విన్న వైదేహికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది.
“అది…” అంటూ మాట్లాడబోతున్న వైదేహి వైపు చూస్తూ, “ఇదిగో, నేను నీకు ఆల్రెడీ చెప్పేశాను. మళ్లీ మళ్లీ చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు తల్లి. ప్లీజ్ అమ్మా” అంటూ వేడుకుంటూ ఉన్నారు సుజాత గారు.
తల్లి అంతలా బతిమాలడం ఇష్టం లేక, తనకి నచ్చకపోయినా పెళ్లిచూపులకి ఓకే చెప్పి, పెళ్లికి మాత్రం ఏదో ఒకటి అడ్డువేసి ఆపేయాలి అనుకుని అప్పటికి ఒప్పుకుంది వైదేహి.
ఇక సాయంత్రానికి కోటేశ్వరరావు గారికి విషయం చెప్పడంతో ఆయన కూడా ధైర్యంగా, సంతోషంగా ఉండిపోయారు. ఆయన కూతుర్ని దగ్గరికి తీసుకుని, “అమ్మా, నాన్నని తప్పు పట్టకురా. మాకు కూడా నిన్ను వదిలి దూరంగా వెళ్లడం అయితే అస్సలు ఇష్టం లేదు. కానీ మీ జీవితం బాగుంటుంది. మీ జీవితం బాగుంటేనే కదా, రేపు నాకు, మీ అమ్మకి ఏమైనా అయితే తమ్ముడిని, చెల్లిని చూసుకోవడానికి నువ్వు ఉంటావు” అన్నారు కోటేశ్వరరావు గారు.
“ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నారు?” అంటూ కన్నీళ్లతో తండ్రిని అడిగింది వైదేహి.
“మేమున్నప్పుడే ఏ అచ్చట ముచ్చటైనా మేము తీర్చగలము. మేము వెళ్లిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? అందుకే ముందుగా ఇవన్నీ చేయడం. అబ్బాయి చాలా మంచివాడు. నేను బయట కూడా కనుక్కున్నాను. మేలిమి బంగారం అని చెప్తున్నారు” అన్నారు కోటేశ్వరరావు గారు.
“సరే నాన్న, నీ ఇష్టం” అంది వైదేహి.
అలా రెండు రోజులు పూర్తిగా గడిచిపోయాయి. ఆదివారం రానే వచ్చింది. ఉదయం పది గంటలకి అబ్బాయి వాళ్లు వస్తున్నారు అని ముందుగా కబురు తెలియడంతో, ఉదయాన్నే కూతుర్ని లేపి తనకి తలంటు స్నానం పోసి, సాంబ్రాణి పొగ జుట్టుకి వేసి, ఆ తర్వాత నీట్‌గా జడలు వేసి, రెండు మూరల కనకాంబరాలు, రెండు మూరల మల్లెపూలు తురిమి, అందంగా కూతురికి చీర కట్టి, తన దగ్గర ఉన్న నగలలో మంచివి వేసి కూతుర్ని అందంగా రెడీ చేశారు సుజాత గారు.
వైదేహికి తనని తాను అలా చూసుకోవడం కష్టంగా ఉంది. తను పుస్తకాలు పట్టుకోవాలి అనుకుంది, కానీ తన చేతికి టీ ట్రే అందించారు సుజాత గారు.
తెల్ల కోటు వేసుకోవాలి అనుకుంటే, పట్టుచీర కట్టి గంగిరెద్దులా రెడీ చేశారు.
మెడలో స్టెతస్కోప్ వేసుకోవాలని ఎంతో ఆశపడుతున్న తన మెడలో మూడు ముళ్లు వేయించాలని చూస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.
కానీ వాళ్లు బాధపడకూడదు అన్న ఆ చిన్నారి మనసు తనకు తానే సర్ది చెప్పుకుంటూ, ఏదో ఒక విధంగా తన ప్రమేయం లేకుండానే పెళ్లి క్యాన్సిల్ అయిపోవాలని వేడుకుంటూ ఉంది.
కొంతసేపటికి పెళ్లివాళ్లు రావడంతో వాళ్లని కూర్చోబెట్టి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉంటే, సుజాత గారు వెళ్లి కూతుర్ని తీసుకుని వచ్చారు.
వైదేహిని ఆ అబ్బాయికి ఎదురుగా కూర్చోబెట్టారు.
వైదేహి తల దించుకుంది. తల ఎత్తడం లేదు. అతను మాత్రం వైదేహి వైపు చూస్తూ ఉన్నాడు.
“చిట్టితల్లి, ఒకసారి తల ఎత్తి అబ్బాయి వైపు చూడు” అంటూ చెప్పడంతో మొహమాటంగానే తల ఎత్తి వచ్చిన అబ్బాయి వైపు చూసింది.
తను గవర్నమెంట్ జాబ్ అనగానే ఏదో వయసు పైబడినవాడిలా ఉంటాడు అనుకుంది. కానీ ఆ అబ్బాయికి పాతిక లేదా ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంకా స్టైల్‌గా కూడా ఉన్నాడు. చూడటానికి చాలా బాగున్నాడు. ఎవరికైనా అంత అందంగా, అంత హుందాగా ఉన్నాడు చూడడానికి.
వైదేహి రెండు క్షణాలు అతని వైపు చూసి, మళ్లీ భయంతో తల కిందకి దించేసుకుంది.
అబ్బాయి తల్లి ఊర్మిళ గారు కొడుకు వైపు చూస్తూ, “రేయ్ చిన్నా, ఏమైందిరా? అమ్మాయి నచ్చిందా?” అని అడిగారు.
“నచ్చింది అమ్మా” అన్నాడు ఆ అబ్బాయి తల్లి వైపు చూస్తూ.
ఆ మాటకి ఆవిడ తెగ పొంగిపోతూ, “నాకు, మా అబ్బాయికి అమ్మాయి లక్షణంగా నచ్చింది. ఇద్దరి ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. ఇక మేమైతే మీకు ముందే అన్నీ చెప్పేశాము. మాకు రూపాయి కట్నం అవసరం లేదు. పెళ్లి ఖర్చు మొత్తం మేమే భరించుకుంటాము. మీరేమైనా మీ అమ్మాయికి ఇద్దాము అనుకుంటే ఇవ్వండి. దానికి మేము ఎలాంటి అడ్డు చెప్పము. లేదు, తను కట్టుబట్టలతో వచ్చినా కూడా మేము తనని నిండు మనసుతో స్వీకరిస్తాము” అన్నారు ఊర్మిళ గారు.
“మీరు వద్దు అని చెప్పడం మీ సంస్కారం అమ్మా. కానీ ఎంతో కొంత ఇచ్చి మా అమ్మాయిని పంపించాలి కదా! వట్టి చేతులతో తనని అత్తవారింటికి పంపించడం తనకి మర్యాద కాదు, మీకు మర్యాద కాదు. అందుకే మేము అమ్మాయికి మూడు తులాల బంగారం పెడదామనుకుంటున్నాము. అలాగే అబ్బాయికి రెండు తులాలు పెడతాము. అంతకుమించి మేము తూగలేము” అన్నారు కోటేశ్వరరావు గారు ఉన్నది ఉన్నట్టు చెప్తూ.
“అయ్యో, దానిదేముంది అన్నయ్యగారూ! చెప్తున్నాం కదా, మాకు మరీ ఎక్కువేమీ లేదు. కానీ మా పిల్లలకి ఇవ్వడానికి ఏ లోటూ లేకుండా ఉంది. ఇంకా వాడు గవర్నమెంట్ జాబ్ కదా, మీకు తెలిసిందే కదా, అన్ని వసతులు ఫ్రీగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఇల్లు పాతబడింది. ఇల్లు ఒకసారి పడగొట్టి మళ్లీ కట్టిద్దాం అనుకుంటున్నాము. అంతవరకు గవర్నమెంట్ వాళ్లు ఇచ్చిన క్వార్టర్స్‌లోనే ఉంటున్నాము. మీ అమ్మాయి మా ఇంటికి రావడానికి ఎలాగో ఒక రెండు మూడు నెలలు కచ్చితంగా పడుతుంది. ఈలోపు ఇల్లు కూడా పూర్తి అయిపోతుంది అనుకుంటున్నాము. కొత్త కోడల్ని కొత్త ఇంటికే తీసుకెళ్తాము మేము” అన్నారు ఊర్మిళ గారు.
“అది మీ మంచితనం అమ్మా” అన్నారు కోటేశ్వరరావు గారు.
ఇదేంటి, పెళ్లి ఏదో ఒక విధంగా ఆగిపోతుంది అనుకుంటే, ఇప్పుడే ఖాయం చేసేసుకునేలా ఉన్నారు అనుకుంటూ భయపడుతూ ఉండగా, పెద్దవాళ్లు తమ మాటల్లో పడిపోయారు. వైదేహికి అక్కడ ఉండటం, ఆ చీరలో కూర్చోవడం ఏవీ కూడా నచ్చడం లేదు.
కొంతసేపటికి సుజాత గారు కూతుర్ని పక్కకి తీసుకుని వెళ్లిపోయి, “ఇదిగో, వెళ్లి ఉమా పిన్ని ఇంట్లో ఉండు. నేను పిన్నితో మాట్లాడాను” అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు పక్కింటి ఉమా గారు.
“అక్కా, నేను పాపని ఇంట్లోకి తీసుకెళ్తాను. అంతా అయిపోయాక మీరు పిలవండి. తనని పంపిస్తాను” అంటూ వైదేహిని తీసుకుని అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు ఆవిడ.
ఇక్కడ ఒక గంట పాటు మాటలు జరిగిన తర్వాత పెళ్లి మూడు నెలల తర్వాత జరపాలని ముహూర్తం కూడా మాట్లాడేసుకున్నారు ఇరు కుటుంబ సభ్యులు.
——–continues………… 
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ