పేరు ఏమని పెట్టాలి ఈ బంధానికి? – 106
ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచిన తారక్, సాక్షి స్నానం చేసి రావడంతో ఆమె వైపు చూశాడు.
“తారక్ సర్, ఆయుష్ ఇంకాసేపట్లో నిద్ర లేస్తాడు. వాడికి కూడా స్నానం చేయించాలి. మీరు ఈరోజు జిమ్‌కి వెళ్లకుండా త్వరగా స్నానం ముగించుకుని రండి. నేను ఆయుష్‌ని నిద్ర లేపి, పక్క రూమ్‌లో వాడికి స్నానం చేయించి వస్తాను.
దేవాలయానికి వెళ్లాలి. పుట్టినరోజు సందర్భంగా వాడి పేరుతో అర్చన చేయించమని చెప్పాం. త్వరగా వెళ్లాలి,” అని చెప్పిన సాక్షి హడావుడిగా చీర కట్టుకుని పడుకున్న ఆయుష్‌ని ఎత్తుకుని వెళ్లింది.
తల ఊపిన తారక్ కూడా త్వరగా స్నానం ముగించుకుని వచ్చాడు.
సాక్షి తీసి పెట్టిన పంచె, షర్ట్ వేసుకుని రెడీ అయ్యాడు.
ఆయుష్‌ని రెడీ చేస్తున్న సాక్షి, వాడిని తారక్ చేతిలో ఇచ్చి, తాను ఒక పట్టుచీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి రెడీ అయి వచ్చింది.
“హ్యాపీ బర్త్‌డే, మై ప్రిన్స్,” అంటూ తన కొడుక్కి విష్ చేసిన తారక్, తాను తీసుకొచ్చిన బంగారు గొలుసును కొడుకు మెడలో వేశాడు.
నిన్న తారక్, సాక్షి నేర్పించినట్టుగానే ఆయుష్ ముద్దుగా, “థ్యాంక్ యూ,” అని కోయిలలా పలికాడు.
అలా చెప్పిన కొడుకుని చూసి తారక్ నవ్వాడు.
రెడీ అయి వచ్చిన సాక్షి వైపు చూసిన అతను, ఆయుష్ ఆటబొమ్మను ఎత్తుకుని రెడీ అవుతున్న సాక్షి నడుమును గురిగా చేసుకుని నేరుగా కొట్టాడు.
ఆమె కోపంగా అతని వైపు చూసింది.