రాక్షస ప్రేమ -13
“రేయ్ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే కాదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తావ్ ఏంటి రా..? ఎవరైనా ఈ మాటలు విన్నారు అంటే నువ్వు మగాడివేనా అని అడుగుతారు. పెరుమాళ్ళ వంశంలో పుట్టి ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తావేంట్రా..? త్వరగా పెళ్లి చేసుకొని నాకు ముని మనవడిని ఇవ్వు” అని సీరియస్గా చెప్పింది కనకమహాలక్ష్మి.
విరాట్ మాత్రం ఆ మాటలు కూడా వినలేనట్లుగా రూమ్ లోనికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాడు.
తినడం అయిపోయిన రౌద్ర “ఏంటే ముసలి వద్దు అంటుంటే వాడికి పెళ్లి చేయాలి అని అంత తొందర పడుతున్నావ్. ఆ పెళ్లి ఏదో నాకు చేసేయ్, నేను నీకు ముని మనవడని ఇస్తా” అని మహాలక్ష్మి దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకుంటూ అన్నాడు.
“చదువే అయిపోలేదు అప్పుడే నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా..? నీ తొందర చూస్తుంటే మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కనీ మా చేతుల్లో పెట్టేటట్టు ఉన్నావ్” అని రౌద్ర చెవి పెట్టుకొని మెలి తిప్పుతూ అన్నది కనక మహాలక్ష్మి.
“ముసలి చెవి వదలవే నొప్పి, ముసలి దానివి అయ్యావు కానీ పట్టు మాత్రం ఇంకా గట్టిగానే ఉంది. ఇలానే తాతని ఏడిపించి ఉంటావు అందుకే మా తాత ముందే పైకి పోయాడు” అని నవ్వుతూ చేతులు పైకి పెట్టి చూపిస్తూ అన్నాడు రౌద్ర..