వలయం -5
“నా నిధి నాకు దూరమైపోయింది రా, ఇప్పటివరకు ఈ ప్రపంచంలో తను ఒక్కటి మాత్రమే నా పక్కన అండగా నిలిచింది. ఇప్పుడు తను కూడా నాకు దూరమైపోయి ఒంటరి వాడిని చేసింది రా, ఈ ఒంటరితనం కష్టంగా ఉంది” అని అన్నాడు ఉదయ్..
ఐదు నిమిషాలు నీరజ్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఉదయ్ భాదని చూస్తుంటే అతని గుండె తరుక్కుపోయినట్లుగా అనిపించింది,
బిజినెస్ లో నష్టపోయిన, మనీ చాలా లాస్ వచ్చిన ఎన్ని రకాలుగా అతను ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఎప్పుడూ ఇలా డీలా పడలేదు. కన్నీళ్లు పెట్టుకోలేదు. ధైర్యంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నిధి చనిపోవడంతో అతని సర్వస్వం కోల్పోయినట్లుగా ఇక అతని జీవితమే అక్కడితో ఆగిపోయింది అన్నట్లుగా మాట్లాడుతుంటే నీరజ్ చూడలేకపోయాడు.
ఒక ఫ్రెండ్ గా సపోర్ట్ గా ఉండి ధైర్యం చెప్పాలి అని వచ్చాడు కానీ ఇప్పుడు ఉదయ్ ని చూస్తుంటే నోట మాట రాలేదు తను ఎంత ధైర్యం చెప్పినా ఆ మాటలు నోటి మాట వరకే అన్న ఫీలింగ్ కలిగింది.
“నువ్వు చెప్పేది నిజమేరా, మనం ఎంతో ఇష్టంగా ప్రేమించే వ్యక్తి మన జీవితంలో లేకపోతే జీవితం నరకంగానే ఉంటుంది. కానీ నువ్వు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అని నిధి కోరుకుంది. నువ్వు బిజినెస్ లో సక్సెస్ అయితే తను పైనుండి చూసి ఆనంద పడుతుంది కదా, ఇలా తన గురించే ఏడుస్తూ డిలా పడిపోతే తను కూడా నిన్ను చూసి పైన ఏడుస్తూ ఉంటుంది కదరా,