ఆమె – 1
హైదరాబాద్ మహానగరం…
ఉదయం నుంచి రద్దీగా ఉన్న రహదారులు…
ఎక్కడ చూసినా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆరాటంతో పరుగులు తీస్తున్న మనుషులు. ఒకవైపు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, మరోవైపు స్కూళ్లకు వెళ్లే చిన్నారులతో నిండిన బస్సులు, రోడ్డుపై ఆగకుండా వినిపిస్తున్న వాహనాల హారన్లు… వీటన్నింటి మధ్య తనదైన వేగంతో ముందుకు సాగిపోతోంది ఆ మహానగరం.
అప్పటికే వేసవి కాలం కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం సమయం దాటకముందే ఎండ తీవ్రత పెరిగిపోయింది. రహదారులపై నుంచి వేడి సెగలు పైకి ఎగసిపడుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న చెట్ల నీడలో కాసేపు నిలబడితే చాలు, ఆ ఎండ నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందేమోనని చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయినా ఆ వేడి నుంచి తప్పించుకోవడం అంత సులభంగా లేదు.
ఆకాశంలో మబ్బుల జాడ కూడా కనిపించడం లేదు. నీలాకాశం కింద ఎండలో మెరుస్తున్న భవనాలు, ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వాహనాలు, రోడ్డు పక్కన నీడ కోసం ఎదురుచూస్తున్న పాదచారులు… నగరం మొత్తం తన పనుల్లో తాను నిమగ్నమై ఉంది.
అలాంటి రద్దీగా ఉండే నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రి.
ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్లగానే అంబులెన్స్ల శబ్దాలు, లోపలికి వస్తున్న రోగులు, వారితో పాటు ఆందోళనగా నడుస్తున్న కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. కొందరు డాక్టర్ల కోసం ఎదురుచూస్తుంటే, మరికొందరు చేతుల్లో రిపోర్టులు పట్టుకుని ఒక గది నుంచి మరో గదికి తిరుగుతున్నారు. ఇంకొందరు తమ వాళ్లకు ఏమైందోనన్న ఆందోళనతో నిశ్శబ్దంగా కూర్చున్నారు.
ఆసుపత్రి లోపల మాత్రం బయట ఎండ వేడికి పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. చల్లగా ఉన్న గాలిలో మందుల వాసన కలిసిపోయింది. తెల్లటి దుస్తుల్లో నర్సులు ఒకరి తర్వాత ఒకరు వేగంగా నడుస్తూ తమ పనులు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు వినిపిస్తున్న పేషెంట్ల మాటలు, నర్సులు పిలుస్తున్న స్వరాలు, వీల్చైర్ల చక్రాల శబ్దాలు ఆ ప్రదేశమంతా నిండిపోయాయి.
అదే ఆసుపత్రిలోని ఒక అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్ ముందు మాత్రం ఓ దంపతులు ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
వాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న ఆందోళన చూస్తేనే లోపల ఏదో ముఖ్యమైన విషయం జరుగుతోందని అర్థమవుతోంది.
ఆపరేషన్ థియేటర్ పైన వెలుగుతున్న ఎరుపు రంగు లైట్ వైపే పదేపదే చూస్తున్నాడు అతడు పక్కనే ఉన్న అతని భార్య చేతులు జోడించి దేవుడిని ప్రార్థిస్తోంది. కాసేపు కూర్చోవాలని ప్రయత్నించినా మనసులోని ఆందోళన వాళ్లను ఒక్కచోట నిలవనివ్వడం లేదు.
ఎందుకంటే…
ఆపరేషన్ థియేటర్ లోపల ఉన్నది వాళ్ల గారాలపట్టి. ఇరవై రెండేళ్ల వయసున్న తమ కూతురు తొలిసారి తల్లి కాబోతోంది.
తమ కూతురు నొప్పులతో బాధపడుతూ లోపల ఉందన్న ఆలోచనే ఆ తల్లిదండ్రుల మనసును కలచివేస్తోంది. ఆమెను ఆ బాధ నుంచి బయటపడేయడానికి తమ చేతుల్లో ఏమీ లేకపోవడం వాళ్లను మరింతగా బాధిస్తోంది.
“ఏమవుతుందోనండీ… మన అమ్మాయికి ఏ కష్టం రాకుండా ఉంటే చాలు. తను క్షేమంగా బయటకు రావాలి. పుట్టబోయే బిడ్డకు కూడా ఏమీ కాకూడదు” అంటూ కన్నీళ్లు తుడుచుకుంది ఆ తల్లి.
ఆమె మాటలు విన్న భర్త తన భార్య భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు.
“ఏం కాదు. మన అమ్మాయికి ఏమీ కాదు. డాక్టర్లు ఉన్నారుగా… అంతా మంచే జరుగుతుంది. నువ్వేం కంగారు పడకు” అన్నాడతను.
అతని మాటల్లో ధైర్యం కనిపించినా, అతని కళ్లలో మాత్రం ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
మళ్లీ ఇద్దరూ ఆపరేషన్ థియేటర్ వైపు చూశారు.
ఆ తలుపులు తెరుచుకుని తమ కూతురు నవ్వుతూ బయటకు వస్తే చాలని వాళ్ల మనసులు కోరుకుంటున్నాయి.
లోపల నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న స్వరాలకు వాళ్ల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ప్రతి నిమిషం వాళ్లకు గంటలా అనిపిస్తోంది. గోడకు ఉన్న గడియారంలో ముళ్లు ముందుకు కదులుతున్నా, వాళ్లకు మాత్రం సమయం అక్కడే ఆగిపోయినట్లు అనిపిస్తోంది.
కొద్దిసేపటి తర్వాత…
ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి.
లోపల ఉన్న డాక్టర్ బయటకు రావడంతో ఆ దంపతులు ఒక్కసారిగా ఆమె దగ్గరకు వెళ్లారు.
“డాక్టర్… మా అమ్మాయి ఎలా ఉంది? తనకు ఏమీ కాలేదు కదా?” అంటూ ఆత్రంగా అడిగింది ఆ తల్లి.
డాక్టర్ చిన్నగా నవ్వుతూ, “కంగారు పడకండి. మీ అమ్మాయి క్షేమంగానే ఉంది. పండంటి ఆడపిల్ల పుట్టింది” అని చెప్పింది.
ఆ మాట వినగానే అప్పటివరకు గుండెల్లో గూడు కట్టుకున్న ఆందోళన కాస్త తగ్గింది.
“నిజంగా డాక్టర్? మా అమ్మాయికి ఏమీ కాలేదు కదా?” అంటూ మరోసారి నిర్ధారించుకుంది ఆ తల్లి.
“అవును. తను బాగానే ఉంది. కొద్దిసేపట్లో మీరు మీ కూతురిని చూడొచ్చు” అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్లింది.
ఆడపిల్ల పుట్టిందన్న వార్త విన్న ఆ దంపతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
“విన్నారా అండి… మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది!” అంటూ ఆనందంతో భర్త చేతిని పట్టుకుంది ఆ తల్లి.
“అవును… మన ఇంట్లోకి చిన్నారి లక్ష్మి వచ్చింది. మన అమ్మాయి తల్లి అయిందంటే నమ్మలేకపోతున్నాను” అంటూ ఆనందంగా కళ్లలో నీళ్లు నింపుకున్నాడు అతడు.
ఆ కన్నీళ్లలో బాధ లేదు. తమ కూతురు క్షేమంగా ఉండటంతో పాటు, తమ కుటుంబంలోకి మరో ప్రాణం వచ్చిందన్న సంతోషం ఉంది.
కొద్దిసేపటికి ఒక నర్సు చేతుల్లో చిన్నారిని తీసుకుని బయటకు వచ్చింది.
తెల్లటి గుడ్డలో చుట్టి ఉన్న ఆ పసిపాప కళ్లుమూసుకుని ప్రశాంతంగా ఉంది. చిన్నచిన్న చేతులు, గులాబీ రంగులో ఉన్న బుగ్గలు, అప్పుడప్పుడూ కదులుతున్న పెదవులు… ఆ చిన్నారి రూపం చూడగానే ఆ అమ్మమ్మ మనసు మురిసిపోయింది.
నర్సు పాపను వాళ్లకు చూపించగానే ఆ ఆమె చేతులు చాపింది.
“నా బంగారు తల్లి…” అంటూ పాపను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుంది.
ఆ చిన్నారి ముఖాన్ని చూస్తూ ఆమెకు ఎన్ని మాటలు చెప్పాలనిపించిందో! తన కూతురు చిన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తుకొచ్చింది. కాలం ఎంత త్వరగా గడిచిపోయిందో అనుకుంది. నిన్నమొన్నటి వరకు తన ఒడిలో ఆడుకున్న కూతురు, ఇప్పుడు ఒక చిన్నారికి తల్లి అయింది.
పక్కనే ఉన్న భర్త కూడా పాపను చూసి మురిసిపోయాడు.
“చూడు… అచ్చం మన అమ్మాయి చిన్నప్పుడు ఇలాగే ఉండేది” అంటూ నవ్వాడు.
వాళ్లకు ఆ క్షణంలో ప్రపంచమంతా తమ చేతుల్లోకి వచ్చినట్లు అనిపించింది.
కానీ…
అక్కడే ఉన్న మరో మహిళ ముఖంలో మాత్రం అలాంటి ఆనందం కనిపించలేదు.
ఆమె ఆ పసిపాపకు నాన్నమ్మ.
ఒక మహిళగా మరో మహిళ పడిన కష్టాన్ని అర్థం చేసుకోవాల్సిన ఆమె, ఆడపిల్ల పుట్టిందన్న కారణంతోనే ముఖం తిప్పుకుంది.
“ఆడపిల్ల పుట్టిందా?” అంటూ అసంతృప్తిగా అడిగింది.
ఆమె మాటలు విన్న పాప తాతయ్య, అమ్మమ్మ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. అప్పటివరకు ఆనందంతో నిండిన వాళ్ల మనసుల్లో ఒక్కసారిగా బాధ చోటుచేసుకుంది.
ఒక చిన్నారి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తనకు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు. తనను ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ద్వేషిస్తారు అన్నది తెలియదు. ఇంకా సరిగ్గా కళ్లు తెరిచి ఈ ప్రపంచాన్ని కూడా చూడని ఆ పసిపాపపై అప్పుడే వివక్ష మొదలైంది.
ఆమె ఆడపిల్లగా పుట్టడం మాత్రమే ఆమె చేసిన తప్పా?
తన పుట్టుకకు తానే కారణమా?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వయసు కూడా ఆ చిన్నారిది కాదు.
అయినా ఆమె పుట్టిన మొదటి క్షణాల నుంచే, తనకు తెలియని ఒక వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇంతలో నర్సు పాపను తిరిగి తీసుకుని లోపలికి వెళ్లింది. తల్లి దగ్గరకు తీసుకెళ్లే ముందు అవసరమైన పరీక్షలు చేయాల్సి ఉంది.
కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి పాప ఆరోగ్యం గురించి వివరించింది.
“పాపకు జాండిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. బిలిరుబిన్ స్థాయిని పరీక్షించి, అవసరాన్ని బట్టి చికిత్స అందించాలి. అందుకే ప్రస్తుతం పాపను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నాం. తల్లి కూడా విశ్రాంతి తీసుకోవాలి” అని చెప్పింది.
ఆ మాటలు విన్న పాప అమ్మమ్మ కంగారుపడింది.
“డాక్టర్… మా మనవరాలికి ఏమైనా ప్రమాదమా?” అంటూ ఆందోళనగా అడిగింది.
” భయపడాల్సిన అవసరం లేదు. మేము పాపను జాగ్రత్తగా చూసుకుంటాం. పరీక్షల ఫలితాలను బట్టి చికిత్స అందిస్తాం” అని డాక్టర్ ధైర్యం చెప్పింది.
ఆ మాటలు విన్న తర్వాత కూడా వాళ్ల మనసుల్లో ఆందోళన పూర్తిగా తగ్గలేదు.
అంతవరకు తమ కూతురు క్షేమంగా ఉందన్న ఆనందంలో ఉన్న వాళ్లు, ఇప్పుడు పుట్టిన పసిపాప ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మళ్లీ కలవరపడ్డారు.
మరోవైపు…
తన బిడ్డను చూడాలనే ఆత్రంతో కళ్లు తెరిచింది ఆమె.
శరీరమంతా నీరసంగా ఉంది. ప్రసవం తర్వాత వచ్చిన అలసటతో కదలడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. అయినా ఆమె మనసు మాత్రం తన బిడ్డ చుట్టూనే తిరుగుతోంది.
“అమ్మా…” అంటూ బలహీనంగా పిలిచింది.
తన అపక్కనే ఉన్న ఆమె తల్లి వెంటనే ఆమె పక్కకి చేరింది.
“ఏమైందమ్మా? ఎలా ఉంది ఇప్పుడు?” అంటూ కూతురు దగ్గరకు వెళ్లి నుదుటిపై చేయి వేసింది.
“నేను బాగానే ఉన్నాను అమ్మా… నా బిడ్డ ఎక్కడ? నాకు పాప పుట్టిందని చెప్పారు కదా… ఒక్కసారి చూపించమ్మా” అంటూ ఆత్రంగా అడిగింది.
ఆ ప్రశ్న వినగానే తల్లి మనసు భారమైంది.
కూతురికి అప్పుడే తన బిడ్డను చూడాలన్న ఆరాటం ఎంతగా ఉందో ఆమెకు అర్థమవుతోంది. కానీ పాపను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచిన విషయం ఎలా చెప్పాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయింది.
“పాప బాగానే ఉందమ్మా. డాక్టర్లు కొన్ని పరీక్షలు చేస్తున్నారు. కొంచెం సమయం పడుతుంది. నువ్వు కంగారు పడకు” అని మెల్లగా చెప్పింది.
” నేను తనను ఎప్పుడు చూస్తాను అమ్మా? తనను ఒక్కసారి నా దగ్గరకు తీసుకురావా…” అంటూ ఆమె గొంతు వణికింది.
ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
తన కడుపులో తొమ్మిది నెలలు పెరిగిన బిడ్డను, ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా దగ్గరగా హత్తుకోలేకపోవడం ఆమెకు తట్టుకోలేనంత బాధగా అనిపించింది.
పాప ఏడుపు వినాలని, తన చిన్నచిన్న వేళ్లను పట్టుకోవాలని, తన గుండెలకు హత్తుకుని ముద్దులు పెట్టుకోవాలని ఆమె మనసు తహతహలాడుతోంది.
కానీ ఆ కోరికను తీర్చుకునే పరిస్థితి ఆమెకు లేదు.
ఒకవైపు బిడ్డకు ఏమీ కాకూడదన్న భయం… మరోవైపు తన బిడ్డకు దూరంగా ఉండాల్సి వస్తోందన్న బాధ.
ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు.
అమ్మ దగ్గర కూర్చుని కూతురిని ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ తల్లి మనసుకు కూతురి బాధ తెలుసు. ఎన్ని మాటలు చెప్పినా, తన బిడ్డను కళ్లారా చూసే వరకు ఆ యువతికి మనశ్శాంతి ఉండదని ఆమెకు అర్థమైంది.
ఆసుపత్రి గదిలో గడియారం ముళ్లు తిరుగుతున్నాయి. నర్సులు వచ్చి వెళ్తున్నారు. డాక్టర్లు పాప ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. బయట ఎండ తీవ్రత తగ్గి సాయంత్రం అవుతోంది. మళ్లీ రాత్రి గడిచి ఉదయం వస్తోంది.
ఇంకా ఉంది….
ఎలా ఉంది??
మీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తూ మీ నందు ❤️
Swipe left/right or tap the sides to turn pages