New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆమె – 3
ఆమె 7 min read

ఆమె – 3

ఆసుపత్రి గదిలో సమయం గడుస్తున్న కొద్దీ ఆ యువతి మనసులో ఆందోళన పెరుగుతోంది. తన పాపను ఎప్పుడు దగ్గరగా చూసుకుంటుందో తెలియదు. వైద్యులు ఎప్పుడు తన బిడ్డను తన దగ్గరకు తీసుకొస్తారో తెలియదు.
ఆమెకు కావాల్సిందల్లా తన పాప క్షేమంగా ఉండటమే.
అప్పుడే గది తలుపు తెరుచుకుని డాక్టర్ లోపలికి వచ్చారు. ఆయనను చూడగానే ఆ యువతి ఆత్రంగా లేవడానికి ప్రయత్నించింది.
“డాక్టర్… నా పాప ఎలా ఉంది? ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా?” అని ఆందోళనగా అడిగింది.
“మీరు కంగారు పడకండి. పాపకు జాండిస్ ఉంది. అందుకే కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించాలి. అవసరమైన పరీక్షలు చేస్తున్నాం. పాప ఆరోగ్య పరిస్థితిని బట్టి మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచాల్సి రావచ్చు” అని వివరించారు.
ఆ మాటలు వినగానే ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది.
“మరికొన్ని రోజులా డాక్టర్? అప్పటికే మూడు రోజులైంది. నా పాపను ఒక్కసారి కూడా సరిగ్గా దగ్గరగా చూసుకోలేదు. ఎప్పుడూ నా దగ్గరకు తీసుకొస్తారు?” అని కన్నీళ్లతో అడిగింది.
“మీ బాధ మాకు అర్థమవుతోంది. కానీ పాప ఆరోగ్యం ముఖ్యం. చికిత్స పూర్తయ్యాక మీ దగ్గరకు తీసుకొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి” అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
డాక్టర్ వెళ్లిన తర్వాత ఆమె మౌనంగా ఉండిపోయింది.
తన బిడ్డకు చికిత్స అవసరమని తెలిసి బాధపడుతూనే ఉంది. అదే సమయంలో, పాపను తన దగ్గరకు తీసుకురావడానికి ఇంకా సమయం పడుతుందని తెలియడంతో మనసులో ఆందోళన మరింత పెరిగింది.
ఇలాంటి సమయంలో తన భర్త తనకు అండగా నిలబడతాడని ఆశించింది.
పాప చికిత్స కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తాడని, డాక్టర్లతో మాట్లాడి బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకుంటాడని అనుకుంది.
కానీ అతని ప్రవర్తన గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ ఆశ మెల్లగా తగ్గిపోతోంది.
ఆమె తన తల్లి వైపు చూసింది.
“అమ్మా… పాపను ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచాలంటున్నారు. చికిత్సకు ఎంత ఖర్చవుతుందో కూడా తెలియదు. ఈ విషయం ఆయనతో మాట్లాడాలి” అంది దిగులుగా.
“మాట్లాడమ్మా. బిడ్డ ఇద్దరిదీ కదా! ఈ సమయంలో మీ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి” అని తల్లి చెప్పింది.
ఆమెకు కూడా అదే అనిపించింది.
తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పాలని నిర్ణయించుకుంది.
కొద్దిసేపు ఫోన్ చేతిలో పట్టుకుని ఆలోచించింది. అతను తన మాటలను సరిగ్గా వింటాడో లేదోనన్న సందేహం ఒకవైపు, పాప కోసం అతని సహాయం అవసరమన్న ఆలోచన మరోవైపు ఆమెను వెంటాడుతున్నాయి.
చివరికి ధైర్యం చేసి ఫోన్ చేసింది.
రెండు మూడు రింగుల తర్వాత అతను ఫోన్ ఎత్తాడు.
“ఏంటి?” అన్నాడు.
ఆ మాట వినగానే ఆమెకు కాస్త బాధగా అనిపించినా, తన బిడ్డ గురించి చెప్పడం మొదలుపెట్టింది.
“పాపకు ఇంకా చికిత్స అవసరమని డాక్టర్ చెప్పారు. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచాలంటున్నారు. అందుకు అవసరమైన ఖర్చుల గురించి కూడా మాట్లాడాలి. మీరు ఒకసారి ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో మాట్లాడతారా?” అని అడిగింది.
అవతలి వైపు కొద్దిసేపు నిశ్శబ్దం.
“ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. ప్రతిసారీ ఆసుపత్రికి రావడం నా వల్ల కాదు. అక్కడ డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్లే చూసుకుంటారు” అన్నాడు.
ఆమె ఒక్కసారిగా నిరుత్సాహపడింది.
“నేను మీకు ప్రతిసారీ రావాలని చెప్పడం లేదు. మన పాపకు చికిత్స అవసరమని చెబుతున్నాను. తన ఆరోగ్యం బాగుండాలంటే మనం కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాలి కదా!” అంది.
“అయితే ఇప్పుడు నేనేం చేయాలి?” అని విసుగ్గా అడిగాడు.
ఆ ప్రశ్న ఆమెను మరింత బాధించింది.
“మీరు తన నాన్న కదా! పాప కోసం మీరు కూడా ఆలోచించాలని అడుగుతున్నాను. చికిత్సకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. మనం కలిసి చూసుకుందాం” అంది.
అతను మాత్రం ఆమె మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు.
“ఇప్పుడే పాప కోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఇంకా ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచుతారో కూడా తెలియదు. మీ అమ్మానాన్నలు అక్కడే ఉన్నారు కదా! వాళ్లను చూసుకోమను” అన్నాడు.
ఆ మాటలు విన్న ఆమెకు ఒక్కసారిగా మాటలు రాలేదు.
తన బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన తండ్రి, చికిత్స ఖర్చు గురించి ఇలా మాట్లాడతాడని ఆమె ఊహించలేదు.
“అంటే… మన పాప కోసం మీరు ఏమీ చేయరా?” అని గొంతు వణుకుతుండగా అడిగింది.
“నేను అలా చెప్పలేదు. కానీ ప్రతి విషయానికి నన్నే అడగొద్దు. నాకు చాలా పనులున్నాయి” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఫోన్ చేతిలోనే ఉండిపోయింది.
తన కళ్ల నుంచి కన్నీళ్లు జారుతున్నా ఆమె వాటిని తుడుచుకోలేకపోయింది.
తన పాపకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినప్పుడు కనీసం ఒక్క మాటతోనైనా ధైర్యం చెప్పలేదు. ఇప్పుడు చికిత్స కోసం సహాయం అడిగితే బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాడు.
ఆమెకు తన పరిస్థితి అర్థం కావడం లేదు.
తన జీవితంలోకి వచ్చిన మనిషి, తన బిడ్డకు తండ్రి అయిన వ్యక్తి, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు?
అంతలో ఆమె తల్లి దగ్గరకు వచ్చి కూతురి భుజంపై చేయి వేసింది.
“ఏమన్నాడమ్మా?” అని అడిగింది.
ఆమె జరిగినదంతా చెప్పింది.
తల్లి ముఖంలో బాధ కనిపించింది. అల్లుడు ఇలా మాట్లాడతాడని ఆమె కూడా ఊహించలేదు.
అయినా ఆ సమయంలో కూతురిని మరింత బాధపెట్టకూడదని అనుకుంది.
“నువ్వు బాధపడకమ్మా. నీ పాపకు ఏం కావాలో మేము చూసుకుంటాం. నువ్వు ముందు ధైర్యంగా ఉండు” అని చెప్పింది.
ఆ మాటలు విన్న ఆమె తల్లిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది.
“అమ్మా… నా పాపకు ఏం తెలుసు? తను ఇంకా కళ్లైనా సరిగ్గా తెరవలేదు. ఈ ప్రపంచంలోకి వచ్చి కొన్ని రోజులే అయింది. అప్పుడే తనకు ఇన్ని కష్టాలు ఎందుకు? ఆడపిల్లగా పుట్టడం తన తప్పా అమ్మా?” అని అడిగింది.
ఆ ప్రశ్నకు తల్లి దగ్గర సమాధానం లేదు.
ఎందుకంటే, తన కూతురు అడుగుతున్నది ఒక ప్రశ్న మాత్రమే కాదు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తన బిడ్డను నిర్లక్ష్యం చేస్తున్న కుటుంబం గురించి ఆమె మనసులో పేరుకుపోయిన బాధ.
“ఆడపిల్లగా పుట్టడం తప్పు కాదు. నీ పాప మన ఇంటి మహాలక్ష్మి. ఎవరు ఎలా అనుకున్నా, తనకు మేమున్నాం. నువ్వు మనసులో అలాంటి ఆలోచనలు పెట్టుకోకు” అంటూ కూతురిని ఓదార్చింది.
ఆ మాటలు ఆమెకు కొంత ధైర్యాన్ని ఇచ్చాయి.
కానీ సమస్య అక్కడితో ముగియలేదు.
ఆసుపత్రి ఖర్చుల గురించి, పాపను ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లవచ్చనే విషయం గురించి ఆలోచిస్తూనే ఉంది.
మరోవైపు, అత్తింట్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.
ఆమెకు ఆడపిల్ల పుట్టిందన్న విషయం మొదటి నుంచే అత్తకు నచ్చలేదు. ఇప్పుడు పాప చికిత్స కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిసిన తర్వాత ఆమె అసంతృప్తి మరింత పెరిగింది.
“ఆడపిల్ల పుట్టిందని తెలిసినప్పటి నుంచే నా మాట వినకుండా ఉన్నారు. ఇప్పుడు దాని కోసం ఆసుపత్రి ఖర్చులు కూడా భరించాలా? ఎంతకాలం ఇలా కొనసాగిస్తారు?” అంటూ కొడుకుతో మాట్లాడింది.
అతను అప్పటికే భార్య మాటలతో అసహనంగా ఉన్నాడు. తల్లి మాటలు విన్న తర్వాత అతని ఆలోచనలు మరింత మారిపోయాయి.
“అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా?” అని అడిగాడు.
“ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. నీ భార్యki విడాకులు ఇవ్వు…. వాళ్ల అమ్మానాన్నలే చూసుకుంటారు. మన మీద బాధ్యత ఉండదు” అని చెప్పింది.
ఆ మాటలు విన్న అతను వెంటనే ఏమీ మాట్లాడలేదు.
భార్యను, తన బిడ్డను తన దగ్గరకు తీసుకురావాల్సిన సమయంలో, వారికి అండగా నిలబడాల్సిన సమయంలో, వారిని దూరం పెట్టాలన్న ఆలోచన అతనిలో మొదలైంది.
కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. పాపకు కూడా చికిత్స కొనసాగుతోంది. వైద్యులు పాప ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆమె మాత్రం ప్రతిరోజూ తన బిడ్డను చూసేందుకు ఎదురుచూస్తోంది.
చివరకు ఒక రోజు పాపను దగ్గరగా చూసుకునే అవకాశం వచ్చింది.
నర్సు చిన్నారిని ఆమె దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, ఆమెకళ్లలో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి.
తెల్లటి వస్త్రంలో చుట్టి ఉన్న తన పాపను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుంది.
ఆ చిన్నారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది.
“ఇన్ని రోజులు నీ కోసం ఎంత ఎదురుచూశానో తెలుసా తల్లీ…” అంటూ పాప నుదుటిపై ముద్దుపెట్టుకుంది.
ఆ క్షణంలో ఆమెకు ప్రపంచమంతా తన చేతుల్లో ఉన్నట్లు అనిపించింది.
తన బిడ్డను గుండెలకు హత్తుకుని, ఇకపై ఏ కష్టం వచ్చినా తన పాపకు అండగా ఉంటానని మనసులో అనుకుంది.
కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.
ఆమెను, పాపను ఇంటికి తీసుకెళ్లే విషయం గురించి మాట్లాడటానికి భర్త ఆసుపత్రికి వచ్చాడు.
అతని రాకతో ఆమె మనసులో మళ్లీ ఆశ చిగురించింది. ఇప్పుడు అయినా తనను, తన బిడ్డను ఇంటికి తీసుకెళ్తాడని అనుకుంది.
కానీ అతను చెప్పిన మాటలు ఆమె ఆశలన్నింటినీ ఒక్కసారిగా కూల్చేశాయి.
“నా ఆ పాప వద్దు. నేను నీకు విడాకులు ఇస్తాను ” అన్నాడు.
ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది.
ఆమె చేతుల్లో ఉన్న పాపను చూసింది. తర్వాత భర్త వైపు చూసింది.
“అమ్మకు ఇష్టం లేదా? ఎందుకు? పాప ఆడపిల్లగా పుట్టిందనా?” అని అడిగింది.
ఆ ప్రశ్నకు అతను సమాధానం చెప్పకుండా ముఖం తిప్పుకున్నాడు.
అతని మౌనమే ఆమెకు సమాధానంలా అనిపించింది.
“పాప ఏం చేసిందండి? తను మన బిడ్డ కదా! తన పుట్టుకలో తన తప్పేముంది? ఆడపిల్లగా పుట్టిందని తనను ఎందుకు దూరం పెడుతున్నారు?” అని కన్నీళ్లతో అడిగింది.
“ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడాలని నాకు లేదు.” అన్నాడు.
ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు.
తనకు అండగా నిలబడాల్సిన భర్తే తనను దూరం పెడుతుంటే, అతని ఇంట్లో తనకు ఏ స్థానం ఉందో అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
అయినా ఆమె అతనితో గొడవపడాలని అనుకోలేదు.
తన బిడ్డ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. ఈ సమయంలో తనకు కావాల్సింది ప్రశాంతత, తన పాపకు కావాల్సింది ప్రేమతో కూడిన సంరక్షణ.
చివరికి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక, తన తల్లి సహాయంతో పాపను తీసుకుని పుట్టింటికి బయలుదేరింది.
కారు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఆమె మౌనంగా కూర్చుంది. ఒడిలో ఉన్న పాప మాత్రం నిద్రపోతోంది.
తన బిడ్డ పుట్టినప్పుడు ఎన్నో కలలు కన్నది.
భర్తతో కలిసి పాపను పెంచాలని, ముగ్గురూ కలిసి సంతోషంగా ఉండాలని ఆశించింది. పాప మొదటిసారి నవ్వినప్పుడు, అడుగులు వేసినప్పుడు, మాటలు నేర్చుకున్నప్పుడు ఆ ఆనందాన్ని భర్తతో కలిసి పంచుకోవాలని అనుకుంది.
కానీ ఇప్పుడు తన బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్తోంది.
అది తనకు ఇష్టమైన నిర్ణయం కాదు. పరిస్థితులు తనను ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి.
ఆమె పాప ముఖాన్ని చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంది.
“నిన్ను ఎవరు వద్దనుకున్నా, నేను మాత్రం ఎప్పటికీ వదలను తల్లీ. నీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటాను” అని మెల్లగా చెప్పింది.
ఆ చిన్నారికి ఆ మాటలు అర్థం కాకపోయినా, తల్లి గుండెల్లోని ప్రేమ మాత్రం ఆ కౌగిలిలో నిండిపోయింది.
ఇంటికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రులు వారిద్దరినీ ప్రేమగా లోపలికి తీసుకెళ్లారు.
తల్లి కూతురిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి మనవరాలిని చేతుల్లోకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు.
“నువ్వేం బాధపడకమ్మా. ఇది నీ ఇల్లు. నువ్వు, నీ బిడ్డ ఇక్కడే ఉంటారు. మీకు మేమున్నాం” అని ధైర్యం చెప్పాడు.
ఆ మాటలు విన్న ఆమె మనసులో ఇన్ని రోజులుగా పేరుకుపోయిన బాధ కొంత తగ్గింది.
తన భర్త ఇంట్లో దక్కని ఆదరణ, తన పుట్టింట్లో దొరికింది.
తన బిడ్డను ఆడపిల్లగా చూసి నిర్లక్ష్యం చేసినవాళ్లు ఒకవైపు ఉంటే, అదే పాపను మహాలక్ష్మిలా స్వీకరించిన తన తల్లిదండ్రులు మరోవైపు ఉన్నారు.
ఆ రోజు ఆమెకు ఒక విషయం అర్థమైంది.
కుటుంబం అంటే ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడటం, కన్నీళ్లను తుడవడం, మనల్ని మనలాగే అంగీకరించడం కూడా కుటుంబమే.
ఆమె తన పాపను గుండెలకు హత్తుకుంది.
ఇకపై తన బిడ్డ కోసం తాను ధైర్యంగా ఉండాలి. తనకు ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవాలి.
ఎందుకంటే, తన బిడ్డకు తానే మొదటి బలం.
కానీ తన జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయం, రాబోయే రోజుల్లో ఆమెను ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్తుందో ఆమెకు తెలియదు.
ప్రస్తుతానికి ఆమెకు ఒక్కటే తెలుసు.
తన బిడ్డను ప్రేమగా పెంచాలి.
ఆ పాపకు తాను ఎప్పటికీ తోడుగా ఉండాలి.
అదే ఆమె నిర్ణయం.
ఇంకా ఉంది….
మీ నందు ❤️