New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమకు చిరునామా ❤ – 2

ప్రేమకు చిరునామా ❤ – 2

ప్రేమకు చిరునామా ❤️

 

Episode 2 – కొత్త పరిచయం

 

హైదరాబాద్‌ నగరం…

 

ఉదయం అప్పుడప్పుడే వెలుగు పూర్తిగా విస్తరిస్తోంది. అపార్ట్‌మెంట్ కిటికీల గుండా సూర్యకిరణాలు లోపలికి వస్తుంటే, బయట రోడ్డుపై ఆఫీస్‌లకు వెళ్లే వాళ్ల హడావిడి మొదలైంది…. స్కూల్‌కి వెళ్లే సందడి… నగరం తన రోజువారీ పరుగును మొదలుపెట్టింది.

 

అదే నగరంలో మియాపూర్, మదీనగర్ కాలనీలో ఉన్న ఒక  ఇంట్లో…

 

“అనిరుధ్… రెడీ అయ్యావా? ఇంకా ఎంతసేపు రా? టైమ్ అవుతోంది!” 

“రోజు లేటే”…

“మళ్లీ ఆఫీస్ కి టైం అయిపోతుంది అని తినకుండా వెళ్ళిపోతావు”…

అబ్బబ్బా…

“రోజు నీతో ఇదే బాధ”… 

 

వంటగదిలో నుంచి రేవతి పిలుస్తుంటే, అనిరుధ్ తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చాడు.

 

“వస్తున్నానమ్మా… రెడీ అయిపోయాను.”

“పొద్దు పొద్దున్నే క్లాస్ మొదలు పెట్టకు”…

 

“నువ్వు త్వరగా వచ్చి కూర్చుంటే నేనెందుకు క్లాస్ తీసుకుంటాను”.. అని అంది తల్లి.

 

“నిన్న పెట్రోల్ అయిపోయిందని బండి మధ్యలో ఆగిపోయింది అని ఆటో కి వచ్చావు కదా…ఈరోజు మళ్లీ ఆటోలో వెళ్తావా? లేక బస్సులో వెళ్తావా?”

 

అనిరుధ్ తన చేతికి వాచ్ పెట్టుకుంటూ నవ్వాడు.

 

“పెట్రోల్ అయిపోలేదమ్మా… బండి రిపేర్‌లో ఉంది. నిన్న సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు. మెకానిక్ దగ్గర ఇచ్చాను… ఈరోజు బస్సులోనే వెళ్తాను.”

 

అవునా మరి నిన్న నాతో పెట్రోల్ అయిపోయింది అని చెప్పావు… అని అంది రేవతి విసుగ్గా…

 

“నువ్వు టెన్షన్ పడతావని ఎలా చెప్పానమ్మా”

 

“అయితే మంచిది…రోజూ ఏదో ఒకటి అవుతుంది ఆ బైక్ కి… బస్సులో వెళ్తే కనీసం ఇలాంటి టెన్షన్ ఉండదు.”

 

“అమ్మా… బస్సులో వెళ్తే టెన్షన్ ఉండదా? అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడాలి, ఎక్కడానికి టెన్షన్, దిగడానికి టెన్షన్… ఆఫీస్‌కి వెళ్లేసరికి  టైం కి చేరుతానో లేదో అని టెన్షన్… ఈ అన్ని టెన్షన్లతో నేను ఆఫీస్ కి వెళ్లేసరికి సగం అయిపోతాడు.”

 

“అయినా ఈరోజుకి బస్సే మంచిది. బండి రిపేర్ అయ్యాక తీసుకెళ్తావులే.. అంది రేవతి.

 

“సరే తల్లీ… నీ మాటే వేదం.”

 

“ఇదే మాట ప్రతిరోజూ చెప్తావు. కానీ  నా మాట వినేది మాత్రం నీకు నచ్చినప్పుడే.”

 

అనిరుధ్ నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.

 

“సరే, ఇప్పుడు ఏం వండావో పెట్టు. ..ఆలస్యమైతే నా బస్సు వెళ్లిపోతుంది.”

 

“ఇడ్లీలు చేశాను. అల్లం చట్నీ ఉంది కొబ్బరి చట్నీ ఉంది… ముందు కడుపు నిండా తిను. ఆఫీస్‌కి వెళ్లాక తినడానికి టైమ్ ఉండదంటావు.”

 

“అమ్మా, రెండు ఇడ్లీలు చాలు.”

 

“నాలుగు తిను. రోజూ ఆఫీస్, ఇంటి బాధ్యతలు అంటూ సరిగ్గా తినడం కూడా మానేస్తున్నావు.”

 

“అబ్బా… నువ్వు తినిపించేది చూస్తుంటే ఆఫీస్‌కి వెళ్తున్నానా, ఏదైనా పోటీకి వెళ్తున్నానా అనిపిస్తోంది.”మా..

 

“నువ్వు మాట్లాడకుండా తిను frist తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినవు కదరా…”

 

“అది అసాధ్యం అమ్మా… నేను ఇదంతా ప్రశాంతంగా తినే లోపు అక్కడ బస్సు వెళ్ళిపోతుంది…

 

రేవతి నవ్వుతూ అతని ప్లేట్‌లో మరో ఇడ్లీ పెట్టింది..

 

అనిరుధ్ ఇంట్లో అందరితో సరదాగా ఉంటాడు. బయట ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత తన వాళ్లతో నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ నవ్వు వెనుక అతనికి తెలియని ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.

 

తండ్రి రామమూర్తి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో మందుల ఖర్చు ఒకవైపు… చెల్లి నందిని చదువు, కాలేజ్ ఫీజులు మరోవైపు… ఇంటి అద్దె, నెలవారీ ఖర్చులు ఇంకోవైపు. నెల మొదట్లో చేతికి వచ్చే జీతం, నెల పూర్తయ్యేలోపే ఎక్కడికి వెళ్లిపోతుందో అతనికే అర్థం కాదు.

 

అయినా తన సమస్యలను అమ్మ ముందు పెద్దవిగా చూపించడు.

 

“అమ్మా, నాన్న మందులు అయిపోయాయా?”

 

“ఇంకో రెండు రోజులకు అయిపోతాయి. తెచ్చుకోవాలి.”

 

“సరే, సాయంత్రం వస్తూ తీసుకొస్తాను.”

 

“నీకు ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉంటే చెప్పు రా. నేను వెళ్లి తెచ్చుకుంటాను.”

 

“నువ్వెందుకు వెళ్తావమ్మా? నేను తీసుకొస్తాను. నువ్వు ఏమీ టెన్షన్ పడకు.”

 

టిఫిన్ పూర్తిచేసి చేతులు కడుక్కొని… బ్యాగ్ తీసుకుని తలుపు దగ్గరకు వెళ్లాడు.

 

“అమ్మా, నేను వెళ్తున్నాను.”

“ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్”

 

“ సరే నాన్న నువ్వు జాగ్రత్తగా వెళ్లు రా. బస్సులో రద్దీ ఉంటే చూసుకుని ఎక్కు.”

 

“సరే అమ్మా. Bye!”

 

“అనిరుధ్…” అని పిలిచింది రేవతి.

 

“ఏంటమ్మా?”

 

“జాగ్రత్త.”

 

ఆ మాటలో అమ్మ ప్రేమ కనిపించడంతో అనిరుధ్ చిన్నగా నవ్వాడు.

 

“నేనేమన్నా చిన్నపిల్లాడినా …రోజూ ఇదే చెప్తావమ్మా. నేను జాగ్రత్తగానే ఉంటాను.”

 

అంటూ బయటకు వెళ్లిపోయాడు.

 

బస్ స్టాప్… దగ్గర వాహనాల శబ్దాలు, బస్సుల హారన్లు, ఆఫీస్‌కి వెళ్లే వాళ్ల హడావిడి జోరుగా ఉంది… ప్రతి ఒక్కరూ తమ గమ్యం చేరుకోవడానికి తొందరపడుతున్నారు.

 

అనిరుధ్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.

 

తన ఫోన్ తీసి టైమ్ చూసుకున్నాడు.

 

“8:25… ఈరోజు 218 త్వరగా వస్తే బాగుంటుంది.”

ఆఫీస్ కి త్వరగా వెళ్లిపోవచ్చు..

అంటూ రోడ్డు వైపు చూస్తున్నాడు…

కాసేపు వెయిట్ చేసాక… 

కొంచెం ఆసహనంగా…

ఈరోజు ఆఫీస్ కి లేట్ అయ్యేలా ఉంది అని ఇలా అనుకుంటూ ఉండగా….

 తను ఎక్కాల్సిన బస్సు రానే వచ్చింది..

 

బస్సు దగ్గరపడుతున్న కొద్దీ అందులో ఉన్న జనాల రద్దీ చూసి అనిరుధ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

“దేవుడా… ఈరోజు నన్ను నువ్వే కాపాడాలి,” అంటూ తన బ్యాగ్ భుజానికి సర్దుకుని ఒక అడుగు ముందుకు వేశాడు.

బస్సు స్టాప్ దగ్గర ఆగగానే ఒక్కసారిగా జనాలంతా బస్సు ఎక్కడానికి ఎగబడ్డారు. ఎవరు ముందు ఎక్కాలనే తొందరలో ఒకరినొకరు తోసుకుంటూ బస్సులోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

అనిరుధ్ కూడా వాళ్ల మధ్యలో తనకు దొరికిన చిన్న ఖాళీని చూసుకుని ముందుకు కదిలాడు.

అంతలో తన ముందున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తోసుకోవడంతో, అతని వెనుక ఉన్న అమ్మాయి అదుపు తప్పి కింద పడబోయింది..

 

“అరే… జాగ్రత్త!” అంటూ 

అనిరుధ్ వెంటనే ముందుకు చేయి చాచి ఆమెను పట్టుకున్నాడు. పడిపోకుండా ఆమె నడుము దగ్గర చేయి వేసి తనవైపుకు లాగడంతో, ఆ అమ్మాయి ఒక్కసారిగా అతని చేతుల్లోకి  వచ్చి వాలిపోయింది..

 

ఒక్క క్షణం…

ఆమె అతనికి మొహానికి దగ్గరగా ఉండడం

ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే ఆమె భయంతో అతని వైపు చూసింది. అనిరుధ్ కూడా ఆమెను చూసి ఒక్కసారిగా  తేరుకొని…

 

“Are you okay?” అని అడిగాడు.

 

ఆమె తల ఊపుతూ అతని నుంచి నెమ్మదిగా దూరమైంది.

 

“థాంక్యూ అండి… పడిపోయేదాన్ని.”

అంది ఆ అమ్మాయి.

 

“పర్లేదు… జాగ్రత్తగా ఉండండి. బస్సు ఎక్కేటప్పుడు.”

అని అనిరుధ్ చెప్పేలోపే ఆమె బస్సులోకి ఎక్కింది…

 

“Thank you!” అంటూ మరోసారి వెనక్కి తిరిగి అతనికి చెప్పింది.

అనిరుధ్ చిన్నగా నవ్వుతూ తల ఊపాడు.

 

ఆమె బస్సులోకి వెళ్లిపోయింది. ఆ రద్దీలో ఆమె ఎక్కడ నిలబడిందో కూడా అతనికి కనిపించలేదు.

తనూ ఎలాగో బస్సు ఎక్కి, ఒక చేత్తో పై రాడ్ పట్టుకుని నిలబడ్డాడు..

 

అమ్మాయిని చూసిన క్షణం నుంచి  ఏదో తెలియని ఆలోచన అతని మనసులో మొదలైంది…

 

ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె కళ్లలో కనిపించిన భయం… ఆ తర్వాత నవ్వుతూ చెప్పిన థాంక్యూ… ఎందుకో అతని మనసులో అలాగే నిలిచిపోయాయి…

 

అది కేవలం ఒక చిన్న పరిచయం మాత్రమే.

కానీ ఆ రోజు తాను ఎక్కిన బస్సు తన జీవితాన్ని ఎటువంటి మలుపు తిప్పబోతోందో…

ఆమె తన జీవితంలో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకోబోతోందో…

అతనికి తెలియదు…

 

 

❤️ కొనసాగుతుంది…