ప్రేమకు చిరునామా ❤ – 3
ఎపిసోడ్ 3 : బాబీ గర్ల్
అనిరుధ్ బస్సులో ఎక్కి, ఒక చేత్తో పై రాడ్ పట్టుకుని నిలబడ్డాడు. బస్సు కదలడం మొదలైంది. ప్రయాణికుల రద్దీ మధ్య అతను కిటికీ వైపు చూస్తూ తన ఆలోచనల్లో ఉండిపోయాడు..
అంతలో, కొద్దిసేపటి క్రితం బస్సు ఎక్కేటప్పుడు పడిపోబోయిన అమ్మాయి అతనికి దగ్గరగా వచ్చి నిలబడింది…
“ఎక్స్యూజ్ మీ…” అంటూ ఆమె పిలిచింది.
అనిరుధ్ ఎవరు అన్నట్టు తల తిప్పి చూశాడు….
ఎదురుగా నిలబడి ఉన్న ఆ అమ్మాయి
అనిరుద్ చూపుకు కొత్తగా అనిపించింది. పొడవాటి జుట్టు భుజాల మీదుగా జారుతూ, నుదుటిపై చిన్నగా పడిన వెంట్రుకలను సర్దుకుంటూ అతని వైపు చూసింది…
కళ్లకు పెట్టుకున్న కాటుక ఆమె చూపుకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. లేత రంగు చుడీదార్, తెల్లటి దుపట్టాలో చాలా సాధారణంగా ఉన్నప్పటికీ, ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ ప్రశాంతత, పెదవులపై పలికిన చిన్న చిరునవ్వు ప్రత్యేకంగా అనిపించాయి.
” అందం అంటే ఆడంబరం మాత్రమే కాదని, కొన్ని ముఖాల్లో కనిపించే అమాయకత్వం కూడా మనసును ఆపగలదని అనిపించేలా ఉంది ఆమె రూపం”..
“చెప్పండి…” అంటూ అనిరుధ్ ఆమె వైపు చూశాడు..
“మీరు ఎక్కడ దిగుతారు అని అడిగింది” ఆ అమ్మాయి..
“ఎందుకు” అని ఆశ్చర్యంగా అడిగాడు
ఏం లేదు… ఈ బస్సులో ఇంత రష్ ఉంటుందని అనుకోలేదు. ఎక్కడ దిగాలో తెలియక అడిగాను.” అని సమాధానం ఇచ్చింది..
“ ఓహో ..మీరు ఎక్కడికి వెళ్లాలి?”
ఆమె తన ఆఫీస్ అడ్రస్ చెప్పింది.
“అయితే ఇంకా రెండు స్టాప్స్ ఉన్నాయి. అక్కడ దిగితే మీకు దగ్గరగా ఉంటుంది.”
“ఓహ్… థాంక్యూ. నిజంగా ఈరోజు ఉదయం నుంచే అంతా గందరగోళంగా ఉంది.”
“అది కనిపిస్తోంది,” అన్నాడు అనిరుధ్ చిన్నగా నవ్వుతూ.
“ ఆ ఏంటి?” అంటూ ఆమె కనుబొమ్మలు పైకెత్తింది.
“అదే… బస్సు ఎక్కేటప్పుడు ఒకసారి పడిపోతారు, ఇప్పుడు ఎక్కడ దిగాలో తెలియదు. మీకు ఈరోజు కలిసి రావడం లేదు అనుకుంటా.” అని అన్నాడు.. ఆమెని ఏడిపిస్తూ…
ఆమె అతని వైపు కొంచెం సీరియస్ గా చూసి..
“అంటే నన్ను చూసి జాతకం చెప్పేస్తున్నారా?”
అంది.
“జాతకం కాదు… ఇప్పటివరకు జరిగిన సంఘటనలు చూసి చిన్న అంచనా అంతే.
నా సంగతి ఎందుకు అడుగుతున్నారు?”
మరి మీకు ఈరోజు బాగా కలిసి వచ్చిందా?”
“మీరు కూడా ఆఫీస్‌కి వెళ్తున్నట్టున్నారు కదా. బస్సు కోసం అంత కంగారు పడుతున్నారు.” నేను కూడా మీలాగే కంగారులో అలా వచ్చాను …అని అoది మూతి ముడుచుకుంటూ….
“నాకు లేట్ అయితే మా ఆఫీస్‌లో పని కంటే లెక్చర్ ఎక్కువ ఉంటుంది.” అందుకే..
“అయితే మీ బాస్ చాలా స్ట్రిక్ట్ అన్నమాట?”
“బాస్ స్ట్రిక్ట్ కాదు… టైమ్ అమ్మ నా టైం చాలా స్టిక్… ఏది కూడా టైం కి జరగదు” …
ఆ మాటలతో ఆమె మరోసారి నవ్వింది.
“మీరు బాగా మాట్లాడతారు.”అంది.
“అది మా ఇంట్లో అందరూ చెప్పే కంప్లైంట్.”
“కంప్లైంటా?”
“అవును. నేను మాట్లాడితే మా అమ్మ అంటుంది… ‘అనిరుధ్, నువ్వు నోరు మూసుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది’ అని.” అన్నాడు.
ఆమె నవ్వుకుంటూ…
“అయితే మీ అమ్మకి మీ మీద చాలా ప్రేమ
ఉన్నట్టుంది.”
“ప్రేమ ఉంది కాబట్టే భరిస్తుంది.”
ఆ మాట విన్న ఆమె అతని వైపు కాసేపు చూసింది..
అప్పుడే బస్సు మరో స్టాప్ దగ్గర ఆగింది. కొంతమంది దిగారు, మరికొందరు ఎక్కారు.
“మీరు ఇక్కడ దిగాలి,” అంటూ అనిరుధ్ ఆమెకు గుర్తుచేశాడు..
“అవునండి… థాంక్యూ. ఉదయం పడిపోకుండా పట్టుకున్నారు, ఇప్పుడు దారి కూడా చెప్పారు.”
“అంతకంటే ఏం చేయగలం?
హైదరాబాద్‌లో మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే, ఈ రద్దీలో ప్రయాణించడం చాలా కష్టం.” అని అన్నాడు.
ఆమె దిగుతూ చిన్నగా నవ్వింది.
“మళ్లీ కలిస్తే మాట్లాడతాను.”అని చెప్పింది.
అనిరుధ్ కూడా నవ్వుతూ, నన్ను కలవడం కోసం మీరు మళ్ళీ బస్సులో నుంచి పడిపోతారా ఏంటి ,” అని అన్నాడు ఆమెను ఉడికిస్తూ….
ఆమె అతని వైపు కోపంగా చూస్తూ…
“ ఈ ఇన్సిడెంట్ మీకు గుర్తుండిపోతుంది కదా!” అంటూ ఆమె బస్సు దిగిపోయింది…
అనిరుధ్ కిటికీలోంచి ఆమె వెళ్లే వైపు ఒకసారి చూసి…. “బాబీ గర్ల్” అంటూ నవ్వుకున్నాడు…
ఏదో గుర్తొచ్చినట్టు పాకెట్ ల నుంచి ఫోన్ తిసుకుని టైమ్ చూసిన అనిరుధ్, ఇంకా తన స్టాప్ రావడానికి రెండు నిమిషాలు ఉందని గమనించాడు. అప్పటికే ఆఫీస్ నుంచి కర్తిక్ ఫోన్ చేశాడు.
“హలో బ్రో… ఎక్కడున్నావ్? ఆఫీస్‌కి వచ్చేశావా?” అని కర్తిక్ అడిగాడు.
“బస్సులో ఉన్నాను రా… ఇంకో రెండు నిమిషాల్లో దిగుతాను.”
“అబ్బా! ఈరోజు కూడా బస్సేనా? నీ బైక్ ఏమైంది?”
“బైక్ రిపేర్‌లో ఉందని చెప్పాను కదరా. నువ్వు రోజూ ఇదే ప్రశ్న అడిగి నా గాయాన్ని మళ్లీ మళ్లీ రేపుతున్నావ్.”
“ కూల్ బ్రో … ఏదో ఒక రోజు నీ బైక్ బాగై, నువ్వు టైమ్‌కి ఆఫీస్‌కి వస్తావని కోరుకుంటున్నాను god bless you బ్రో.”
“అది అవదులే కానీ నా జీతం పెరగాలని కోరుకో బ్రో..
సరే, ఇంకో రెండు నిమిషాల్లో దిగుతా. నువ్వు నీ పని చూసుకో.”
“ఓకే బ్రో… త్వరగా రా. ఈరోజు మేనేజర్ మూడ్ కొంచెం తేడాగా ఉంది.”
అదేంటి? ఉదయాన్నే ఎవరి మీద కోపం చూపించాడు?”
“ఇంకా ఎవరి మీద చూపిస్తాడు? నిన్నటి రిపోర్ట్ గురించి నన్నే అడిగి నా మీద చూపించాడు”
“ ఓహో అయితే మార్నింగ్… మార్నింగ్ నే ఫ్రీ గా బ్రేక్ ఫాస్ట్ చేసేసావన్నమాట… అని నవ్వాడు…
“హా … చేశాను కానీ చాలా చండాలంగా ఉంది..
బ్రేక్ ఫాస్ట్” .
సరే నేను త్వరగా వచ్చేస్తాను కానీ ఈలోపు నా పేరు చెప్పి నన్ను ఇరికించకు.”
“నీ పేరు చెప్పకపోతే నా పని ఎలా స్టార్ట్ అవుతుంది బ్రో?”
“రేయ్ మళ్లీ ఏం పెంట పెట్టావ్ రా.. అన్నాడు
అనిరుద్.
“చిల్ బ్రో.”.. అని చెప్పి కార్తీక్
ఫోన్ పెట్టేస్తాడు.”
అనిరుధ్ నవ్వుకుంటూ కోతి ఫెల్లో అని ఫోన్ పెట్టేస్తాడు ….
Swipe left/right or tap the sides to turn pages