రణ్వీర్ ఫోన్ పెట్టిన తర్వాత అన్వికకు భూమి కదులుతున్నట్లు అనిపించింది. రణ్వీర్ ఎంతటి మొండివాడో, తన పంతం కోసం ఎంత దూరమైనా వెళ్తాడని ఆమెకు అర్థమైంది.
రేపు సాయంత్రం లోపు తన తండ్రి రణ్వీర్ ఇంటికి వెళ్లకపోతే, మళ్ళీ తన కుటుంబం రోడ్డున పడుతుంది.
అన్విక హాల్లోకి వచ్చేసరికి నానమ్మ అన్నపూర్ణమ్మ కుర్చీలో కూర్చుని రామకోటి రాసుకుంటోంది. శ్రీనివాసరావు గారు ఆఫీస్ నుంచి వచ్చి ప్రశాంతంగా పేపర్ చదువుతున్నారు.
వారం రోజుల క్రితం ఉన్న ఆ భయం ఇప్పుడు ఆ ఇంట్లో లేదు.అన్విక మెల్లగా నానమ్మ దగ్గరికి వెళ్లి కూర్చుంది.
ఏమ్మా అన్విక అలా ఉన్నావు? ముఖం వాడిపోయింది అంది అన్నపూర్ణమ్మ కళ్లద్దాలు సర్దుకుంటూ.
ఏమీ లేదు నానమ్మ ఒకవేళ రణ్వీర్ గారు మళ్ళీ మన ఇంటికి వస్తే నాన్న ఒప్పుకుంటారా అని మెల్లగా అడిగింది.
శ్రీనివాసరావు గారు పేపర్ పక్కన పెట్టి, వద్దు తల్లీ ఆయన మన స్థాయికి మించిన వాడు. ఆయన చుట్టూ ఉన్న గొడవలు మనకు వద్దు.