Oka bathuku – 4
ఒక బతుకు – మట్టిలో మిగిలిన జీవితాలు
నాన్న చెప్పిన మాట -2
2026 – రాత్రి
చింటూ మంచం మీద పడుకుని ఉన్నాడు. పక్కనే వెంకట్ కూర్చుని ఉన్నాడు.
చింటూ: నాన్నా…
వెంకట్: ఏంట్రా?
చింటూ: మీరు చిన్నప్పుడు తాతతో పాటు పొలానికి వెళ్లేవారా?
వెంకట్: వెళ్లేవాడిని రా. స్కూల్ అయిపోయాక అప్పుడప్పుడు తాత వెంట వెళ్లేవాడిని.
చింటూ: అప్పుడు మీకు చదువుకోవాలని ఉండేదా? లేక పొలానికి వెళ్లాలని ఉండేదా?
వెంకట్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు.
వెంకట్: చదువుకోవాలనే ఉండేది రా. కానీ మా ఇంటి పరిస్థితులు అలా ఉండేవి కాదు. ఒకరోజు తాతతో పాటు పొలానికి వెళ్లాను. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది.
చింటూ: ఏం జరిగింది నాన్నా?
వెంకట్: చెప్తాను విను…
—
1990 – తెల్లవారుజామున
రాజయ్య ఇంటి బయట కూర్చుని తన పాత చెప్పులు వేసుకుంటున్నాడు.
పద్మ: ఏవండీ, ఈరోజైనా పని దొరుకుతుందంటారా?
రాజయ్య: ఏమో పద్మా… నిన్న కూడా వెళ్లాను. పని లేదని పంపించేశారు. ఈరోజు ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం.
పద్మ: ఇంట్లో బియ్యం కూడా కొంచెమే ఉంది. పిల్లలకు మధ్యాహ్నం ఏం వండాలో అర్థం కావడం లేదు.
రాజయ్య: పని దొరికితే ఏదో ఒకటి తీసుకొస్తా. నువ్వేం కంగారు పడకు.
ఇంతలో వెంకట్ నిద్రలేచి బయటకు వచ్చాడు.
వెంకట్: నాన్నా, నేను కూడా నీతో వస్తా.
రాజయ్య: నువ్వెందుకురా? స్కూల్‌కి వెళ్లాలి కదా!
వెంకట్: ఈరోజు స్కూల్‌కి సెలవు నాన్నా. నీతో వస్తా.
రాజయ్య కొద్దిసేపు కొడుకు వైపు చూసి…
రాజయ్య: సరే, రా. కానీ అక్కడికి వెళ్లి నా దగ్గరే ఉండాలి.
—
పొలం – ఉదయం
రాజయ్య పొలంలో కూలి పని చేస్తున్నాడు. ఎండ అప్పుడే మొదలైంది. మిగతా కూలీలతో కలిసి కలుపు తీస్తున్నాడు.
వెంకట్ ఒక చెట్టు కింద కూర్చుని తండ్రిని చూస్తున్నాడు.
కొద్దిసేపటికి వెంకట్ దగ్గరికి వచ్చాడు.
వెంకట్: నాన్నా, ఇంకా ఎంతసేపు పని చేయాలి?
రాజయ్య: సాయంత్రం వరకు చేయాలి నాయనా. అప్పుడే కూలి ఇస్తారు.
వెంకట్: రోజంతా ఇంత కష్టపడితే ఎంత డబ్బులు ఇస్తారు?
రాజయ్య: ఇరవై రూపాయలు ఇస్తారు.
వెంకట్: అంతేనా నాన్నా?
రాజయ్య చిన్నగా నవ్వాడు.
రాజయ్య: మనకు అది కూడా పెద్ద డబ్బులే రా.
వెంకట్ ఏమీ మాట్లాడకుండా మళ్లీ చెట్టు కింద కూర్చున్నాడు.
సాయంత్రం పని పూర్తయింది. పొలం యజమాని రాజయ్య చేతిలో ఇరవై రూపాయలు పెట్టాడు.
రాజయ్య ఆ నోట్లను జాగ్రత్తగా మడిచి జేబులో పెట్టుకున్నాడు.
వెంకట్: నాన్నా, ఇప్పుడు ఇంటికి వెళ్దామా?
రాజయ్య: వెళ్దాం. దారిలో సరుకులు తీసుకెళ్లాలి.
—
గ్రామంలోని చిన్న కిరాణా కొట్టు – సాయంత్రం
రాజయ్య దుకాణం ముందు ఆగాడు.
రాజయ్య: అన్నా, కిలో బియ్యం ఇవ్వు. కొంచెం పప్పు, ఉప్పు, నూనె కూడా ఇవ్వు.
దుకాణదారుడు సరుకులు తూచి ఇచ్చాడు.
దుకాణదారుడు: ఇంకేమైనా కావాలా రాజయ్యా?
రాజయ్య: పిల్లలకు పెన్సిల్ కూడా ఇవ్వు. ఇంట్లో అయిపోయింది.
సరుకుల డబ్బులు లెక్కపెట్టిన తర్వాత రాజయ్య చేతిలో మిగిలిన డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి.
వెంకట్ అది గమనించాడు.
వెంకట్: నాన్నా, నీకు ఏమైనా కొనుక్కోవా?
రాజయ్య: నాకేం వద్దురా. ఇంట్లో పిల్లలు తింటే చాలు.
వెంకట్ తండ్రి వైపు చూశాడు. ఆ చిన్న వయసులో ఆ మాటల అర్థం పూర్తిగా తెలియకపోయినా, తండ్రి చేతిలో మిగిలిన డబ్బులు చూసి ఏదో బాధ కలిగింది.
—
ఇంటి దగ్గర – రాత్రి
పద్మ వంట చేస్తోంది. అనురాధ పుస్తకం తెరిచి చదువుకుంటోంది.
రాజయ్య సరుకులు ఇచ్చాడు.
పద్మ: ఈరోజు పని దొరికిందా?
రాజయ్య: దొరికింది. ఇరవై రూపాయలు ఇచ్చారు.
పద్మ: మంచిదైంది. రేపు కూడా దొరికితే బాగుండు.
వెంకట్ చేతులు కడుక్కుని లోపలికి వచ్చాడు.
అనురాధ: ఏంట్రా తమ్ముడూ, నాన్నతో పొలానికి వెళ్లావా?
వెంకట్: వెళ్లాను అక్కా. నాన్న రోజంతా పని చేశాడు.
అనురాధ: అలసిపోయావా?
వెంకట్: నేను కాదు అక్కా… నాన్న అలసిపోయాడు.
రాజయ్య ఆ మాట విని కొడుకు వైపు చూశాడు.
భోజనం చేసిన తర్వాత పిల్లలు పక్కకు వెళ్లారు. రాజయ్య, పద్మ ఇంటి ముందు కూర్చున్నారు.
పద్మ: పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల చదువుల సంగతి కూడా ఆలోచించాలి.
రాజయ్య: ఆలోచించక ఏం చేస్తాను పద్మా? కానీ పని లేని రోజులు ఎక్కువైపోతున్నాయి. తెచ్చిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు.
పద్మ: అప్పిచ్చిన వాళ్లు కూడా ఈరోజు మళ్లీ అడిగారు.
రాజయ్య: తెలుసు. ఏం చేయమంటావు? పని దొరికితే ముందు వాళ్ల అప్పు తీర్చాలి. ఇంట్లో సరుకులు కొనాలి. పిల్లలకు కావాల్సినవి చూడాలి.
పద్మ: అనురాధకు చదువంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి చేసి వాళ్ల చదువు ఆపకుండా చూడాలి.
రాజయ్య: నాకు కూడా అదే ఉంది. కానీ మన బతుకులు ఎక్కడికి తీసుకెళ్తాయో అర్థం కావడం లేదు.
వాళ్ల మాటలు లోపల ఉన్న అనురాధకు వినిపించాయి.
ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని మెల్లగా మూసింది.
—
మరుసటి రోజు – ఉదయం
అనురాధ పుస్తకాలు సర్దుకుంటోంది. వెంకట్ తన పలక తీసుకుని సిద్ధమవుతున్నాడు.
రాజయ్య బయటకు వెళ్లడానికి తయారవుతున్నాడు.
అనురాధ: నాన్నా…
రాజయ్య: ఏంటమ్మా?
అనురాధ: నిన్న మీరు అమ్మతో మాట్లాడింది విన్నాను.
రాజయ్య ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు.
అనురాధ: ఇంట్లో కష్టంగా ఉంటే నేను కూడా నీతో పొలానికి వస్తాను నాన్నా. పని చేస్తాను. కొంచెం డబ్బులు వస్తాయి కదా!
రాజయ్య: అదేంటమ్మా నువ్వు మాట్లాడేది?
అనురాధ: నువ్వు రోజంతా కష్టపడుతున్నావు కదా నాన్నా. నేను కూడా సాయం చేస్తాను.
రాజయ్య ఆమె దగ్గరికి వచ్చి తల మీద చేయి పెట్టాడు.
రాజయ్య: అమ్మా… నువ్వు నాకు సాయం చేయాలంటే బాగా చదువుకో. నేను మోసే బరువులు నువ్వు మోయాల్సిన అవసరం లేదు.
అనురాధ: కానీ నాన్నా…
రాజయ్య: మన ఇంట్లో కష్టాలు ఉన్నాయి. అది నిజమే. కానీ ఆ కష్టాల వల్ల మీ చదువు ఆగిపోవాలని నేను కోరుకోవడం లేదు.
అనురాధ ఏమీ మాట్లాడలేదు. తన పుస్తకాలు తీసుకుని వెంకట్‌తో కలిసి స్కూల్‌కి బయలుదేరింది.
రాజయ్య వాళ్లు వెళ్లే దారి వైపు చూస్తూ నిలబడ్డాడు.
—
కొన్ని రోజుల తర్వాత
ఆ రోజు కూడా రాజయ్యకు పని దొరకలేదు.
మరుసటి రోజు సగం రోజు మాత్రమే పని దొరికింది. ఇంకో రోజు అసలు పని లేదు.
ఇంట్లో సరుకులు తగ్గిపోయాయి. అప్పిచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి డబ్బులు అడిగాడు.
అప్పిచ్చిన వ్యక్తి: రాజయ్యా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? చాలా రోజులైంది.
రాజయ్య: పని దొరకగానే ఇస్తానన్నా. ఈ మధ్య పని సరిగా దొరకడం లేదు.
అప్పిచ్చిన వ్యక్తి: నాకు కూడా అవసరాలున్నాయి. త్వరగా చూడు.
అతను వెళ్లిపోయాడు.
పద్మ మౌనంగా నిలబడింది.
పద్మ: ఏవండీ, ఇంకా ఎన్నాళ్లు ఇలా?
రాజయ్య: ఏమో పద్మా… రేపు పని దొరికితే ఏదో ఒకటి చూద్దాం.
ఆ మాటలు చెప్పినా రాజయ్య మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి.
—
2026 – రాత్రి
వెంకట్ కథ చెబుతుండగా చింటూ శ్రద్ధగా వింటున్నాడు.
చింటూ: నాన్నా, తాతకు రోజూ పని దొరికేది కాదా?
వెంకట్: లేదు రా. పని దొరికిన రోజే ఇంట్లోకి డబ్బులు వచ్చేవి. పని లేకపోతే ఆ రోజు ఇంట్లో ఖర్చులకు కూడా ఇబ్బందే.
చింటూ: మరి నువ్వు బాగా చదువుకున్నావా నాన్నా?
వెంకట్ చిన్నగా నవ్వాడు.
వెంకట్: చదువుకోవాలని చాలా ఉండేది రా. కానీ మా ఇంట్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండేవి కావు.
చింటూ: మరి అనురాధ అత్త చదువు సంగతేంటి నాన్నా? తను కూడా చదువుకోవాలనుకుంది కదా?
వెంకట్ ముఖంలో ఒక్కసారిగా ఆలోచన కనిపించింది.
వెంకట్: అవును రా… మీ అత్తకు కూడా చదువంటే చాలా ఇష్టం.
చింటూ: మరి తను చదువు కొనసాగించిందా?
వెంకట్ వెంటనే సమాధానం చెప్పలేదు.
కొద్దిసేపు మౌనంగా ఉండి…
వెంకట్: ఆ తర్వాత మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన మా అందరి జీవితాలను మార్చేసింది. ఆ విషయం నీకు తర్వాత చెప్తాను.
చింటూ: ఇప్పుడే చెప్పు నాన్నా!
వెంకట్: రేపు చెప్తానురా. ఇప్పుడు పడుకో.
చింటూ నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కానీ వెంకట్ మాత్రం తన తండ్రి రాజయ్య కష్టాన్ని, అక్క అనురాధ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ చాలాసేపు మేల్కొనే ఉన్నాడు.
కొనసాగుతుంది…
Swipe left/right or tap the sides to turn pages