సమయం ఎవరి కోసం ఆగదు అన్నట్టుగా తూరుపు దిక్కున భానుడు ఎర్రటి బింబముల నేను వచ్చేసాను. అందరు లేచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అవండి అన్నట్టుగా తన కిరణాలని పుడమి అంత ప్రసరింప చేస్తారు..
సూర్యుడు రాక ముందే లేచిన శాంతి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి, ముగ్గు పెట్టి ఇంట్లోకి వచ్చే లోపే ప్రతిమ నిద్ర లేచి వంటింట్లోకి వెళ్తూ కనిపిస్తుంది..
ఎప్పుడు తను వెళ్లి నిద్ర లేపితే కానీ లేవని కూతురు ఇవాళ తనకి తానుగా అది కూడా అంత ఉదయాన్నే లేచి రావడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతుంది…
ఆ ఆశ్చర్యం తోనే ముగ్గు గిన్నెని తీసుకుని ఇంట్లోకి వెళ్లి తన చేతిలో వున్న ముగ్గు గిన్నె పక్కన పెట్టేసి వంటింట్లోకి వెళ్లి చేతులు కడుక్కుంటూ రాత్రి ఆమె మాట్లాడిన మాటలకి కూతురు మీద ఇంకా కోపం అలానే వున్న ఆమె ఎప్పుడు లేనిది అంత ఉదయాన్నే ఎందుకు లేచిందో తెలుసుకోవాలి అనిపిస్తుంది శాంతి గారికి..
అందుకే తన కోపాన్ని వదిలేసి ఫ్రిడ్జ్ లో నుండి పాల పాకెట్ తీసుకుని వస్తున్న కూతురు వంకే చూస్తు ఏంటి ప్రతిమ ఈరోజు ఇంత ఉదయాన్నే లేచావు..
నువ్వు ఎప్పుడు ఇంత ఉదయాన్నే లేవవు కదా… రోజు నేను వచ్చి లేపితే కాని మెలుకువ రాని నువ్వు ఈరోజు అప్పుడే లేచి వంటింట్లోకి వచ్చావు..