New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 2

కలియుగ మ(మా)యసభ – 2

గదిలోకి వెళ్లిన పెద్దావిడ మనవరాలిని ప్రేమగా చూసి చేతులు చుట్టూ తిప్పి మొటికలు విరిచి..” నా దిష్టే తగిలేలా ఉంది నా బంగారు తల్లికి.” అని మురిసిపోయింది.

ఆవిడని చూస్తూ..”అత్తయ్య.. కస్తూరి,శైలు ఏరి.” అని అడిగింది నవ్వుతూ కౌసల్య.
“హాల్లో ఉన్నారు… కానీ..! అమ్మాయ్ నీతో ఓ మాట చెప్పాలి,నువ్వు నా కోడలి అక్కవి కాబట్టి నిన్ను 30 సంవత్సరాల క్రితం నుంచి చూస్తున్నాను కాబట్టే ఈ మాట చెప్తున్నాను.
 11 సంవత్సరాలు దాటింది నీ కూతురికి పెళ్లి అయ్యి ఇప్పటికి తనకి తల్లి అయ్యే యోగం కలగలేదు..ఇప్పుడు నా మనవరాలికి శ్రీమంతం చేస్తున్నారు తల్లి కాలేని నీ కూతురు నీడ నా మనవరాలు మీద పడితే అరిష్టం జరుగుతుంది.
 పెళ్లయిన నెలకే తల్లి అయినా నా మనవరాలికి ఏలాంటి అరిష్టం జరిగినా నేను తట్టుకోలేను… లక్ష్మీ అందరి దగ్గర ఉంటుంది సంతాన లక్ష్మి కొందరి దగ్గరే ఉంటుంది.
 కాబట్టి నీ కూతుర్ని నా మనవరాలు ఉన్నని రోజులు కొంచెం దూరంగా ఉండమని చెప్పు..’ అని కటువుగా చెప్పి మనవరాలు వైపు చూసి ప్రేమగా..’లహరి సమయం చాలా అవుతుంది,వర్జ్యం వచ్చే సమయం అవుతుంది నువ్వు ఆకు కాయ తీసుకొని హాల్లోకి రా ముత్తైదువులు అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు.” అని అంది చిరునవ్వుతో ఆ పెద్దావిడ మనవరాలిని చూసుకొని.
“వస్తాను కానీ నానమ్మ అక్కని అలా అనకు.” అని అంది మనసు చిన్న బుచ్చుకొని లహరి.
“ఈ సంతోష సమయంలో నువ్వు ఆలోచించాల్సింది దాని గురించి కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి.’ అని చిరుకోపంగా లహరికి చెప్పి తన పక్కన ఉన్న ముత్తైదుల వైపు చూసి..’అమ్మాయిని తీసుకొని తొందరగా రండి.” అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ పెద్దావిడ.
లహరి బాధగా ఉన్న కౌసల్య ముఖం చూసి.. “నానమ్మ మాటలు పట్టించుకోకండి పెద్దమ్మ.” అని అంది ఇబ్బందిగా మొఖం పెట్టి.
రాని నవ్వుని ముఖం మీద పులిముకొని.. “నేను పట్టించుకోలేదులే లహరి నువ్వు సంతోషంగా శ్రీమంతం చేయించుకో.. అత్తయ్య చెప్పినట్టు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు.” అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది,నా దగ్గరే ఇన్ని మాట అంది అంటే ఆల్రెడీ శైలుని ఇంకెన్ని అందో అత్తయ్య..అది ఎక్కడ ఏడుస్తుందో అని గాబరా పడుతూ కౌసల్య.
లహరిని ముత్తైదువులు తీసుకువచ్చి అందంగా అలంకరించిన మహారాజా చైర్లో కూర్చోబెట్టారు.
అందరూ సంతోషంగా ఆశీర్వదించి లహరికి గాజులు వేసి ఎవరు తీసుకువచ్చిన గిఫ్టులు వాళ్ళు ఇస్తూ చీరలు పెట్టారు ఆప్యాయంగా పలకరిస్తూ.
కౌసల్య కస్తూరి దగ్గరకి వచ్చి..”శైలు ఎక్కడే..?” అని అడిగింది కంగారుగా.
“పూజ గదిలో పూజ చేస్తుంది అక్క.” అని అంది కస్తూరి కౌసల్య చేతికి తాంబూలాలు ఉన్న పళ్లెం అందిస్తూ.
“అత్తయ్య దానిని ఏమైనా అందా…!” అని అడిగింది అనుమానంగా కస్తూరి వైపు చూస్తూ కౌసల్య.
“అత్తయ్య నిన్ను ఏమైనా అందా..?” అని అడిగింది కౌసల్య అడిగినదానికి అనుమానంగా కస్తూరి.
“హుమ్మ్..” అని అంది విచారంగా తల కిందకి దించుకొని కౌసల్య.
“పెద్దావిడ ఏదో చాదస్తంతో ఏదో అనేస్తూ ఉంటుంది నువ్వు ఆ మాటలు పట్టించుకోకు అక్క.” అని అంది బాధగా కౌసల్యని చూస్తూ కస్తూరి.
“చాదస్తం కాదే ఆవిడ నమ్మకాలు అవి.. వదిలేయ్.” అని అంది అప్పటికే చాలాసార్లు విన్న మాటనే ఇప్పుడు కూడా వినడంతో పెద్దగా స్పందించకుండా కౌసల్య.
“శైలుని కూడా అంది.. అందుకే దైవారాధనలో ఉంటే తన మనసు కుదుటపడుతుంది అని పూజ గదిలోకి పంపించాను.” అని అంది దిగులుగా కస్తూరి.
“ఆ దేవుడు దాని తలరాతని ఎందుకు అలా రాశాడో..!” అని అంది పూజ గది వైపు చూస్తూ కౌసల్య.
“మనం ఒక ట్రైన్ ఎక్కితే కొంతమంది దిగే ప్లాట్ ఫాం కొంత దూరం వెళ్ళగానే వస్తుంది, ఇంకొంతమంది దిగే ప్లాట్ ఫాం కొంచెం టైం తీసుకుంటుంది,ఇంకొంతమంది దిగే ప్లాట్ ఫాం లాస్ట్ స్టేజ్ అయి ఉంటుంది.
 అంతమాత్రాన లాస్ట్ స్టేజ్ వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో దిగే వాళ్ళని చూసి అయ్యో నా డెస్టీనేషన్ ఎందుకు అంత లాంగ్ ఉంది అనుకుంటే ఎలా అక్క…?
 దేవుడు రాసింది ఏంటో మనకి ముందే తెలుసా..! ఏమో ఇంకో రెండు సంవత్సరాలు అయితే శైలుకి పిల్లలు పుడతారేమో…! లహరి కంటే ఆరోగ్యమైన తెలివైన పిల్లలు పుడతారేమో అలా ఎందుకు ఆలోచించుకోరు.
 అత్తయ్య అంటే అర్థం చేసుకోలేదు అనుకోవచ్చు నువ్వు కూడా ఏంటి అక్క..! నువ్వే ఇలా బాధపడితే పాపం శైలు పరిస్థితి ఏంటి చెప్పు..?మనమే తనకి ధైర్యం చెప్పాలి.
భగవంతుడు,వైద్యుడు ఇవ్వలేని ధైర్యం.. ఆత్మవిశ్వాసం,ఆరోగ్యం మంచి మాట ఇస్తుంది అక్క.
తన దగ్గర ఆ మంచి మాట మనమే మాట్లాడకపోతే ఎలా చెప్పు..?” అని అంది కస్తూరి కౌసల్య చేతిని తన చేతిలోకి తీసుకొని.
ఇక ఉంటాను 
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️