New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 3

కలియుగ మ(మా)యసభ – 3

భగవంతుడు,వైద్యుడు ఇవ్వలేని ధైర్యం.. ఆత్మవిశ్వాసం,ఆరోగ్యం మంచి మాట ఇస్తుంది అక్క.

తన దగ్గర ఆ మంచి మాట మనమే మాట్లాడకపోతే ఎలా చెప్పు..?” అని అంది కస్తూరి కౌసల్య చేతిని తన చేతిలోకి తీసుకొని.
“ఏమోనే… శైలు లహరి శ్రీమంతం కోసమని వస్తుంటే వాళ్ళ అత్తగారు కూడా శ్రీమంతులకి వెళ్లడమేనా నువ్వు ఏమైనా చేసుకునేది ఉందా…? అని అందంట.
 కిందటి నెల నీకు పిల్లలు పుట్టరు నా కొడుకుకి ఇంకో పెళ్లి చేస్తా అని కూడా ఉందంట.
 నిజానికి వాళ్ళ అత్త మామ అందరూ మంచివాళ్లేనే దీనికే పిల్లలు పుట్టలేదు అనే వాళ్ళ బాధ… వాళ్ళ బాధలో కూడా నిజం ఉంది కదా వాళ్లకి కూడా మానవసంతానంతో ఆడుకోవాలి అని ఉంటుందిగా,తన కొడుకుకి పిల్లలు ఉండాలి అని ఉంటుందిగా.
 నేను శైలుని కూడా ఏమీ అనలేకపోతున్నాను.. పాపం తను కూడా ఏం చేస్తుంది ఇప్పటికే హాస్పటల్ల చుట్టూ గుళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంది పిల్లల కోసం.” అని అంది కన్నీళ్లు కొంగుతో తుడుచుకుంటూ కౌసల్య.
“దానిని బయట వాళ్ళు అని ఇంట్లో వాళ్ళు అంటే పాపం ఎలా తట్టుకుంటుందే.. పిల్లలు కలగకపోవడం తన తప్ప.
 అయినా వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందింది.. చూద్దాం ఏదో ఒక మంచి హాస్పటల్ దొరకకపోదా..? హస్తవాస్తి ఉన్న డాక్టర్ దొరకకపోతుందా..!” అని అంది కౌసల్య మనసులో నమ్మకాన్ని నింపుతూ కస్తూరి.
“హుమ్మ్..” అని అంది కౌసల్య.
“కస్తూరి,కౌసల్య మీరు కూడా వచ్చి అక్షింతలు వేయండి.” అని అన్నారు అక్కడ ఉన్న పెద్దవారు.
వాళ్ల మనసులో బాధని పక్కకు పెట్టి లహరి నిండైన ముఖాన్ని చూసి అక్షింతలు వేయడానికి వచ్చారు ఆ అక్క చెల్లెలు.
కస్తూరి,కౌసల్య భర్తలతో కలిసి లహరికి కుంకుమ పెట్టి,గంధం పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించారు మనస్ఫూర్తిగా.
పెద్దనాన్నని నాన్నని ఆనందంగా చూసి పెద్దమ్మ వైపు అమ్మ వైపు చూస్తూ.. “శైలు అక్కని కూడా వచ్చి అక్షింతలు వెయ్యమనండి.” అని అంది చిరునవ్వుతో లహరి.
“పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకున్నట్టు శ్రీమంతం చేయించుకుంటూ పిల్లలే కనలేని గొడ్డుమోతుతో అక్షింతలు వేయించుకోవడం ఏంటే…! మతి తప్పిందా నీకు..?” అని అంది లహరి నానమ్మ ఆవేశంగా.
కౌసల్య కౌసల్య భర్త అయినటువంటి రఘురామయ్య బాధగా చూసారు ఆ పెద్దావిడ వైపు.
కస్తూరి,కస్తూరి భర్త సాంబశివయ్య కంగారుగా ఆ పెద్దావిడ వైపు చూశారు.
లహరి అత్తయ్య గారు లహరి నానమ్మకి వంత పాడుతూ.. “మీ నానమ్మ పెద్దావిడ ఆవిడ చెప్పింది కూడా నిజమే లహరి.. నువ్వు మీ నానమ్మ చెప్పినట్టు విను.” అని అంది.
వియ్యాల వారు కూడా ఆ మాట మాట్లాడేసరికి ఎవరు కూడా ఏమీ అనలేకపోయారు.
 పూజగది బయటకి వచ్చి నిలబడిన శైలు ఈ మాటలు అన్నీ విని కన్నీళ్ళతో అక్కడ నుంచి వెనక డోర్ నుంచి పక్కనే ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది.. అక్కడ నిలబడాలి అంటే నరకంలా అనిపిస్తూ ఉండగా.
ఆరున్నర అడుగులు ఉన్న పోలీసు బట్టలతోపాటు హుందాగా కనిపిస్తున్న వ్యక్తి వైపు అభిమానంగా చూస్తూ.. “ఫస్ట్ కేసే డ్రగ్ డీలర్స్ ని పట్టుకొని సక్సెస్ అయ్యావు శౌర్య.” అని నవ్వాడు డి జి పి ప్రతాప్.
“థాంక్యూ సార్..” అని అన్నాడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వాయిస్ లో శౌర్య.
“ఇలాగే నీ విజయ యాత్ర కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని అప్రిషియేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు డి జి పి ప్రతాప్.
కేస్ కి సంబంధించిన ఫైల్ ఒకసారి చెక్ చేసి.. డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనే దానిమీద కాసేపు తన కింది స్థాయి సిబ్బందికి చెప్పి ఇంటికి బయలుదేరాడు శౌర్య సంతోషాన్ని తన కుటుంబంతో పంచుకోవడానికి.
లహరి శ్రీమంతం పూర్తి అయిన తర్వాత చెల్లెలు కుటుంబాన్ని బాధపెట్టలేక తిన్నాము అంటే తిన్నాము అన్నట్టుగా తిని కౌసల్య కస్తూరికి,లహరికి అందరికీ వెళ్లి వస్తాము అని చెప్పి భర్తతో అక్కడ నుంచి తమ ఇంటి వైపు అడుగులు వేసింది.. తల్లిగా తన కూతురు బాధని ఎలా తీర్చాలో తెలియక.
కౌసల్య రఘురామయ్య ఇంటికి వచ్చేసరికి గార్డెన్ లో ఉన్న గులాబీ చెట్ల మధ్యన కూర్చోని దీనంగా తులసి కోట వైపు చూస్తూ ఉంది శైలు.
శైలు పక్కన వచ్చి కూర్చొని.. “భోజనాల దగ్గర నువ్వు కనిపించలేదు ఏంటి..!” అని అడిగింది నార్మల్ వాయిస్ లో కౌసల్య.
“నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో గేదెలు ఉండేవి కదా అమ్మ..?” అని అంది చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని తల్లిని చూస్తూ శైలు.
“హ.. ఉండేవి.. కానీ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి..? భోజనాల దగ్గర నువ్వు కనిపించలేదు అంటే నువ్వు భోజనం చేయలేదా..!” అని అంది శైలు ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న బాధని గమనిస్తూ కౌసల్య.
ఇక ఉంటాను 
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️