New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 4

కలియుగ మ(మా)యసభ – 4

“నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో గేదెలు ఉండేవి కదా అమ్మ..?” అని అంది చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని తల్లిని చూస్తూ శైలు.

 

 

“హ.. ఉండేవి.. కానీ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి..? భోజనాల దగ్గర నువ్వు కనిపించలేదు అంటే నువ్వు భోజనం చేయలేదా..!” అని అంది శైలు ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న బాధని గమనిస్తూ కౌసల్య.

 

 

“తాతయ్య కొన్ని గేదెలకి తౌడు,పిండి వేసి కుడితి పెడుతుంటే మిగిలిన వాటికి ఉట్టి నీళ్ళు పెడుతుంటే తమ్ముడు తాతయ్యని అడిగాడు అమ్మ,కొన్నిటికి మంచి నీళ్లు పెడుతూ కొన్నిటికి ఏవేవో కలిపి పెడుతున్నావు ఎందుకు తాతయ్య..? అన్నిటికి ఒకటే రకం నీళ్ళు పెట్టొచ్చు కదా అని..

 

 అప్పుడు తాతయ్య ఏమన్నాడో తెలుసా అమ్మ…! ఆ గేదెలు దూడలకి మనకి పాలు ఇస్తున్నాయి రా…ఇంకా పాలు ఎక్కువగా రావాలి దాన్ని దూడ,అది,మనం బాగుండాలి అని వీటికి తౌడు,పిండి వేసి నీళ్లు పెడుతున్నాను..అలాగే పచ్చిగడ్డి కూడా వేస్తున్నాను.

 

 అదే ఈ గేదెలు ఇనలేదు,కనీసం (ప్రెగ్నెంట్ కాదు)కట్టలేదు అందుకే వీటికి ఉట్టి నీళ్లు ఎండు గడ్డి సరిపోతాయి అని అవే పెడుతున్నాను అని అన్నాడు.

 

 

మరి ఇప్పుడు నేను కూడా కడుపుతో లేను, పిల్లల్ని కనలేదు ఇప్పుడు నేను తింటే ఎంత తినకపోతే ఎంత అమ్మ… అందుకే అన్నం సహించలేదు.” అని అంది మోకాళ్ల మీద తల ఆనించుకొని కన్నీళ్లు కారుస్తూ శైలు.

 

 

 

అప్పటికే తల్లి మనసు ఎవరో చెయ్యి పెట్టి పిసుకుతున్నట్టుగా అవుతుంటే కూతురు ముందు ధైర్యంగా ఉండలేక,అలా అని కూతురు ముందు ఏడ్చి తనని ఇంకా బాధ పెట్టలేక అక్కడనుంచి లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది కళ్ళు తుడుచుకుంటూ కౌసల్య.

 

 

 

అప్పటికే లహరి శ్రీమంతంలో మరదలి అత్తయ్య గారు అన్న మాటలకి గాయపడిన మనసు,కూతురు బాధ మాటల రూపంలో వింటుంటే ఆ గాయం మీద ఎవరో పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్టుగా అనిపించింది రఘు రామయ్య గారికి.

 

కన్నీళ్ళని కంటి గట్టు దాటి బయటకి రానివ్వకుండా కూతురు పక్కన కూర్చోని.. “మనుషులే పశువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో గర్భగుడిలో దేవతతో సమానమైన ఆడదానివి నువ్వు పశువులతో పోల్చుకోవడం ఏంటి రా…!

 

 చదువుకున్నావు,నీకు లోకజ్ఞానం తెలుసు.. 

 

 

 కొన్ని వేల కణాలు పోటీపడి మరి గర్భాశయంలోకి వెళ్లి చచ్చి మళ్లీ బ్రతికి,తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు కూడా చావు అంచుల వరకు వెళ్లి వస్తుంది బిడ్డ.

 

తల్లితో పాటు బిడ్డ కూడా అన్ని అనుభవించిన తర్వాతే ఈ ప్రపంచాన్ని చూసి,ఇక్కడ మానసికంగా బాధపడుతూ ఎదుగుతూ ఉంటాము..

 

 తల్లి గర్భంలో నుంచే ఒక యుద్ధం చేసి వస్తాము మనము..అన్ని చూసి వచ్చిన మనకి ఈ కష్టం ఒక లెక్కన…?” అని అన్నాడు కూతురు తలనిమురుతూ.

 

 

 

“తల్లి అవ్వాలి అని నాకు మాత్రం ఉండదా నాన్న,ఒక బిడ్డతో అమ్మ అని పిలిపించుకునే అనుభూతిని పొందాలి అని నాకు మాత్రం ఉండదా…! నా మనసులో బాధని ఎవరు అర్థం చేసుకోరు ఎందుకు నాన్న..?

 

 ఇంట్లో మనుషులు అలాగే ప్రవర్తిస్తారు, బయట వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు..” అని అంది రఘురామయ్య గుండెల మీద తలవాల్చి ఏడుస్తూ శైలు.

 

 

 

“నీకు ఒక కథ చెప్పనా…! అని అన్నాడు రఘురామయ్య కూతురు కన్నీళ్లు తుడుస్తూ.

 

 

“హుమ్మ్..” అని అంది తండ్రి మాటలు వింటే మనసు కాస్త శాంతిస్తుంది అని ఆలోచిస్తూ శైలు.

 

 

 

అప్పటికే వీళ్ళ మాటలు విన్న కాకి బట్టల్లో ఉన్న శౌర్య తల్లి గదిలోకి వెళ్లి తల్లి కన్నీళ్లు తుడిచి బయటకి తీసుకువచ్చి రఘురామయ్యగారి వెనక ఉన్న సోఫాలో తల్లిని కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు.

 

 

శౌర్య వచ్చింది తెలియని రఘురామయ్య కూతురిని మంచిగా కూర్చోబెట్టి ఆమె కళ్ళల్లోకి చూస్తూ..”ఒక మధ్య వయసు ఉన్న స్త్రీ దారిన నడుచుకుంటూ వెళుతూ ఉంది.. తనకి మొదటిగా కనిపించింది వరదలకి గాలికి సగం విరిగిన చెట్టు..

 

 

ఆ సగం విరిగిన చెట్టుని చూస్తూ… శుభమా అంటూ నా కొడుకుకి అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్న ఇది ఏంటి మోడు చెట్టు ఎదురుగా కనిపించింది అని నిష్టూరంగా అనుకొని కాసేపు అక్కడ కూర్చొని తను తీసుకువచ్చిన డబ్బాలోవి కాసిన్ని నీళ్లు తాగి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది.

 

 

అలా వెళ్తున్నా ఆమెకి ఇంకొంచెం ప్రయాణం తర్వాత గెలలతో నిండుగా ఉన్న అరటి చెట్టు కనిపించింది..

 

 

ఆరటి చెట్టుని చూస్తూ.. అయ్యో శుభకార్యం కోసం వెళ్తుంటే ఒకటే కాపు కాసే అరటి చెట్టు కనిపించింది ఏంటి..! ఒంటికన్ను ఉన్న మనిషి,ఒక బిడ్డ ఉన్న తల్లి,ఒకటే కాపు కాసే అరటి చెట్టు ఆ శుభం కదా…! అని నిష్ఠూరంగా అనుకొని అక్కడే కూర్చుని మళ్లీ డబ్బాలో ఉన్న కాసిన్ని నీళ్లు తాగి కాసేపటికి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది.

 

 

 

 

 

 

ఇక ఉంటాను 

మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️