New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
తొలిప్రేమ – 4

తొలిప్రేమ – 4

“వదినా… ఇప్పుడు మీరు చెప్పండి!”

 

అంటూ పెళ్లికూతురైన సంయుక్త వైపు చూస్తూ అడిగింది మధు.

 

ఇప్పటికే అందరి మధ్యలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్న సంయుక్త, మధు అడిగిన ప్రశ్నకు మరింత బిడియపడింది. అయినా తప్పదన్నట్టుగా గొంతు సవరించుకుని,

 

“నేను… మా శ్రీవారు కలిసి వచ్చాము. ఇంట్లోకి రానివ్వండి.”

 

అంటూ తల వంచుకుని చెప్పింది.

 

ఆమె నోటి నుంచి ‘మా శ్రీవారు’ అన్న మాట వినగానే మధు ముఖంలో అల్లరి నవ్వు విరిసింది.

 

“శ్రీవారు అని కాదు వదినా… మా అన్నయ్య పేరు చెప్పండి!”

 

అంటూ పట్టుబట్టింది.

 

సంయుక్త మాత్రం చెప్పలేనన్నట్టుగా తల అడ్డంగా ఊపింది.

 

“అబ్బా! అలా కుదరదు వదినా. మీరు మా అన్నయ్య పేరు చెప్పాల్సిందే!”

 

అంటూ మధు కరాఖండిగా చెప్పడంతో సంయుక్త మనసులోనే కాస్త కంగారు పడింది.

 

‘అయ్యో! ఈ అమ్మాయి ఏంటి? నేను పేరు చెప్పే వరకు వదిలేలా లేదు. అసలు నాకు మీ అన్నయ్య పేరు తెలిస్తే కదా చెప్పడానికి! ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి?’

 

అని మనసులోనే అనుకుంటూ మధు వైపు చూసింది.

 

ఆమె మొహమాటాన్ని గమనించిన నిర్మలగారు వెంటనే కల్పించుకున్నారు.

 

“మధూ… ఇప్పుడు తను పేరు చెప్పడానికి మొహమాటపడుతున్నట్టుంది. ముందు వాళ్లిద్దరినీ ఇంట్లోకి రానివ్వు.”

 

అన్నారు కూతురిని మందలిస్తున్నట్టుగా.

 

“సరే అమ్మా! నువ్వు చెప్పావు కాబట్టి ప్రస్తుతానికి వదినని వదిలేస్తున్నాను. కానీ అన్నయ్యా… నా కట్నం మాత్రం ఇవ్వాల్సిందే!”

 

అంటూ ఒక్కసారిగా తన చేతిని సిద్ధార్థ్ ముందుకు చాపింది మధు.

 

చెల్లెలి అల్లరికి సిద్ధార్థ్ పెదవులపై చిన్న నవ్వు కదిలింది.

 

ఏమీ మాట్లాడకుండా తన షేర్వాణీలో నుంచి కొంత డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టాడు.

 

“హ్యాపీనా ఇప్పుడు?”

 

అని అడిగాడు.

 

“లేదు!”

 

అంటూ డబ్బును చేతిలో పట్టుకున్న మధు సమాధానం చెప్పడంతో సిద్ధార్థ్ కనుబొమ్మలు కాస్త పైకెత్తాడు.

 

“మరేంటి ఇంకా?”

 

“ముందు మీరు ఇద్దరూ ఇంట్లోకి కుడికాలు పెట్టి రండి. అప్పుడే నేను హ్యాపీ!”

 

అంటూ నవ్వేసింది మధు.

 

ఆమె మాటలకు సంయుక్త సిగ్గుగా నవ్వుకుంటూ సిద్ధార్థ్ వైపు చూసింది. అతడు మాత్రం మధు చెప్పినట్టుగానే కాస్త ముందుకు కదిలాడు.

 

ఇద్దరూ కలిసి ఇంటి గడప దగ్గరకు చేరుకున్నారు.

 

సంప్రదాయం ప్రకారం సంయుక్త, సిద్ధార్థ్ ఇద్దరూ కుడికాలు ముందుగా పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టారు.

 

వాళ్లు లోపలికి అడుగుపెట్టగానే మధు ఒక్కసారిగా ముందుకు వచ్చి అన్నావదినలిద్దరినీ గట్టిగా హత్తుకుంది.

 

“ఇప్పుడు హ్యాపీ రా అన్నయ్యా!”

 

అంటూ ఆనందంగా అంది.

 

అన్నయ్య పెళ్లి చేసుకుని ఇంటికి రావాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ అమ్మాయికి, తన అన్నయ్య పక్కన కొత్తగా వచ్చిన వదినను చూడటం ఎంతో సంతోషంగా ఉంది.

 

వాళ్లిద్దరినీ అలా చూస్తున్న నిర్మలగారి ముఖంలోనూ సంతృప్తితో కూడిన చిరునవ్వు కనిపించింది.

 

తన కొడుకు జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చిందనే సంతోషం ఒకవైపు ఉంటే, ఇకపై తమ ఇంట్లో మరో ఆడపిల్ల సందడి ఉండబోతోందనే ఆనందం మరోవైపు!

 

కాసేపటికి మధు తన కౌగిలిని సడలించి అన్నావదినల నుంచి దూరంగా జరిగింది.

 

—

 

“సిద్ధూ… సంయూ… మీరు ఇద్దరూ నాతో పాటు రండి.”

 

అంటూ నిర్మలగారు వారిని దేవుడి గది వైపు తీసుకెళ్లారు.

 

దేవుడి గది దగ్గరకు చేరుకున్నాక ఇద్దరి వైపు తిరిగి,

 

“మీరిద్దరూ దేవుడికి దండం పెట్టుకుని రండి. సంయూ, అమ్మా… నువ్వు దీపం వెలిగించు.”

 

అంటూ ఆప్యాయంగా చెప్పారు.

 

నిర్మలగారి మాటలకు సిద్ధార్థ్, సంయుక్త ఇద్దరూ దేవుడి గదిలోకి కుడికాలు పెట్టి కలిసి అడుగుపెట్టారు.

 

వాళ్లిద్దరూ లోపలికి వెళ్లిన తర్వాత నిర్మలగారు, మధు బయటే నిలబడి చూస్తున్నారు.

 

ముందుగా సిద్ధార్థ్ దేవుడికి నమస్కరించుకున్నాడు. ఆ తర్వాత సంయుక్త కూడా చేతులు జోడించి భక్తితో దండం పెట్టుకుంది.

 

“సంయూ… దీపం వెలిగించమ్మా.”

 

అంటూ నిర్మలగారు మరోసారి గుర్తుచేశారు.

 

అయితే ఆమె చూపులు మాత్రం సిద్ధార్థ్ బయటకు రావడం కోసం ఎదురుచూస్తున్నాయి. అతడు బయటకు వెళ్లకుండా కాసేపు అక్కడే ఉండేలా చూసుకుంటున్నారు.

 

సంయుక్త దీపం వెలిగించిన తర్వాత,

 

“సరే… మీరిద్దరూ కలిసి రండి.”

 

అని చెప్పారు.

 

దాంతో ఇద్దరూ దేవుడి గది నుంచి బయటకు వచ్చారు.

 

—

 

“మీ ఇద్దరూ బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోండి.”

 

అంటూ నిర్మలగారు వారిని చూసి చెప్పారు.

 

ఆ తర్వాత మధు వైపు తిరిగి,

 

“మధూ… వదినని నీ రూమ్‌కి తీసుకెళ్లు.”

 

అన్నారు.

 

“అలాగే అమ్మా!”

 

అంటూ సమాధానం చెప్పిన మధు, వెంటనే సంయుక్త దగ్గరకు వెళ్లింది.

 

“రండి వదినా… నా రూమ్‌కి వెళ్దాం.”

 

అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా సంయుక్త చేతిని పట్టుకుని తన గదివైపు తీసుకెళ్లింది.

 

అప్పటివరకు కొత్త ఇంట్లో అందరినీ చూస్తూ కాస్త బిడియంగా ఉన్న సంయుక్తకు మధు చూపిస్తున్న చొరవ కొంత ఊరటనిచ్చింది.

 

వాళ్లిద్దరూ అలా వెళ్లిపోతుండగా సిద్ధార్థ్ నిర్మలగారి వైపు తిరిగి,

 

“అమ్మా… నేను కూడా నా రూమ్‌కి వెళ్తాను.”

 

అన్నాడు.

 

“సరే సిద్ధూ… వెళ్లిరా.”

 

అని నిర్మలగారు అనడంతో అతడు తన గదివైపు వెళ్లిపోయాడు.

 

—

 

మధు తన గదిలోకి సంయుక్తను తీసుకొచ్చి అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టింది.

 

తనూ పక్కనే కూర్చుంటూ కాసేపు వదిన ముఖంలోకి చూసింది.

 

తర్వాత గుర్తొచ్చినట్టుగా,

 

“వదినా… ఇప్పుడొక విషయం చెప్పండి.”

 

అంది.

 

సంయుక్త ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది.

 

“అదే వదినా… కాసేపటి క్రితం నేను మా అన్నయ్య పేరు చెప్పమంటే ఎందుకు చెప్పలేదు?”

 

అంటూ అడిగింది.

 

ఆ ప్రశ్నకు సంయుక్త కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టింది.

 

‘ఇప్పుడు ఏం చెప్పాలి? అసలు తన అన్నయ్య పేరు నాకు తెలియదని చెబితే ఏమనుకుంటుందో! పెళ్లికి ముందు కనీసం ఒక్కసారి కూడా కలవలేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ విషయం తెలిస్తే ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో!’

 

అని మనసులోనే అనుకుంది.

 

అయినా ఏదో ఒక సమాధానం చెప్పక తప్పదు కదా!

 

“అదే… భార్య భర్త పేరును నేరుగా పిలవకూడదు కదా! అందుకే చెప్పలేదు.”

 

అంటూ మెల్లగా సమాధానమిచ్చింది.

 

చెప్పిన తర్వాత మధు ముఖంలో ఎలాంటి మార్పు వస్తుందోనని ఆమెనే గమనిస్తూ కూర్చుంది.

 

మధుకి కూడా మొదట వదిన చెప్పిన మాట కరెక్టే అనిపించింది.

 

‘అవును కదా! కొంతమంది ఇప్పటికీ భర్త పేరును నేరుగా పలకడానికి ఇష్టపడరు.’

 

అని అనుకుంది.

 

కానీ మరుక్షణమే మరో ఆలోచన వచ్చింది.

 

‘అయినా ఇప్పుడు చాలామంది పేర్లతోనే పిలుస్తున్నారు కదా! మరి వదిన మాత్రం ఎందుకు ఇంతలా మొహమాటపడుతున్నారు?’

 

అనుకుంటూ సంయుక్త ముఖంలోకి మరోసారి చూసింది.

 

ఏదో అనుమానం వచ్చినట్టుగా కనుబొమ్మలు కాస్త పైకెత్తి,

 

“వదినా… ఒక చిన్న డౌట్!”

 

అంది.

 

“ఏంటి?” అన్నట్టుగా సంయుక్త ఆమె వైపు చూసింది.

 

మధు కాస్త ముందుకు వంగి, కళ్లను చిన్నగా చేస్తూ అడిగింది.

 

“వదినా… మీకు అసలు మా అన్నయ్య పేరు తెలుసా?”

 

ఆ ప్రశ్న వినగానే సంయుక్త ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 

‘అయ్యో! ఈ అమ్మాయి ఏంటి? ఇంతలోనే అసలు విషయాన్ని కనిపెట్టేసిందా?’

 

అంటూ మనసులోనే కంగారు పడింది.

 

ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి?

 

తెలుసని చెబితే పేరు అడుగుతుంది. తెలియదని చెబితే ఇంతవరకు తన అన్నయ్యను చూడకుండానే పెళ్లి చేసుకున్నానని తెలిసిపోతుంది!

 

సంయుక్త ముఖంలో ఒక్కసారిగా మారిన భావాలను గమనించిన మధు, తన అనుమానం నిజమేనేమో అన్నట్టుగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది…

 

ఇంకా ఉంది….

 

మీ నందు ❤️