New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
🩷 పాప ముడి పెట్టిన బంధం 🩷 – 1

🩷 పాప ముడి పెట్టిన బంధం 🩷 – 1

 

ప్రోమో:

భూమి… ఆకాశమంత ఓర్పు, భూదేవి అంత సహనం ఉన్న అమ్మాయి. అందరినీ ప్రేమగా చూసుకుంటూ, ఎన్ని బాధలున్నా తన మనసులోనే దాచుకొని, పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది. తన బాధను ఎవరికీ చెప్పుకోదు. తనవాళ్లు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటుంది.

 

విక్రమ్… గతంలో జరిగిన ఓ సంఘటన అతన్ని మనుషులను నమ్మలేని వ్యక్తిగా మార్చేసింది. ఎప్పుడూ కఠినమైన చూపులతో, సీరియస్‌గా ఉండే అతన్ని చూస్తేనే అందరూ వణికిపోతారు. అలాంటి విక్రమ్… ఐదేళ్ల చిన్న పాప దగ్గర మాత్రం ఓ పసివాడిలా మారిపోతాడు. ఆ పాపతో గడిపే క్షణాల్లో తన బాధలన్నీ మర్చిపోతాడు.

 

అసలు భూమికి, విక్రమ్‌కి మధ్య బంధం ఎలా మొదలైంది? 

ఆ ఐదేళ్ల పాప వీళ్లిద్దరినీ ఎలా కలిపింది?

 

వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఈ బంధానికి ఓ అగ్రిమెంట్ కారణమైతే…

 

మరి ఆ అగ్రిమెంట్‌తో మొదలైన ప్రయాణం ప్రేమగా మారుతుందా? 

లేక అగ్రిమెంట్ గడువు ముగిసిన రోజున ఈ బంధం కూడా ముగిసిపోతుందా? 🥹❤️

 

తెలుసుకోవాలంటే చదవండి…

 

🩷 పాప ముడి పెట్టిన బంధం 🩷

 

చైతన్యపురి, హైదరాబాద్.

చైతన్యపురిలో ఉన్న ఓ ప్రశాంతమైన వీధిలో భూమి ఇల్లు ఉంది. ఇంటి ముందు చిన్న తోట, చుట్టూ పచ్చని మొక్కలు, గుమ్మం ముందు అందమైన ముగ్గు… ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆప్యాయత నిండిన వాతావరణం కనిపిస్తుంది.

 

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ చిన్న ఇంట్లో ఖరీదైన వస్తువులు లేకపోయినా, మనసు నిండా ప్రేమలు, ఒకరిపై ఒకరికి అంతులేని ఆప్యాయతలు ఉంటాయి. ఆ ఇంట్లో ప్రతి మూలా భూమి వాళ్ల అమ్మ జ్ఞాపకాలు, భూమి తన తండ్రి, చెల్లెలిపై చూపించే అంతులేని ప్రేమే కనిపిస్తాయి. ❤️🏡

 

భూమి ఉదయం ఐదు గంటలకే లేచి, పూజ చేసుకొని వంట చేస్తూ ఉంటుంది. వంట పూర్తయిన తర్వాత తన చెల్లెలు పూజను నిద్రలేపడానికి వెళ్తుంది.

పూజ ఒక చిన్న చంటిపాపలా నిద్రపోతూ కనిపిస్తుంది.

 

పూజ దగ్గరికి వెళ్లి, ప్రేమగా తల మీద ముద్దు పెట్టుకుని, “గుడ్ మార్నింగ్ పూజ తల్లి!” అని ఆప్యాయంగా నిద్రలేపుతుంది.

 

పూజ కళ్ళు తెరచి భూమిని చూసి, గట్టిగా హగ్ చేసుకుని, “గుడ్ మార్నింగ్ అక్క!” అని చెప్తుంది.

“త్వరగా లే తల్లి! కాలేజీకి టైం అయిపోతుంది. తొందరగా ఫ్రెష్ అయ్యి రా. నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను,” అంటూ పూజను వాష్‌రూమ్‌లోకి పంపిస్తుంది.

 

పొద్దున్నే లేచి వాకింగ్‌కి వెళ్లిన రామకృష్ణగారు తిరిగి ఇంటికి వస్తారు. భూమి తన చెల్లెలిని ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో గమనిస్తున్న రామకృష్ణగారికి ఒక్క క్షణం తన భార్య శారద గుర్తుకు వస్తుంది.

 

భూమి అచ్చం తన అమ్మలాగే ఉంటుంది.

చూడచక్కని రూపంతో, కొంచెం బొద్దుగా, ముఖంపై ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చిన్న చిరునవ్వుతో వాటన్నింటినీ ఎదుర్కొంటూ, ధైర్యంగా ముందుకు వెళ్లే మంచి అమ్మాయి.

 

విక్రమ్:

ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ముఖం, ఆరడుగుల ఎత్తు, ఫిట్ బాడీ… ఎప్పుడు చూసినా ముఖం మీద ఎటువంటి నవ్వు లేకుండా కఠినంగా కనిపించే రూపం. ఎవరినీ సులభంగా నమ్మని వ్యక్తిత్వం.

ఆఫీస్‌లో ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించే వ్యక్తి. అలాంటి విక్రమ్, ఐదేళ్ల చిన్న పాప దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరి చేస్తాడు.

తన అక్క ప్రతిరూపమైన ఆ చిన్నారి ఆద్య అంటే విక్రమ్‌కి పంచప్రాణాలు.

 

తన కుటుంబానికి జరిగిన ప్రమాదంలో తన అక్కతో పాటు తండ్రిని కూడా కోల్పోయాడు. ఇంటి బాధ్యతలను చిన్న వయసులోనే తన మీద వేసుకొని, సిటీలోనే నంబర్ వన్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదిగాడు.

 

తను కోల్పోయిన తన అక్క, తండ్రి మరణాల వెనుక ఓ దుర్మార్గుడి కుట్ర ఉందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు.

 

ప్రేమ పేరుతో తన అక్కను మోసం చేసి, ఆమె మరణానికి కారణమైన ఆ మూర్ఖుడిపై పగ తీర్చుకోవడానికి విక్రమ్ తనకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోడు.

 

విక్రమ్‌కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతనే విరాట్. అల్లరి పనులతో ఎప్పుడూ సరదాగా ఉంటాడు.

 

విక్రమ్ తల్లి సులోచన తన భర్తను కోల్పోయి, బిడ్డను కోల్పోయి అంతులేని విషాదంలో బతుకుతుంది. తన కూతురి బిడ్డ ఆద్యను తన చేతులతో పెంచుతూ, అమ్మలేని లోటు తెలియకుండా చూసుకుంటుంది.

 

ఒకరోజు సులోచనగారు విక్రమ్‌తో మాట్లాడుతూ,

“ఆద్యకు ఐదు సంవత్సరాలు వచ్చాయి. విక్రమ్, తనని స్కూల్లో వేయాలి కదా!” అని అడుగుతారు.

 

“తనకి స్కూల్‌కి వెళ్లాల్సిన అవసరం ఏముంది, అమ్మా? అవసరమైతే స్కూలే మన ఇంటికి వస్తుంది,” అంటాడు విక్రమ్.

 

విక్రమ్ అలా అనగానే విరాట్ కలుగజేసుకుంటూ,

“అది కాదన్నయ్యా! స్కూల్లో అయితే పిల్లలతో ఆడుకుంటూ చక్కగా చదువుకుంటుంది.

 

ఆద్య ఎప్పుడూ ఒక్కతే ఉండటం కూడా మంచిది కాదు. తను బయట ప్రపంచాన్ని చూడాలి. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవాలి.

 

అందరి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ తన బాల్యాన్ని ఎంజాయ్ చేయాలి. ఇలా ఇంట్లో ఉంచి తన చుట్టూ గోడ కట్టడం మంచిది కాదు,” అని అంటాడు.

 

అది విన్న విక్రమ్ చివ్వాల్న ఓ చూపు చూస్తాడు.

సులోచనగారు మాట్లాడుతూ,

 

“నువ్వు ఎలా చూసినా, వాడు చెప్పినదాంట్లో తప్పేం లేదు విక్రమ్. తనకి అందరి పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది కదా! ఒకసారి నువ్వే బాగా ఆలోచించుకో. మనం ఎవరికో భయపడి ఆద్యను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు,” అంటారు.

 

“ఈ విక్రమ్ ఎవరికీ భయపడడు అమ్మా! ఆద్య స్కూల్‌కి వెళ్తుంది. నాకు రెండు రోజులు టైం ఇవ్వండి. సిటీలో ఉన్న ది బెస్ట్ స్కూల్లో ఆద్య చదవాలి.

 

విరాట్, స్కూల్స్ అన్నీ నువ్వే దగ్గరుండి ఎంక్వయిరీ చేసి, బెస్ట్ స్కూల్ ఏదో నాకు చెప్పు,” అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్లిపోతాడు.

 

To be connected……