మౌనమే ని భాష – 1
నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి.
సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది.
మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది.
కిటికీ తెరలు జరిపి బయటకు చూసింది. తెల్లవారుజామున వచ్చే ఆ చల్లటి గాలి శ్రావణి ముఖాన్ని తాకినప్పుడు ఆమె పెదవుల మీద ఒక చిన్న మెరుపు లాంటి నవ్వు మెరిసింది.
అది కేవలం ఆమెకు, ఆ ప్రకృతికి మాత్రమే తెలిసిన రహస్యం. గది మూలన ఉన్న చిన్న అల్మారాలో అన్నీ పుస్తకాలే.
పక్కనే ఒక చిన్న టేబుల్, దాని మీద ఒక వెలిగి ఆరిపోయిన కొవ్వొత్తి, ఒక పెన్ను, ఆమె ప్రాణప్రదంగా దాచుకునే ఆ డైరీ.
శ్రావణి వంటింట్లోకి వెళ్లి స్టౌ వెలిగించి నీళ్లు కాచుకుంది. ఆమె చేసే ప్రతి పనిలో ఒక లయ ఉంటుంది. పాత్రల చప్పుడు కూడా బయటకు వినిపించనంత నిశ్శబ్దంగా ఆమె వంట పని సాగుతుంది.
తన కోసం తనే రెండు చపాతీలు, కొంచెం కూర చేసుకుని చిన్న క్యారియర్ డబ్బాలో సర్దుకుంది. ఆమె జీవితం ఒక పరిమితమైన చట్రం. అందులో హడావిడి లేదు ఆడంబరాలు లేవు.
స్నానం ముగించుకుని గదిలోకి వచ్చిన శ్రావణి, తన వార్డ్రోబ్ తెరిచింది. అందులో వరుసగా పేర్చిన కాటన్ చీరలు. ఆమె ఈరోజు కోసం ఒక లేత నీలం రంగు కాటన్ చీరను ఎంచుకుంది.
చీర కట్టుకోవడంలో శ్రావణికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. కొంగును భుజం మీద పిన్ చేసి, ఎక్కడా చెదరకుండా అమర్చుకుంది.
మెడ వరకు ఉన్న బ్లౌజ్, చేతులకు రెండు మట్టి గాజులు, నుదుటన ఒక చిన్న ఎర్రటి బొట్టు. అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు ఆమెకు ఒక తృప్తి కలిగింది.
ఆమె వేషధారణే ఆమెకు రక్షణ కవచంలా అనిపిస్తుంది. నేటి తరం అమ్మాయిల్లా జీన్స్, టీషర్ట్స్ వైపు ఆమె కన్నెత్తి కూడా చూడదు. ఆ చీరకట్టులోని హుందాతనం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
సరిగ్గా ఎనిమిది గంటలకు తన బ్యాగ్ సర్దుకుని ఇల్లు తాళం వేసి బయటకు వచ్చింది. మెట్ల మీద దిగుతున్నప్పుడు పక్కింటి ఆవిడ పలకరించినా,
కేవలం ఒక చిన్న నవ్వుతో సమాధానమిచ్చి ముందుకు సాగింది. మాటల కంటే మౌనమే ఆమెకు ఎక్కువ ఇష్టం.
శ్రావణి పనిచేసే ఆఫీస్ ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ. చుట్టూ ఏసీ శబ్దాలు, కంప్యూటర్ కీబోర్డ్ ల టకటకలు. శ్రావణి తన క్యాబిన్ లోకి వెళ్ళి సీట్లో కూర్చుంది.
ఆమె చేసేది డేటా అనలిస్ట్ వర్క్. నెంబర్స్, గ్రాఫ్లతో ఆమెకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆమె టేబుల్ మీద కూడా అనవసరమైన వస్తువులు ఏవీ ఉండవు.
గుడ్ మార్నింగ్ శ్రావణీ అంటూ రమ్య సందడిగా లోపలికి వచ్చింది.రమ్య, శ్రావణికి ఉన్న బెస్ట్ ఫ్రెండ్. నిజానికి శ్రావణికి ఉన్న ఏకైక ఫ్రెండ్ రమ్యనే.
రమ్య చాలా ఉత్సాహవంతురాలు, శ్రావణికి పూర్తి విరుద్ధం.ఏంటి ఇవాళ కూడా ఇంత పద్ధతిగా వచ్చావు. ఈ సారీలో నువ్వు ఒక ప్రొఫెసర్ లా ఉన్నావు తెలుసా అంది రమ్య నవ్వుతూ.
శ్రావణి మెల్లగా తల ఊపి థాంక్యూ రమ్య. వర్క్ చాలా ఉంది స్టార్ట్ చేయాలి అంది.అబ్బా.. ఎప్పుడూ వర్క్ గురించేనా,కొంచెం ఆ సరదా కబుర్లు చెప్పు.
నిన్న ఒక సినిమా చూశాను, అందులో హీరోయిన్ సరిగ్గా నీలాగే ఉంటుంది కానీ చాలా గడుసుది అని రమ్య కథలు చెప్తుంటే శ్రావణి వింటూ ఉంటుంది.
తను మాట్లాడదు కానీ రమ్య మాటలను ఎంజాయ్ చేస్తుంది. రమ్య ఒక్కతే శ్రావణిని తన మౌనం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించే వ్యక్తి.
లంచ్ టైమ్ లో అందరూ కలిసి క్యాంటీన్ కి వెళ్తుంటే, శ్రావణి మాత్రం తన సీట్లోనే కూర్చుని క్యారియర్ విప్పుతుంది. రమ్య బలవంతం మీద అప్పుడప్పుడు క్యాంటీన్ కి వెళ్తుంది.
శ్రావణీ నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో నాకు ఎప్పటికైనా చెప్తావా అసలు నీకెందుకు ఎవరూ లేరు.నువ్వు ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటావు అని రమ్య అడిగినప్పుడు శ్రావణి కళ్ళల్లో ఒక చిన్న నీటి పొర మెరుస్తుంది.
కానీ మరుక్షణమే దాన్ని దాచుకుని అదేమీ లేదు రమ్య, నాకు ఇలా ఉండటమే ఇష్టం అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
సాయంత్రం ఐదు గంటలు కాగానే శ్రావణి తన వర్క్ అంతా క్లియర్ చేసుకుని బ్యాగ్ సర్దుకుంది.
ఆఫీస్ లోని మిగతా అమ్మాయిలు సాయంత్రం పబ్స్ కి లేదా షాపింగ్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటుంటే, శ్రావణి మాత్రం నేరుగా బస్టాప్ వైపు అడుగులు వేసింది.
మళ్ళీ అదే బస్సు ప్రయాణం. కిటికీ పక్కన కూర్చుని బయట మారుతున్న లోకాన్ని చూస్తూ శ్రావణి తనలోకి తాను వెళ్ళిపోతుంది.
ఇంటికి చేరుకోగానే తలుపు తీసి లోపలికి వెళ్ళిన ఆమెకు మళ్ళీ ఆ నిశ్శబ్దం స్వాగతం పలుకుతుంది. చీకటి పడుతుండటంతో దీపం వెలిగించి, దేవుడికి నమస్కారం చేసుకుంటుంది.
రాత్రి వంట కూడా చాలా సింపుల్ గా ముగించి, తను తెచ్చుకున్న కూరగాయలను నీట్ గా సర్ది పెడుతుంది. రాత్రి ఎనిమిది గంటలకల్లా తన పనులన్నీ పూర్తి చేసుకుంటుంది.
ఆ తర్వాతే ఆమెకు అత్యంత ఇష్టమైన సమయం మొదలవుతుంది. ఆ టేబుల్ దగ్గర కూర్చుని, తన డైరీ తీసి, ఆ రోజంతా తన మనసులో మెదిలిన భావాలను అక్షరాల్లో పెడుతుంది.
చుట్టూ జనం.. వినిపించని నా మౌనం!
లోకమంతా వెలుతురు.. నాలో మాత్రం మిగిలింది ఈ చీకటి తీరం!!
ఆమెకు ఆధునిక జీవనశైలి మీద విరక్తి లేదు కానీ, ఆమె గతం ఆమెను ఈ ప్రశాంతత వైపు నడిపించింది. రాత్రి పడుకునే ముందు కూడా తన గదిని, కిటికీలను సరిచూసుకుని,
రేపటి కోసం మళ్ళీ తనను తాను సిద్ధం చేసుకుంటుంది. శ్రావణి జీవితం ఒక నది లాంటిది.. పైన నిశ్శబ్దంగా కనిపిస్తున్నా, లోపల ఎంతో లోతు ఉంటుంది.
కొనసాగుతుంది..,……….
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…
Swipe left/right or tap the sides to turn pages