మౌనమే ని భాష – 3
ఆ రోజు ఉదయం వంశీకి అంతా హడావిడిగా మొదలైంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డెలివరీ ఉండటంతో త్వరగా ఆఫీస్కు వెళ్లాలని సిద్ధమయ్యాడు.
తన రాయల్ ఎన్ఫీల్డ్ బండి కీస్ కోసం టేబుల్ మీద వెతికాడు కానీ అక్కడ లేవు.అమ్మా నా బండి కీస్ ఏవి అని వంశీ అరిచాడు.
సరస్వతి గారు వంటింట్లోంచి వస్తూ,అయ్యో.. చెప్పడం మర్చిపోయాను నాన్న. రవి కాలేజీలో ఏదో స్పెషల్ ఈవెంట్ ఉందట, నీ బండి మీద వెళ్తానని పొద్దున్నే తీసుకెళ్ళాడు అని చెప్పారు.
వంశీ తల పట్టుకున్నాడు. వీడు ఎప్పటికీ మారడు. కనీసం అడగాలి కదా అని విసుక్కుంటూ సరేలే, ఇవాళ కార్లో వెళ్తాను అని చెప్పి కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చాడు.
వంశీ తన వైట్ కలర్ సెడాన్ కార్ స్టార్ట్ చేసి మెయిన్ రోడ్డు మీదకు వచ్చాడు. రేడియోలో పాత మెలోడీ సాంగ్ వస్తోంది. వంశీ ఆ పాటను ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు.
కానీ నగరం మధ్యలోకి రాగానే హఠాత్తుగా కారు ఇంజిన్ నుంచి ఒక వింత శబ్దం రావడం మొదలైంది. ఏమైందో అర్థం కాక వంశీ కారును రోడ్డు పక్కకు ఆపాడు.
ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా కారు మొరాయించింది.
ఛ ఈరోజే ఇలా జరగాలా అని గడియారం చూసుకున్నాడు.
మీటింగ్కు టైమ్ అవుతోంది. వెంటనే మెకానిక్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కారును అక్కడే సురక్షితమైన చోట పార్క్ చేసి లాక్ చేశాడు.
అప్పుడే ఒక సిటీ బస్సు స్టాప్ దగ్గరకు వచ్చి ఆగడం చూశాడు. ఇంకేం ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ బస్సు ఎక్కాడు.
బస్సులో విపరీతమైన రద్దీ ఉంది. వంశీ లోపలికి వెళ్లి ఒక రాడ్ పట్టుకుని నిలబడ్డాడు. అతని చూపులు కిటికీ పక్కన కూర్చున్న ఒక అమ్మాయి మీద పడ్డాయి.
కానీ వంశీకి ఆమె ముఖం కనిపించడం లేదు. ఆమె వెనక నుండి మాత్రమే కనిపిస్తోంది.ఆమె కట్టుకున్న ఆ పద్ధతైన చీర, నీట్గా అల్లిన జడ, వంశీకి ఆమెను చూడగానే ఒక తెలియని ప్రశాంతత అనిపించింది.
బస్సులోని హడావిడి, జనం అరుపులు ఏవీ ఆమెను తాకడం లేదు. ఆమె తన ప్రపంచంలో తను నిశ్శబ్దంగా ఉంది.
వంశీ ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ముఖం చూడాలనే కుతూహలం కలిగినా, అక్కడ ఉన్న రద్దీ వల్ల అతను ముందుకు వెళ్లలేకపోయాడు.
ఆమె కేవలం ఒక అందమైన చిత్రంలా అతని కళ్ళ ముందు ఉంది.బస్సు ఒక రద్దీగా ఉండే స్టాప్లో ఆగింది. శ్రావణి హడావిడిగా లేచి దిగడానికి సిద్ధమైంది.
ఆమె తన బ్యాగ్ సర్దుకుని ముందుకు జరుగుతున్నప్పుడు, ఆమె బ్యాగ్ చైన్ సరిగ్గా లాక్ అవ్వకపోవడం వల్ల అందులో ఉన్న ఆ లెదర్ కవర్ డైరీ మెల్లగా జారి సీటు కింద పడిపోయింది.
శ్రావణి అది గమనించలేదు. జనం తోపులాటలో ఆమె బస్సు దిగి పక్కకు వెళ్ళిపోయింది.వంశీ అది చూశాడు. హలో ఎక్స్క్యూజ్ మీ మీ బుక్ పడిపోయింది అని గట్టిగా అరిచాడు.
కానీ అతని గొంతు బస్సు ఇంజిన్ చప్పుడులో, జనం కేకల్లో కలిసిపోయింది. అతను కిటికీలోంచి ఆమెను పిలవాలని చూశాడు, కానీ ఆమె అప్పటికే జనారణ్యంలో కలిసిపోయింది.
వంశీ వంగి ఆ డైరీని తీసుకున్నాడు. దాని మీద ఉన్న లెదర్ కవర్ స్పర్శ చాలా వింతగా ఉంది. ఏదో ఒక పాత కాలపు జ్ఞాపకాన్ని తాకినట్టు అనిపించింది.
ఎవరో కానీ చాలా జాగ్రత్తగా దాచుకునే డైరీలా ఉందే పాపం ఆ అమ్మాయి ఎంత కంగారు పడుతుందో అని మనసులో అనుకున్నాడు. ఆ డైరీని తన బ్యాగ్ లోపల భద్రంగా పెట్టుకున్నాడు.
వంశీ ఆఫీస్కు చేరుకునేసరికి మీటింగ్ మొదలైపోయింది. సాయి అతన్ని చూసి ఏరా ఇంత లేట్ అయింది కారు ఏమైంది అని మెల్లగా అడిగాడు.
వంశీ సైగతో తర్వాత చెప్తానని చెప్పి పనిలో పడిపోయాడు. ఆ రోజంతా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్, ప్రెజెంటేషన్స్.
వంశీ తన టీమ్తో కలిసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చర్చించడంలో పూర్తిగా మునిగిపోయాడు. అతని బ్యాగ్ మూలలో ఉన్న ఆ డైరీ గురించి అతను పూర్తిగా మర్చిపోయాడు.
సాయి మధ్యలో వచ్చి, వంశీ లంచ్ కి వెళ్దామా అని అడిగినా,లేదు సాయి, ఈ రిపోర్ట్ పూర్తి చేయాలి, నువ్వు వెళ్ళు అని చెప్పి పనిలోనే ఉండిపోయాడు.
మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వంశీకి శ్వాస తీసుకోవడానికి కూడా తీరిక లేకుండా పోయింది. ఆ డైరీని తీసి చూసే ఆలోచనే అతనికి రాలేదు.
అది ఒక మామూలు నోట్ బుక్ ఏమో అని అతను భావించాడు.సాయంత్రం ఆరు గంటలు దాటింది. ఆఫీస్ ఖాళీ అవుతోంది.
వంశీ తన టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ సర్దుకున్నాడు. ల్యాప్టాప్ బ్యాగ్ తీసి భుజానికి తగిలించుకున్నాడు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది..
తన బ్యాగ్ లో ఒక అపరిచిత అమ్మాయికి చెందిన డైరీ ఉందని.అయ్యో దీన్ని ఇప్పుడే చూద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అని అనుకుంటూ బ్యాగ్ లో చెయ్యి పెట్టాడు.
ఆ డైరీ స్పర్శ తగలగానే అతని మనసులో మళ్ళీ ఆ బస్సులో చూసిన ఆ అమ్మాయి ఆకారం మెదిలింది. కానీ ఆఫీస్ టైమ్ అయిపోవడంతో సరేలే ఇంటికి వెళ్ళాక తీరికగా చూద్దాం అని నిర్ణయించుకుని ఆఫీస్ నుండి బయటకు నడిచాడు.
విధి ఒకరి జీవితంలోని అత్యంత విలువైన భావాలను, మరొకరి బాధ్యతాయుతమైన చేతుల్లో పెట్టింది. ఆ డైరీలో ఏముందో వంశీకి ఇంకా తెలియదు.
ఆ డైరీ పోయిందని శ్రావణి పడే వేదన వంశీకి ఇంకా వినిపించలేదు. కానీ ఆ రాత్రి వారిద్దరి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది కాబోతోంది.
కొనసాగుతుంది…….
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్..
Swipe left/right or tap the sides to turn pages